వంద చిత్రాలు పూర్తి చేసిన టాలీవుడ్ హీరోల్లో శ్రీకాంత్ ఒకరు. అయితే ఆయన సినిమాలు మాత్రం ప్రస్తుతం విడుదలకు నోచుకోకుండా ఆగిపోయే దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. సినిమా విడుదలలు- సూపర్ హిట్ లాంటి విజయావకాశాల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. కనీసం శాటిలైట్ మార్కెట్ స్థిరంగా ఉన్న హీరోల్లో ఒకరు గనుక.. శ్రీకాంత్ చిన్న మరియు ఔత్సాహిక నిర్మాతలు దర్శకులు చాలా మంది సినిమాలు చేసేశారు. కొన్ని సినిమాలు పూర్తయిపోయాయి. కొన్ని పూర్తయ్యే దశలో కిందా మీదా అవుతున్నాయి. ఏది ఎలా ఉన్నా సినిమాలకు మాత్రం అనుకున్నంతగా కాదు కదా.. కనీసం విడుదలకు నోచుకునేంతగా కూడా బిజినెస్ జరగడం లేదని రూపకర్తలు ఆవేదన చెందుతున్నారు.
శ్రీకాంత్ హీరోగా నటించిన క్షత్రియ చిత్రం ఇప్పటికే పూర్తయిందని అంటున్నారు. ఇది కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్ అంటూ ప్రకటించారు. అయినా సరే.. దీనికి మాత్రం బిజినెస్ కాలేదు. అదే మల్లిగాడి మ్యారేజ్ బ్యూరో విషయంలో పరిస్థితి మరో రకంగా ఉంది. ఇది ఫక్తు కామెడీ చిత్రం గనుక శాటిలైట్ బిజినెస్ అయిందని సమాచారం. అలాగే జర్నలిస్టు ప్రభు దర్శకుడిగా తెరంగేట్రం చేస్తూ శ్రీకాంత్‌తో మొండోడు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దానిని యాక్షన్ మసాలా చిత్రంగా ప్రకటించారు. దీనికి కూడా బిజినెస్ అయ్యే దాఖలాలు కనిపించడం లేదు.
అలాగే ఆకెళ్ల వంశీ ఆచార్య అని ఒక చిత్రాన్ని , మరో కోడిపుంజు అనే చిత్రం కూడా శ్రీకాంత్‌తో రూపొందుతోంది. శ్రీకాంత్ హీరోగా మాస్ మరియు మసాలా చిత్రం అనగానే.. బిజినెస్ ఢామ్మని పడిపోతోందని ఇండస్ట్రీ వర్గాల కథనం.. అదే సమయంలో.. కామెడీ చిత్రం చేస్తే మాత్రం బిజినెస్ ఉంటుందని.. శాటిలైట్ కొనుగోళ్లు చేసేవారు హింట్స్ ఇస్తున్నప్పటికీ.. శ్రీకాంత్ మాత్రం తనకు మాస్ సినిమాలే చేయాలని ఉన్నదంటూ కోరుకుంటున్నారని, అందుకే బిజినెస్ లేక ఆగిపోతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.