ఎన్టీఆర్‌ బయోపిక్‌- రీల్‌ ఎన్టీఆర్‌ కురచ అయ్యాడా?

ఆరడగుల ఆజానుబాహుడు.. ఇదీ ఎన్టీఆర్‌ గురించి చెప్పమంటే.. ఆయన అభిమానులు వాడే మొదటి ఉపమానం. ఆ తర్వాత అందగాడు, తెలుగువారి వెండితెర వేల్పు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ.. వంటి పదాలు వాడుతూ ఉంటారు. ఇలాంటి…

ఆరడగుల ఆజానుబాహుడు.. ఇదీ ఎన్టీఆర్‌ గురించి చెప్పమంటే.. ఆయన అభిమానులు వాడే మొదటి ఉపమానం. ఆ తర్వాత అందగాడు, తెలుగువారి వెండితెర వేల్పు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ.. వంటి పదాలు వాడుతూ ఉంటారు. ఇలాంటి అతిశయోక్తులు వాడి.. ఎన్టీఆర్‌ గొప్పదనాన్ని చెబుతూ ఉంటారు. ఎన్టీఆర్‌ గొప్పనటుడే, పౌరాణికాల విషయంలో ఆయనకు తిరుగులేదు.. కానీ పక్కరాష్ట్రాల వారికి కూడా గట్టిగా తెలీని పేరు ముందు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అనే అతిశయోక్తి కామన్‌గా ఉంటుంది.

ఎన్టీఆర్‌ పేరు పక్కన పెద్దగా అతిశయోక్తి లేని పదం ఏదైనా ఉందంటే.. ఆరు అడుగుల ఆజానుబాహుడు అనేమాట. ఎన్టీఆర్‌ పొడగరి. ఎన్టీఆర్‌ను వెండితెర మీద చూసినవాళ్లు అయినా,ఆయనను టీవీల్లో సినిమాల ద్వారా చూసిన వాళ్లు అయినా.. ఆయన మంచి హైట్‌ అని ఖాయంగా ఒప్పుకుంటారు. ఎన్టీఆర్‌ పేరు విన్నా.. ఆయన ధరించిన పాత్రలను గుర్తు చేసుకున్నా.. ఆరడుగుల రూపం ఒకటి కళ్ల ముందు మెదలాడుతుంది.

మన పురాణాల ప్రకారం చూసుకుంటే.. రాముడు, కృష్ణుడు, ధుర్యోధనుడు, భీముడు.. అందరూ పొడవు ఉండే వాళ్లే. ఆజానుబాహులే. వారి వర్ణణల్లో ఈ మాట తప్పనిసరిగా వినిపిస్తుంది. ఆ వర్ణనలకు దాదాపు న్యాయంచేశాడు ఎన్టీఆర్‌ కూడా. ఆజానుబాహుడుగా ఆకట్టుకున్నాడు. రాముడు, కృష్ణుడి రూపాలకే కాక ధుర్యోధనుడి రూపానికి కూడా ఒక ఆకారాన్ని ఇచ్చాడు. ఎన్టీఆర్‌ అలా గుర్తుండి పోతారంతే!

బయోపిక్‌లో అలా ఉన్నాడా?
ఎన్టీఆర్‌ బయోపిక్‌ను తీయడం అంటే అది పెద్ద సాహసమే. ఈ విషయంలో చూసినా.. అది సాహసమే. ఎన్టీఆర్‌ కథను చెప్పాలనుకోవచ్చు. అక్షారాల్లో దాన్ని అందంగా చెప్పవచ్చు. తాము చెప్పదలుచుకున్న కోణం ఏదైనా అక్షరాల్లో ఎన్టీఆర్‌ కథను వివరించడం వేరే. అయితే.. సినిమాగా వేరే!

ఎన్టీఆర్‌ బయోపిక్‌ను రూపొందిస్తూ ఇలాంటి సాహసమే చేస్తున్నాడు బాలయ్య. తన తండ్రి బయోపిక్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందిస్తున్నాడు. అక్కడి వరకూ ఓకే. అయితే అందులో బాలయ్య తమకు అనువైన రీతిలోనే ఎన్టీఆర్‌ కథను చెప్పే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసింది ఆయన కుటుంబీకులే. అందులో బాలయ్య కూడా తనవంతు భాగస్వామ్యే.

ఇప్పుడు అదే బాలయ్య బయోపిక్‌ను తీస్తే.. ఎన్టీఆర్‌ వెన్నుపోటు అంశంలో తనూ భాగస్వామినే అని చెప్పుకోగలడా? ఎన్టీఆర్‌ ఎలాంటి పరిస్థితుల్లో అంత లేటు వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడో వివరించి చెప్పగలరా?

ఎన్టీఆర్‌ లక్ష్మీ పార్వతిని చేరదీయాల్సి రావడానికి కుటుంబం ఎంతవరకూ కారణమైందో.. ఎన్టీఆర్‌ కొడుకులూ, కూతుళ్లు అలాంటి పరిస్థితి ఎలా తెచ్చారో వివరించగలరా? అవన్నీ కుదిరే పనులు కావు. అందుకే ఎన్టీఆర్‌ కథను తమ కోణంలో, తమకు అనువైన కోణంలో చెప్పవచ్చు బాలయ్య.

కథ సంగతి అలా వదిలేద్దాం. ఇంతకీ ఎన్టీఆర్‌ రూపం మాటేంటి? ఇది మొన్నటి వరకూ మిస్టరీ. అయితే ఇప్పుడు ఎన్టీఆర్‌ బయోపిక్‌కు సంబంధించిన స్టిల్స్‌ బయటకు వచ్చేశాయి. ఒకటి కాదు.. అనేకం వెలుగు చూశాయి.

ఎన్టీఆర్‌గా బాలయ్య ఎలా కనిపించబోతున్నాడో వివిధ స్టిల్స్‌తో క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ స్టిల్స్‌లో బాలయ్య ఎలా కనిపిస్తున్నాడు? అనే ప్రశ్నపై చర్చ జరుగుతోందిప్పుడు. ఇప్పటికే ఎన్టీఆర్‌ బయోపిక్‌లో బాలయ్యకు సంబంధించిన స్టిల్స్‌ బోలెడన్ని బయటకు వచ్చాయి. అధికారికంగానే వీటిని విడుదల చేశారు.

ఎన్టీఆర్‌ కనిపించిన వివిధ గెటప్స్‌లో బాలయ్య స్టిల్స్‌ ఇప్పుడు నెట్‌లో షికారు చేస్తున్నాయి. వీటిని చూసి వీరాభిమానులు మురిసిపోతున్నారు కానీ.. కామన్‌ ఆడియన్స్‌కు మాత్రం కొన్ని సందేహాలు మెలిపెడుతున్నాయి. అందులో ముఖ్యమైనది ఏమిటంటే.. ఎన్టీఆర్‌ మరీ పొట్టి అయ్యాడు అనేది ప్రధానమైన కంప్లైంట్‌.

ముందుగా చెప్పుకున్నట్టుగా ఎన్టీఆర్‌ ఆజానుబాహుడు. ఆరడుగుల మనిషి. బాలయ్య తండ్రి అంత ఎత్తులేడు అనేది అందరూ ఒప్పుకునే మాట. అంత పొడగరి కాకపోయినా. టాలీవుడ్‌లో బాలయ్య ఇన్నేళ్లు హీరోగా టాప్‌ ప్లేస్‌లో ఉండి రాణించాడు. ఎన్టీఆర్‌ నటనకు చక్కటి వారసుడు అనిపించుకున్నాడు. అయితే.. ఇప్పుడు ఎన్టీఆర్‌గా మాత్రం బాలయ్య తేలిపోతున్నాడని స్పష్టం అవుతోంది.

బయోపిక్‌ అంటే అచ్చంగా ఉండాలా?
ఇది మంచి ప్రశ్నే. బయోపిక్‌ అన్నంత మాత్రాన ఒరిజినల్‌ వ్యక్తిని ప్రతిబింబించే వ్యక్తే అందులో నటించాల్సిన అవసరం ఉందా? అనేది ఆసక్తిదాయకమైన ప్రశ్న. ఇదివరకూ వచ్చిన చాలా బయోపిక్స్‌ను పరిశీలించినా.. దీనికి సమాధానాలు దొరుకుతాయి.

సంజయ్‌ దత్‌ బయోపిక్‌ సంజూను చూస్తే. అందులో రణ్‌బీర్‌ కపూర్‌ ఎక్కడా కనిపించడు. సంజయ్‌ దత్‌నే చేస్తున్నాం అనే భ్రమలోకి వెళ్లిపోతాం. మహానటిలో కీర్తీ సురేష్‌ కొంతవరకూ సావిత్రిని గుర్తుచేసింది. అయితే.. సావిత్రి అంత లావు లేదు కీర్తీ. ప్రత్యేకించి సెకెండాఫ్‌లో సావిత్రి రూపానికీ కీర్తి కనిపించే తీరుకూ సంబంధమే లేదు.

మహానటికి ఉండిన అడ్వాంటేజ్‌ ఏమిటంటే.. సావిత్రి జీవితంలో ఏం జరిగింది అనేదే ప్రేక్షకుడిని ఆలోచింపజేసింది. కాబట్టి కీర్తి ఎలా కనిపిస్తోంది అనేది పట్టించుకోలేదు. ధోనీ బయోపిక్‌ విషయంలోనూ దాదాపు అలానే జరిగింది. ఈ రకంగా చూస్తే.. బయోపిక్‌ అనగానే సదరు ఒరిజినల్‌ వ్యక్తిని పాత్రధారి పోలి ఉండాల్సిన అవసరం లేదు.. కాస్త అటూ ఇటుగా ఉన్నా ఓకే అని చెప్పవచ్చు.

ఎన్టీఆర్‌ బయోపిక్‌ మాత్రం ప్రత్యేకమే!
నిస్సంకోచంగా ఎన్టీఆర్‌ బయోపిక్‌ ప్రత్యేకమే. ఎన్టీఆర్‌ రూపం, ఎన్టీఆర్‌ నటించిన సీన్లు జనాల కళ్లలో ఉంటాయి. బాలయ్య రూపొందిస్తున్న సినిమాలో కూడా వాటిని చూపబోతున్నారని స్పష్టం అవుతోంది. మరి అలాంటప్పుడు.. ఎన్టీఆర్‌ నటించిన సీన్లను ఊహించుకుని, ఎన్టీఆర్‌ రూపాన్ని ఊహించుకుని బాలయ్యను చూస్తే.. జనాలు నిరాశ చెందే అవకాశాలు చాలా ఉన్నాయి.

తప్పని సెటైర్లు!
తండ్రి బయోపిక్‌ విషయంలో బాలయ్యపై సెటైర్లు తప్పడంలేదు. ఎన్టీఆర్‌ పతనావస్థలో కీలకపాత్ర పోషించిన కొడుకులే ఇప్పుడు ఆయన బయోపిక్‌ తీయడం విడ్డూరమని కొందరు అంటున్నారు. ఈ విమర్శ ఎప్పటికీ తప్పదు. ఎన్టీఆర్‌ గొప్పదనం గురించి ఈ సినిమాలో అంత.. ఇంత. అని చెబితే.. మరి అంత గొప్పోడు అయితే పదవి నుంచి ఎందుకు దించేశారు? అనే ప్రశ్న కూడా వస్తుంది.

అయితే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన నైతికత గురించి నందమూరి కుటుంబం ఎప్పుడూ పట్టించుకోలేదు. అలాంటిది ఇప్పుడు అయినా సమాధానం చెబుతుంది అనుకోవడం అమాయకత్వమే. తమ బ్రీడ్‌ ప్రత్యేకం అని చెప్పుకుంటారు కానీ.. తమ తీరుపై వచ్చే విమర్శలకు మాత్రం సమాధానం ఉండదు. బయోపిక్‌ విషయంలోనూ అదే అనైతికత ఉంటుంది.

ఇక ఎన్టీఆర్‌గా బాలయ్య రూపం విషయంలో మొదటి నుంచినే సెటైర్లు మొదలయ్యాయి. తేజ దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభం అయినప్పుడు.. ధుర్యోధనుగా బాలయ్య స్టిల్స్‌ వచ్చినప్పుడు కొందరు సెటైర్లు వేశారు. ఎన్టీఆర్‌ ఏంటి బాలయ్యలా ఉన్నాడు.. అంటూ కొందరు వ్యాఖ్యానించారు! ఆ స్టిల్స్‌లో ఎన్టీఆర్‌ కన్నా బాలయ్యే ఎక్కువగా కనిపించాడు వాళ్లకు.

ఇక తాజాగా బయటకు వచ్చిన మరో స్టిల్‌పై కూడా సెటైర్లు తప్పడంలేదు. ఎన్టీఆర్‌గా నటిస్తూ బాలయ్య మైకు ముందు ప్రసంగిస్తున్న స్టిల్‌లో దర్శకుడు క్రిష్‌ ఎదురుగా ఉంటాడు. బాలయ్య మైకు తగ్గ ఎత్తులో లేకపోవడం.. క్రిష్‌ కన్నా బాలయ్య పొట్టిగా కనిపించడం, మరో స్టిల్‌లో గోచి పంచెలో బాలయ్య మరీ పొట్టిగా కనిపించడం.. ఇవన్నీ  ప్రేక్షకులు నోటీస్‌ చేస్తున్నవే.

ఎన్టీఆర్‌గా నటిస్తున్నాడు కాబట్టి.. సినిమాలో బాలయ్య రూపు రేఖలకూ ఎన్టీఆర్‌ రూపు రేఖలకూ పోలిక తప్పనిసరిగా వస్తుంది. ఎలాగూ బాలయ్యే ఈ రోల్‌ చేస్తున్నాడు కాబట్టి.. వీరాభిమానులు హ్యాపీ అయిపోవచ్చు. అదే వేరే నటుడు ఎవరైనా ఈ పాత్రను చేసి ఉంటే.. అప్పుడు ఫ్యాన్స్‌ కూడా నిజాయితీగా స్పందించేవాళ్లు.

'నర్తనశాల'' సినిమాలో బృహన్నలగా రూపాన్ని ముగించుకుని.. ఉత్తర గోగ్రహణం ఎపిసోడ్లో.. శంఖం ఊదూతూ వచ్చే అర్జునుడిగా ఎన్టీఆర్‌ అద్భుతంగా ఉంటాడు. అర్జునుడంటే.. అచ్చం అలానే ఉంటాడనిపిస్తుంది. మరి బాలయ్య ఆ నటన కానీ, ఆ రూపాన్ని కానీ చూపింగలడా? అనే ప్రశ్నకు అసలు సమాధానం తెరమీదే కనిపిస్తుంది!

కూటమి గెలిచినా బాబు కనుసన్నల్లోనే పాలన!… చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్