ఎనిమిది మంది నిర్మాతలు కలిసి ఓ సిండికేట్ ఏర్పాటు చేసుకున్నారు. సినిమా ప్రకటనలకు సంబంధించి తమ ప్లాన్ తాము తయారుచేసుకున్నారు. వీరిలో దిల్ రాజు, పరుచూరి ప్రసాద్, స్రవంతి రవికిషోర్, ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి, రంజిత్ మూవీస్ దామోదర్ ప్రసాద్, మరో ఇద్దరు ఈ సిండికేట్ లో వున్నారు. వీరు ఇలా ప్రకటనలు నియంత్రించే వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే నట్టికుమార్ లాంటి నిర్మాతలు ముందుగా గొంతెత్తారు. నిన్నటికి నిన్న తమ్మారెడ్డి భరద్వాజ గొంతుకలిపారు. ఇప్పుడు ఏకంగా మంచు మోహన్ బాబు ధ్వజమెత్తారు. లఫూట్ గాళ్లు అంటూ తన దైన స్టయిల్ లో మాటల ఈటెలు విసిరారు. ఆయనతో కలిపి ముగ్గురు హీరోలు, ముగ్గురు నిర్మాతలు, ఓ హీరోయిన్ వున్న ఫ్యామిలీ అది. అంటే టాలీవుడ్ లో సిండికేట్ కు వ్యక్తమవుతున్న నిరసనకు గట్టి మద్దతు దొరికినట్లే.
అయితే ఈ వ్యవహారంపై సిండికేట్ ఏమనుకుంటోంది..అన్నదాన్ని ఆరా తీస్తే పరిస్థితి చిత్రంగా వుంది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ కామెంట్ చేసినా, మనం ఎవరూ ఏ విధంగానూ స్పందించవద్దన్నది ఈ సిండికేట్ నిర్మాతల వ్యూహమట. ‘ఇది మన వ్యాపారం..మన వ్యాపారం కోసం, మన ఖర్చు తగ్గించుకోవడం కోసం మనం కొన్ని పద్దతులు పాటించాలని అనుకుంటున్నాం..అంతేకానీ అందరినీ పాటించమని అడగడం లేదు..బలవంత పెట్టడం లేదు. ‘ అని సిండికేట్ నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు.
‘మనకు కావాల్సన చోట్ల ఖర్చులు మనం తగ్గించుకోవాలి అనకోవడం ఘోరాపరాథం ఎందుకు అవుతుంది..అయినా ఇలా ప్రతి ఒక్కరు కామెంట్ చేసిందానికి ప్రతిస్పందించడం వల్ల అనవసరంగా రచ్చ చేసుకోవడం అవుతుంది. మనకు కావాల్సింది మన పని జరగడం..’ అని సిండికేట్ జనాలు అభిప్రాయపడుతున్నారట.
మరోపక్క మీడియా మద్దతు ప్రీగా లభిస్తుంది కనుకనే ఈ సిండికేట్ మీద పలువురు ధ్వజమెత్తుతున్నారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. తమ్మారెడ్డి భరద్వాజ సినిమా తీసి చాన్నాళ్లయింది. ఆయన సిన్మా నిర్మాణంతొ కనెక్ట్ అయి చాలా కాలం అయింది. నిజానికి అలాంటి వాళ్లు ఎవరైనా మీడియా మీట్ పెడితే, మహా అయితే సింగిల్ కాలమ్ వార్త అవుతుంది. అయితే ఇప్పుడు సిండికేట్ అంటే మంటగా వున్న మీడియా ఈ తరహా వార్తలను పేరాలకు పేరాలు ప్రచురిస్తోంది.
సరే ఇదేదో బాగానే వుందని వీరు మాట్లాడుతున్నారు అంటున్నారు. పైగా ఇప్పుడు మోహన్ బాబు కావాలని మాట్లాడలేదు. చిట్ చాట్ లో మాట్లాడుతున్నపుడు మీడియా అడిగితే స్పందించారు. ఆయన ఇంటి నుంచి దొంగాట వచ్చింది…రేపు సింగం 123 , డైనమేట్ రావాల్సి వుంది. అందువల్ల మీడియా పబ్లిసిటీ అవసరం చాలా వుంది.
అందుకే మోహన్ బాబు ఇలా స్పందించి వుంటారని సిండికేట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయినా కూడా తమ పని, ప్లానింగ్ తాము చేసుకుపోవడం తప్ప, అస్సలు రెస్పాండ్ కావద్దని సిండికేట్ నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చేసారట.