ఇంతకాలం రామ్‌గోపాల్‌వర్మకి చెప్పుకోతగ్గ సినిమాలు రాలేదు. సర్కార్ 3మినహాయిస్తే ఇటీవల అతనితో పేరున్న నటులు ఎవరూ పని చేయలేదు. ఏదో కాలక్షేపానికి సినిమాలు తీసుకుంటున్నట్టు కొత్త వారితో కానిచ్చేస్తోన్న వర్మకి తనకి 'శివ' ఇచ్చాడనే కృతజ్ఞతతోనో, మరెందుకో నాగార్జున మరో చిత్రం చేస్తున్నాడు.
ఈ టైమ్‌లో వర్మతో నాగార్జున పని చేయడం గొప్ప విషయం. ఇటీవల వర్మ తీస్తున్న సినిమాలు చూసిన వారయితే నాగార్జున నిర్ణయానికి షాక్ తిన్నారు. అక్కినేని అభిమానులు అయితే ఇప్పుడెందుకు అన్నట్టు కలత పడుతున్నారు. నాగార్జునతో సినిమా రావడంతో ఇక వర్మ తను తీసే తల తోక లేని సినిమాలని పక్కన పడేసి పూర్తి దృష్టి దీనిపై పెడతాడని భావించారు.
కానీ వర్మ మాత్రం తన ధోరణి మార్చుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే మరింత రెబల్‌గా మారిపోయి నగ్న దృశ్యాలని, బూతులని తన క్రియేషన్స్‌లో భాగం చేసేసాడు. పోర్న్ స్టార్‌తో వర్మ తీస్తోన్న వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఇక వెబ్ సిరీస్‌లంటూ తను చేస్తోన్న దాడి గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది? నాగార్జునతో సినిమా అనేసరికి పూర్వపు వర్మ తిరిగి వస్తాడనే ఆశలు మిణుకుమన్న వారికి సైతం ఇప్పుడతను తలపెడుతోన్న చిత్రాలని చూసి మతి పోతోంది.