ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్న కాంబినేషన్ అది. టాప్ హీరోల్లో పవన్, బన్నీ, మహేష్ లతో మాత్రమే ఇప్పటి దాకా సినిమాలు చేసిన డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నారు. గతంలో ఓ సారి ఈ ప్రాజెక్టు సెట్ కావాల్సిందే ఆగిపోయింది. అప్పట్లో ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ మధ్య కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని వార్తలు వినిపించాయి. ఏమయితేనేం మళ్లీ ఇన్నాళ్లకు సెట్ అయింది.
ప్రస్తుతం పవన్ సినిమాతో బిజీగా వున్న త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టును ఫిబ్రవరి-మార్చి మధ్యలో స్టార్ట్ చేస్తారు. అయితే పూజలు, హోమాలు, జపాలు వంటి నమ్మకాలు అటు త్రివిక్రమ్ కు, ఇటు హారిక హాసినికి అపారంగా వున్నాయి. ఇద్దరికి కామన్ గురువు కూడా వున్నారు. ఆయన పెట్టే ముహుర్తం కోసం చూస్తున్నారు.
నవంబర్ లో పూజ ముహుర్తం సెట్ అవుతోంది. అందువల్ల నవంబర్ లో లాంఛనంగా పూజ చేసేసి, రెండు నెలల తరువాత సెట్ మీదకు వెళ్తారు. ఈసారి ఎలాగైనా ఎన్టీఆర్ సినిమాను వీలయినంత వేగంగా పూర్తి చేయాలని త్రివిక్రమ్ సంకల్పంతో వున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా స్క్రిప్ట్ అయితే రెడీ అయింది తప్ప, ఇంకా స్టార్ కాస్ట్ సెలక్షన్ వంటి వ్యవహారాలు ప్రారంభం కాలేదు. అయితే టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ వ్యవహారాలపై ఇప్పటికే త్రివిక్రమ్ ఓ బేసిక్ అయిడియాతోనే వున్నారు. అంటే కీలకపాత్రల విషయంలో ఆయన అయిడియాలు ఆయనకు వున్నాయి. హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా ఆలోచన చేయలేదని వినికిడి.