ఎన్టీఆర్ బయోపిక్.. అసలేం జరిగింది?

ఎన్టీఆర్ బయోపిక్ నుంచి దర్శకుడు తేజ తప్పుకున్నారని ‘గ్రేట్ ఆంధ్ర’ ఈసాయంత్రం బ్రేకింగ్ న్యూస్ ఇవ్వగానే, టాలీవుడ్ లో హడావుడే హడావుడి. మీడియా వర్గాల నుంచి తేజకు ఫోన్ లే ఫోన్ లు. ఆపై…

ఎన్టీఆర్ బయోపిక్ నుంచి దర్శకుడు తేజ తప్పుకున్నారని ‘గ్రేట్ ఆంధ్ర’ ఈసాయంత్రం బ్రేకింగ్ న్యూస్ ఇవ్వగానే, టాలీవుడ్ లో హడావుడే హడావుడి. మీడియా వర్గాల నుంచి తేజకు ఫోన్ లే ఫోన్ లు. ఆపై ఎవరి ఊహాగానాలకు వారు పదును పెట్టారు. ఇలా జరిగింది.. అలా జరిగింది అంటూ రకరకాలు కథనాలు.

కానీ అసలు ఏం జరిగింది. ఇక్కడ మళ్లీ ఎక్స్ క్లూజివ్ గా.

ఎన్టీఆర్ బయోపిక్ కు స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ అయింది. అయితే క్రిష్ కు అప్పగిద్దాం అనుకున్నారు కుదరలేదు. ఆఖరికి తేజ సీన్ లోకి వచ్చి కొంత వరకు లైన్లో పెట్టాడు. సంగీతం కీరవాణి అన్నది నిర్మాతల ఛాయిస్. అయితే సరైన సినిమాటోగ్రాఫర్ వుండాలని బాలీవుడ్ నుంచి తేజ తీసుకుని వచ్చాడు. అంతవరకు బాగానే వుంది.

ఎన్టీఆర్ కెరీర్ లోంచి మొత్తం 53గెటప్ లను బాలయ్య ఫైనల్ చేసారు. ఇవన్నీ సినిమాలో కనిపించాలి. ఆ గెటప్ ల్లో తాను కనిపించాలి అని ఫిక్స్ చేసాడు. ఇక్కడే వచ్చింది తేడా. ఈ గెటప్ లు అన్నీ కలిపి ఒక పాటలో చేసేద్దాం అన్నాడు తేజ. అలాకాదు, అడవిరాముడులో ఓ పాట, జయలలితతో చేసిన డ్యూయట్ ఒకటి కచ్చితంగా సెపరేట్ గా వుండాలన్నాడు బాలయ్య. స్క్రిప్ట్ అవి ఎక్కడ ఇరికించాలా? అన్న దానిపై తర్జన భర్జనలు జరిగాయి.

ఆఖరికి బాలయ్యే రైటర్లతో కూర్చుని, ఎక్కడో అక్కడ సెట్ చేయమని చెప్పాడు. సరే, రెండు పాటలు వదిలేసినా, ఇంకా యాభై గెటప్ లు. ఒక్కొ గెటప్ ఒక్కో నిమషం చూపించినా, యాభై నిమషాలు అవే వుంటాయి సినిమాలో. వాటిలో చాలా గెటప్ లు ఇప్పుడు బాలయ్య వయసు, ఫిజిక్ రీత్యా సూట్ కూడా కావన్నది తేజ అభిప్రాయం గా తెలుస్తోంది. అయినా తేజ అడ్జస్ట్ అయ్యారు.

ఉన్నట్లుండి మేలో 15రోజులు షూట్, ఓ పాట చిత్రీకరణ అని బాలయ్య డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది. బయోపిక్ అందునా, పీరియాడిక్ సినిమా కాబట్టి, హోమ్ వర్క్, ఆర్ట్ డైరక్షన్ వాళ్లతో డిస్కషన్లు, స్కెచ్ లు అవసరం అని తేజ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కానీ చకచకా చేసేయాలన్నది బాలయ్య ఆలోచన. ఇక్కడే తేజకు నప్పలేదు. నిర్మాణంలో వున్నవి కావచ్చు, ఇంతకు ముందు వచ్చినవి కావచ్చు, ఫీరియాడిక్ సినిమాలు అంటే చాలా జాగ్రత్త తీసుకోవాలి. లేదూ అంటే జనం తిప్పి కొడతారు. పైగా ఎన్టీఆర్ సినిమా అంటే తేజను ఓ లెక్కలో ఆడుకుంటారు.

దీంతో తేజ తప్పుకునేందుకు రెడీ అయిపోయాడు. కానీ వారం రోజులుగా దీనిపై మల్లగుల్లాలు నడిచాయు. ఓ పక్క తేజతో మాట్లాడుతూనే మరోపక్క క్రిష్ ను అడిగారు. ఆయన ఇంకా ఎస్ ఆర్ నో అనలేదు. ఇంకో పక్క దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును సంప్రదించినట్లు బోగట్టా. ఆయన అయితే ఏకంగా ప్రాజెక్ట్ నే డ్రాప్ చేస్తే బెటర్ అని సూచించినట్లు తెలుస్తోంది.

ఏమైనా సరే, అవసరం అయితే తానే డైరక్షన్ చేసుకుంటా కానీ, ప్రాజెక్టు ముందుకు సాగాల్సిందే అని బాలయ్య పట్టుదలతో వున్నారు. మొత్తం మీద ఎన్టీఆర్ బయోపిక్ రెండు అడుగులు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్లు వుంది వ్యవహారం. ఈ లోగా ఎవరికి నచ్చింది వాళ్లు రాసుకోవడం, ఎవరికి తోచిన వారిని బయోపిక్ లోకి తోసేయడం. ఆఖరికి మనవడు దేవాన్ష్ తో సహా. కాదనేవారెవ్వరు?