గత సంక్రాంతికి మూడు సినిమాలు విడుదలైతే థియేట్రికల్ షేర్ మాత్రమే రెండువందల కోట్ల వరకు వసూలైంది. అంతకుముందు ఏడాది నాలుగు చిత్రాలు రిలీజ్ అయితే షేర్ నూట యాభై కోట్ల వరకు వచ్చింది. తెలుగు సినిమా బాక్సాఫీస్ ప్రకారం సంక్రాంతి ఎంత బలమైన సీజన్ అనేది ఇది తెలియజేస్తుంది. ఇంత కెపాసిటీ వున్న ఈ సీజన్‌ని ఫుల్‌గా క్యాష్ చేసుకునే అవకాశాన్ని ఈ ఏడాది టాలీవుడ్ కోల్పోయింది.
అజ్ఞాతవాసి భారీ హిట్ అయివుంటే ఖచ్చితంగా నూట పాతిక కోట్ల పైగానే బిజినెస్ జరిగి వుండేది. అలాగే బాలకృష్ణ జై సింహాకి కూడా నలభైకోట్ల పైగానే మార్కెట్ వుండేది. మిగిలిన సినిమాలతో కలిపి కనీసం రెండు వందల కోట్ల వ్యాపారానికి ఆస్కారమున్న ఈ సీజన్ ఈసారి నీరుగారిపోయేట్టుంది. అజ్ఞాతవాసి డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం, జైసింహా కూడా నీరసంగా వుండడంతో భారీ వసూళ్ల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.
ఏదైనా చెప్పుకోతగ్గ మరో పెద్ద చిత్రం వచ్చినట్టయితే లోటు భర్తీ అయివుండేది. కానీ అజ్ఞాతవాసికి భయపడి చాలా మంది వెనక్కి తగ్గారు. తీరా అజ్ఞాతవాసి తుస్సుమనడంతో వెంటనే రిలీజ్ చేయడానికి కూడా ఏ సినిమా లేకుండా పోయింది.
గ్యారెంటీ వసూళ్లు వచ్చే సీజన్ ఇలా వేస్ట్ అవడం టాలీవుడ్‌కి పెద్ద దెబ్బే. ఈ ఏడాదిలో ఎక్కువ చిత్రాలు రిలీజ్ అయ్యే ఛాన్సులున్నాయి కనుక ఎప్పటికప్పుడు కొత్త ఆప్షన్లు వుంటాయి. దీంతో అన్ని సినిమాలకీ లాంగ్ రన్ అవకాశాలు బాగా తగ్గుతాయి. ఎలా చూసినా ఈ ఏడాదికి చాలా బ్యాడ్ స్టార్ట్ ఇది.