.మొగుడు కొట్టినందుకు కాదు..తోడికోడలు దెప్పినందుకు అని సామెత. కొన్ని సార్లు కొన్ని మాటలు ఎందుకో అంటాం..కానీ అవి మరెందుకో రీసౌండ్ ఇస్తాయి. దర్శకుడు హరీష్ శంకర్ మాటలు అలాగే వున్నాయట. ఆయన తరచు తన ఇంటర్వూల్లో, మాటల్లో రామయ్యా వస్తావయ్యా ప్రస్తావన తెస్తున్నారు.
తాను గబ్బర్ సింగ్ డైరక్టర్ కాదు, రామయ్యా వస్తావయ్యా డైరక్టర్ ను అని చెప్పా అంటూ పదే పదే చెబుతున్నారు. అదే మాట ఆయనతో ఆ సినిమాతో సంబంధం వున్న వార్తల్లో తరచు వినిపిస్తోంది..కనిపిస్తోంది. అంటే గబ్బర్ సింగ్ అనే సూపర్ హిట్ ఇచ్చిన డైరక్టర్ ను కాదు..రామయ్యా వస్తావయ్యా లాంటి ఫ్లాప్ ఇచ్చిన డైరక్టర్ ను అని చెప్పకనే చెప్పినట్లు అవుతోంది.
అంటే ఎన్టీఆర్ రామయ్యా వస్తావయ్యా అన్నది ఓ డిజాస్టర్..పనికిమాలిన అట్టర్ ఫ్లాప్ సినిమా అని చెప్పకనే చెబుతున్నారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారట. తన తాజా సినిమా, తన వ్యవహారాలు చెప్పుకోకుండా, పదే పదే ఎన్టీఆర్ సినిమా ప్రస్తావన ఎందుకు తెస్తున్నాడని బాధపడుతున్నారట ఫ్యాన్స్.
పైగా గబ్బర్ సింగ్ తరువాత తన రేంజ్ సూపర్ అని, రామయ్యా వస్తావయ్యా తరువాత తన రేంజ్ నేల మీదకు వచ్చేసిందనే అర్థంలో హరీష్ మాట్లాడుతున్నారని ఫ్యాన్స్ లోలోపల బాధపడుతున్నారట. ఇందులో హరీష్ తప్పు లేకపోవచ్చు, నిజాయతీగా తనో ఫ్లాప్ సినిమా అందించానని చెప్పడం ఆయన ఉద్దేశం కావచ్చు. కానీ మాయిపోయిన ఫ్లాప్ గాయాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో రేపుతున్నాడని వాళ్లు బాధపడుతున్నారట.