‘బిడ్డ చచ్చినా పురిటివాసన పోలేద’న్న చందంగా తయారైంది హీరో రాంచరణ్ పరిస్థితి. ఆయన సినిమాలు చేసి చాలాకాలం అయిపోయినట్లుందే.. అని అభిమానులు సైతం అనుమానంగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చేసిందిప్పుడు. నానా హడావిడి చేసి.. పవన్ బాబాయి మీద తన చిత్రాన్ని పోటీకి తెచ్చే రేంజిలో ఎవడు సినిమా చేస్తే.. అది కాస్తా ఆరు నెలలుగా ల్యాబ్‌ల్లో మూలుగుతోంది. ఇప్పటికైనా, ఎప్పటికైనా బయటకు వస్తుందారాదా? అనిపించేలా ఉంది. ప్రజల నిరసనలు ఎలా ఉన్నప్పటికీ.. కంటెంట్ దుమ్ములేపేస్తాం అనే ఫీలింగ్‌తో ప్రజల ముందుకు తెచ్చిన బాలీవుడ్ డెబ్యూ చిత్రం ‘తుఫాన్’ భయంకరమైన ఫ్లాప్‌గా మిగిలింది. ఇంకాస్త గ్యాప్ వచ్చిందంటే.. ఈ నాలుగైదు సినిమాల వయస్సును మెగా బుల్లి హీరోను ఫ్యాన్సే మరచిపోయే పరిస్థితి ఉన్నదని ఒకవైపు అనుకుంటున్నారు.
అసలే తన కెరీర్ రకరకాల కుదుపుల్లో కొట్టుకుంటూ చిరాకు తెప్పిస్తూ ఉంటే.. అదే సమయంలో.. మరోవైపు తాజాగా నాగేంద్రబాబు బాబాయి మీడియా ఇంటర్వ్యూల పెడుతున్న చికాకు రాంచరణ్‌కు తీవ్రంగా కోపం తెప్పిస్తున్నదట. నాగేంద్రబాబు నిర్మాతగా రాంచరణ్ హీరోగా రూపొందిన చిత్రం.. ఆరెంజ్ బాక్సాఫీసు వద్ద దారుణంగా ఫెయిలయింది. ఇది చాలా పాత సంగతి. ఈ సినిమా వలన.. పవన్ కల్యాణ్ ఆస్తులు కూడా అమ్మి నాగేంద్రబాబు అప్పులకు చెల్లించారని కూడా వార్తలు వచ్చాయి. నిజానికి. ఆ విషయాలు ఎన్నడో మరుగున పడిపోయి ఉండాలి. కానీ నాగేంద్రబాబు బహిరంగంగా తన అంతరంగాన్ని ఆవిష్కరించాల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు.
గతంలో కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో ఆరెంజ్ తన జీవితంలో చాలా మార్పు తెచ్చిందని, భయంకరంగా ముంచిందని నాగబాబు చెప్పారు. తాజాగా ఇవాళ (శుక్రవారం) ఒక దినపత్రికలో వచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో సినిమా నిర్మాణం నుంచి పూర్తిగా పక్కకు తప్పుకునేలా ఆరెంజ్ సినిమా తన కళ్లు తెరిపించిందంటూ నాగబాబు వ్యాఖ్యానించారు. ఆయన చెబుతున్న దాంట్లో అబద్ధం లేకపోవచ్చు. కానీ.. ఆ ఇంటర్వ్యూలు రాంచరణ్ ఘోరమైన ఫ్లాప్ హీరో అని పదేపదే ప్రజలకు గుర్తు చేస్తున్నట్లుగా ఉంటున్నాయి. అందుకే చెర్రీ- నాగబాబాయిపై గుర్రు మంటున్నాట్ట. అదీ సంగతి.