Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్‌.. ఇంకా పాఠాలు నేర్వలేదా?

ఎన్టీఆర్‌.. ఇంకా పాఠాలు నేర్వలేదా?

ఒడిదుడుకుల నుంచి పాఠాలు నేర్వని తారక్‌

పడి లేచిన అనుభవ సారం ఏదీ?

ప్రణాళిక లేమితో సాగుతున్న యంగ్‌ టైగర్‌

పర్వాలేదనే సినిమాలతో గర్వం పెరిగిందా?

ఇండస్ట్రీలో నంబర్‌ వన్‌ పొజిషన్‌ కోసం చాన్నాళ్లుగా పోటీ కొనసాగుతోంది. మెగాస్టార్‌ సినిమాలకు బ్రేక్‌ వేశాకా.. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి వాళ్లు సినిమాల ఎంపికల్లో రూటు మార్చిన తర్వాత నంబర్‌ వన్‌ ఎవరనే అంశంలో చాలా మంది పోటీలో ఉన్నారు. ''గబ్బర్‌ సింగ్‌''తో పవన్‌ ఫామ్‌లోకి వచ్చాకా, అంతకన్నా ముందు 'దూకుడు'తో మహేశ్‌ సంచలనం సృష్టించిన తర్వాత వాళ్లిద్దరూ నంబర్‌వన్‌ రేసులోకి వచ్చారు.. దాదాపు వీళ్లతో పాటు జయపాజయాల్లో సమానంగా దూసుకొస్తున్న యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కూడా ఈ రేసులో ఉన్నాడు. పవన్‌, మహేశ్‌ల కన్నా చిన్న వయసులోనే బ్లాక్‌ బస్టర్‌.. ఇండస్ట్రీ హిట్‌ను కొట్టిన ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఒడిదుడుకుల గురించి వేరే చెప్పనక్కర్లేదు. 

అయితే వాటన్నిటికీ ఓర్చి, గెలిచి, నిలుస్తున్న హీరో ఇతడు. ఒకదశలో నంబర్‌వన్‌ రేసులో ముందున్నాడని అనుకున్నా.. ఆ తర్వాత మాత్రం మిగతా వాళ్ల కన్నా వెనుకబడ్డాడు. తాజాగా ''జనతా గ్యారేజ్‌''తో తన స్టామినా ఏమిటో నిరూపించుకుని మళ్లీ రేసులోకి వచ్చాడు. మరి ఇప్పుడు? ఎన్టీఆర్‌ ఇలానే దూసుకుపోతాడా? మిగతావారందరినీ దాటుకుని దమ్ము చూపుతాడా? అంటే.. ఇతడి అభిమానులు ఉత్సాహవంతంగా ''ఔననే..'' అంటున్నా, వాస్తవం మాత్రం అలా కనిపించడం లేదు. ఎన్టీఆర్‌ దగ్గర సరైన ప్రణాళిక లేదేమో అనే అభిప్రాయం కలుగుతోంది విశ్లేషకులకు. లేకపోతే ఇంకో ఏడాది వరకూ ఈ హీరో సినిమాలేవీ పట్టాలెక్కే పరిస్థితి లేకపోవడం అంటే.. ఇది ఎన్టీఆర్‌ ప్లానింగ్‌లో లోపం కాక మరేమిటి?

''జనతా గ్యారేజ్‌''లో ఎన్టీఆర్‌తో పాటు నటించిన మోహన్‌లాల్‌ ఆ తర్వాత తన సినిమాలు రెండింటిని విడుదల చేశారు! ''జనతాగ్యారేజ్‌'' విడుదల అయిన తర్వాత ఆయన సినిమాలు రెండు విడుదల అయ్యాయి.. రెండూ హిట్‌ టాక్‌ను పొందాయి. ఆ రెండు సినిమాలూ పరాయి భాషల్లో రీమేక్‌ కానున్నాయి.. ప్లానింగ్‌ అంటే అది! మోహన్‌లాల్‌ వంటి నటుడితో కలిసి పనిచేస్తే.. ఆయన నుంచి నేర్చుకోవడానికి ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఆయనా స్టార్‌ హీరోనే.. వాళ్ల రాష్ట్రంలో బీభత్సమైన మాస్‌ ఫాలోయింగ్‌ ఉంది. అభిమానుల అంచనాలూ ఉంటాయి ఆయన మీద! వారిని ఒప్పించి, మెప్పించి.. 

ఇదే సమయంలో వేగవంతంగా, వైవిధ్యంగా సినిమాలు చేసుకోవడం కూడా మోహన్‌ లాల్‌ వంటి వాళ్లకు సాధ్యం అవుతోంది. మరి లాల్‌ లాగా ఎన్టీఆర్‌ ఇప్పటికే రెండు సినిమాలను విడుదల చేయాల్సిన అవసరం లేదంటారా.. ''తెలుగు హీరో''లు అలా ఎవరూ చేయరంటారా.. అలా చేయడం మన హీరోలకు తక్కువతనం అంటారా.. సరే, మరి ''జనతా..'' వచ్చిన ఇన్ని రోజులవుతోంది.. కనీసం తర్వాతి సినిమా ఏదీ, ఏం చేయబోతున్నారు.. అనే అంశంపై క్లారిటీ ఉండాలి కదా! కనీసం ఎన్టీఆర్‌కు అయిన ఈ విషయంలో క్లూ ఉండాలి కదా! పరిస్థితిని గమనిస్తే.. తదుపరి ఏం చేయాలనే అంశం గురించి తారక్‌కు ఎలాంటి స్పష్టతా లేనట్టుగా తెలుస్తోంది. 

మొదట్లో జస్ట్‌ యావరేజ్‌ టాక్‌ పొందిన 'జనతా..' క్రమంగా పుంజుకుని.. ప్రచారం పుణ్యమా అని భారీ వసూళ్లతో ఈ హీరో పేరు నిలబెట్టినా.. ఆ టెంపోని కంటిన్యూ చేయడం మాత్రం ఎన్టీఆర్‌కు ఈజీగా సాధ్యం అయ్యేలా లేదు. జనతా గ్యారేజ్‌.. వసూళ్ల విషయంలో టాప్‌ ఫైవ్‌లో నిలబడిందని అనుకుంటే.. రానున్న వేరే హీరోల సినిమాలు ఎన్టీఆర్‌ సినిమాను ఆ స్థానం నుంచి కిందకు దించేసే అవకాశాలు ఉన్నాయి. కానీ అంతలోపు ఎన్టీఆర్‌ మరో సినిమాతో సత్తా చాటే అవకాశాలు కనిపించడం లేదు!

వాళ్లతో విబేధాలా..?

తారక్‌ తదుపరి సినిమాకు దర్శకుడు ఎవరు? అంటే.. చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే.. ఇప్పటి వరకూ ఈ విషయం ఆ హీరోకే తెలియదు కాబట్టి. కొన్నాళ్ల కిందట వరకూ ఈ విషయంలో కొన్ని పేర్లు వినిపించేవి. వక్కంతం వంశీ అని, త్రివిక్రమ్‌ అని.. ఇలా. వీళ్లకు తారక్‌ ఓకే చెప్పాడని, ఆ సినిమాలు పట్టాలెక్కనున్నాయని వార్తలు వచ్చేవి. అయితే అవేవీ జరిగే పనులు కాదని స్పష్టం అయ్యింది.

ఆది నుంచి ఎన్టీఆర్‌ ట్రూప్‌ మెంబర్‌గా ఉండిన వక్కంతం ఇప్పుడు ఎన్టీఆర్‌కు దూరం అయ్యాడు. అశోక్‌, టెంపర్‌ వంటి సినిమాలకు కథలను అందించి వాటి ద్వారా ఎన్టీఆర్‌కు రిలీఫ్‌ను ఇచ్చిన ఆ రచయితకు ఎన్టీఆర్‌ దర్శకుడిగా ఛాన్సివ్వబోతున్నాడు అని చాన్నాళ్లుగానే వార్తలు వచ్చినా.. ఇప్పుడు అది జరగదని స్పష్టం అయ్యింది. ఎన్టీఆర్‌కు సన్నిహితుడిగా పేర్గాంచిన ఆ రచయిత ఒక లైన్‌ను ఎన్టీఆర్‌కు వినిపించగా, దానికి ఎన్టీఆర్‌ సమ్మతి తెలియజేయలేదని సమాచారం.

ఇన్నాళ్లూ సన్నిహితుడిగా మెలిగిన వక్కంతంను ఎన్టీఆర్‌ ఇలా ఒక్కసారిగా పక్కన పెట్టేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆసక్తిదాయకమైన విషయం ఏమిటంటే.. ఎన్టీఆర్‌ చేత తిరస్కరణకు గురైన కథను వక్కంతం అల్లు అర్జున్‌కు వినిపించగా, అది నచ్చి అతడు ఓకే అనేయడం. ఇన్ని రోజులూ ఎన్టీఆర్‌ కాంపౌండ్‌లోని వక్కంతం ఇప్పుడు అల్లు అర్జున్‌ సినిమాతో దర్శకుడిగా మారబోతుండటం!

ఇక ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా గురించి కూడా చాన్నాళ్లపాటు వార్తలు వచ్చాయి. 'అత్తారింటికి దారేదీ' విడుదల అయిన దగ్గర నుంచి ఈ కబుర్లు వినిపించాయి.

ఆ సినిమా పట్టాలెక్కుతుంది అనుకునేంతలో త్రివిక్రమ్‌కు ఎన్టీఆర్‌ ఝలక్‌ ఇచ్చాడని తెలుస్తోంది. తన తీరుతో ఆ దర్శకరచయితను హర్ట్‌ చేశాడని.. దీంతో ఎన్టీఆర్‌తో సినిమాను అతడు పక్కన పెట్టేశాడని ఇండస్ట్రీలో గుసగుస. అన్నీ కుదిరిఉంటే.. ''అ..ఆ''కు ముందే త్రివిక్రమ్‌- ఎన్టీఆర్‌ల సినిమా పట్టాలెక్కాల్సింది. అయితే.. ఎన్టీఆర్‌తో కుదరదు అని అర్థం అయ్యాకే.. త్రివిక్రమ్‌ నితిన్‌తో సినిమా మొదలుపెట్టాడు.. దాంతో హిట్‌ పొందాడు. నాటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి పనిచేసే పరిస్థితి లేదనే మాట వినిపిస్తోంది! ఇలా ఎన్టీఆర్‌ కొంతమందిని దూరం చేసుకున్నాడనేది వాస్తవం.

అనుదినం పరీక్షలే..!

ఎన్టీఆర్‌ సినీ బాట పూల పాన్పు ఏమీ కాదనేది బయటికే అర్థం అవుతోంది. ఏడో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన ఈ హీరో ఆ తర్వాత చాలా ఇబ్బందులే ఎదుర్కొన్నాడు. హైప్‌ ఆకాశానికి అంటిన వేళ వచ్చిన ''ఆంధ్రావాలా'' ఇతడిని ఒక్కసారిగా నేలకు దించింది. ఆ తర్వాత కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. కొన్ని సంవత్సరాలకు వచ్చిన 'యమదొంగ'తో ఎన్టీఆర్‌ అంతో ఇంతో నిలదొక్కుకున్నాడు. అయితే అనుకున్నంతలా కాదు!

ఆ తర్వాత ఒక హిట్టు.. రెండు ప్లాఫ్‌లు అన్నట్టుగా సాగుతున్న ఎన్టీఆర్‌ ఇప్పుడు కూడా పరీక్షలనే ఎదుర్కొన్నాడు. టెంపర్‌, నాన్నకు ప్రేమతోలు పర్వాలేదనిపించుకుని, జనతా గ్యారేజ్‌ సత్తా చాటినా, ఇప్పుడు ఎన్టీఆర్‌ మరో హిట్‌ను కచ్చితంగా కొట్టాల్సిన స్థితిలో ఉన్నాడు. మరి ఒకటీ రెండు విజయాలు రాగానే ఎన్టీఆర్‌ కొంతమందిని దూరం చేసుకోవడం గమనించవచ్చు. ఇప్పటికే చాలా పతనాలను చూసిన ఎన్టీఆర్‌ ఒక్క హిట్టుతో ఇలా అగుపిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే!

పూరీ.. రాఘవేంద్రరావుల కాలమా ఇది?

ఏతావాతా చూస్తే.. దర్శకులంతా ఎవరి పనిలో వారు బిజీగా ఉండగా.. ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి సై అనే సంకేతాలు ఇద్దరి నుంచి వస్తున్నాయి. పూరీ జగన్నాథ్‌, కె.రాఘవేంద్రరావులు.. ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి ఆసక్తితో ఉన్నారు. ఎన్టీఆర్‌ కూడా వీరి పట్ల సానుకూలంగానే ఉన్నాడట! మరి ఔట్‌ డేటెడ్‌ అయిన వారితో ఇప్పుడు ఎన్టీఆర్‌ సినిమా చేయడం రైటేనా? అనే సంగతెలా ఉన్నా, ఎన్టీఆర్‌ వారితో సినిమాలకు ఓకే చెప్తే మొదటి షాక్‌ అభిమాన గణానికే!

పూరీ జగన్నాథ్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌ తీయడం ఎప్పుడో మానేశాడు. తనకు తోచినట్టుగా ఆయన డాక్యుమెంటరీ తరహా సినిమాలు తీసుకొంటున్నాడు. అవి కూడా మూస ఫార్ములాలతో ఎవరినీ ఆకట్టుకోవడం లేదు. ఫ్యామిలీ సెక్షన్‌ పూరీకి పూర్తిగా దూరం అయిపోయింది. అమ్మ సెంటిమెంటు సినిమా అని ఎంత ప్రచారం చేసినా ''లోఫర్‌'' సినిమాకు మల్టీప్లెక్స్‌లలో ఓపెనింగ్స్‌ లేవు. తొలి రోజే థియేటర్లు ఖాళీగా కనిపించాయి. అదీ పూరీ పరిస్థితి. ''ఇజం'' లాంఛనం ఒకటీ పూర్తి అయితే.. పూరీ పెన్నులో ఇంక్‌ అయిపోయిందనే విషయాన్ని నిర్ధారించవచ్చు. అలాంటి దర్శకుడితో పెట్టుకుంటే.. ముప్పు ఎన్టీఆర్‌కే!

ఇక కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమాలు తీయాలి అనుకుంటే.. ఏ పాండురంగడో, శిరిడీసాయిలాంటి సబ్జెక్టు అయితే ఓకే. భక్తిలోరొమాన్స్‌ను మిక్స్‌ చేసి ఆయన ఫిక్స్‌ చేస్తాడు. అంతే కానీ.. ఏదైనా కమర్షియల్‌ సినిమాను తీసే ఉద్దేశం ఉంటే మాత్రం.. ఈ జనరేషన్‌ ఏమిటి, రాఘవేంద్రరావు డైరెక్షన్‌ ఏమిటో ఒకసారి తరచి చూసుకోవాల్సిన బాధ్యత ఎన్టీఆర్‌ దే!

ఇక ఎన్టీఆర్‌కు కీలక సమయంలో 'అదుర్స్‌' వంటి హిట్టిచ్చిన వినాయక్‌ కూడా ఎన్టీఆర్‌ పరిగణనలోకి తీసుకోదగిన దర్శకుడే. ఇతడైతే న్యాయం చేయగలిగే అవకాశాలుంటాయి కానీ.. ఇప్పుడు వినాయక్‌ బిజీగా ఉన్నాడు. జనవరికి గానీ చేతిలో ఉన్న ప్రాజెక్టు పూర్తి కాదు. అది పూర్తి అయితే.. వినాయక్‌ మరో సబ్జెక్టును సిద్ధం చేసుకోవడానికి ఎంత కాలం పడుతుంది? అన్నీ కుదిరి అది పట్టాలెక్కేది ఎప్పుడు? అన్నీ కుదిరినా మినిమం ఒక ఏడాది పట్టదా? అంటే అంత వరకూ ఎన్టీఆర్‌ ఖాళీనేనా?

ఇవన్నీ కాదు.. పూరీతోనే నెక్ట్స్‌ సినిమా ఫిక్స్‌ అనుకుంటే, 'టెంపర్‌'కు కథను ఇచ్చిన వక్కంతం కూడా ఇప్పుడు ఎన్టీఆర్‌కు దూరం అయ్యాడనే విషయాన్ని గుర్తు చేయాలి. వేరే వాళ్ల కథ ఇస్తే.. పూరీ ఆ మాత్రం సినిమా తీయగలిగాడు. అదే బ్యాంకాక్‌ బీచ్‌లలో రాసుకొచ్చిన కథతో అయితే పరిస్థితి ఎలా ఉంటుందో! అంతో ఇంతో నేపథ్యం ఉన్న దర్శకుడితోనే తప్ప.. కొత్త వాళ్లతో చేసే ఆసక్తి లేదట ఎన్టీఆర్‌కు.

మిగతా వాళ్లు దూసుకుపోతున్నారు సార్‌!

ఏడాది.. రెండేళ్లు గ్యాప్‌లు ఇచ్చి సినిమాలు చేసుకొనే రోజులు కావివి. అంతంత గ్యాప్‌లు తీసుకుని వస్తే.. ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో హీరోలందరికీ అనుభవమే! అందుకే ఇప్పుడు అంతా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారు. పవన్‌ కల్యాణేమో తదుపరి మూడు ప్రాజెక్టుల విషయంలో క్లారిటీ ఇచ్చేసి, ఒక్కోదానికీ కొబ్బరికాయలు కొట్టుకొంటూ వస్తున్నాడు. 

ఇక మహేశ్‌ బాబు ఏమో.. మురగదాస్‌ సినిమా, ఆ వెంటనే కొరటాల శివతో, ఆ తర్వాత వంశీ పైడిపల్లితో.. ఇలా షెడ్యూల్‌ను ఫిక్స్‌ చేస్తున్నాడు. అల్లు అర్జున్‌ దువ్వాడ జగన్నాథం, లింగుస్వామి సినిమా.. ఇవి పూర్తి కాగానే విక్రమ్‌ కుమార్‌తో.. ఇలా తన ప్లానింగ్‌ తనకు ఉంది. 

ఇలా ఊపు మీదున్న హీరోలు తమ తదుపరి మూడు నాలుగు ప్రాజెక్టుల గురించి క్లారిటీతో ఉంటే.. ఎన్టీఆర్‌ మాత్రం కెరీర్‌కు మాత్రం అలాంటి ఊపు కనిపించడం లేదు. జనతా గ్యారేజ్‌ హిట్‌ను ఎంజాయ్‌ చేయడం అంటే.. తదుపరి సినిమాతో అంతకు మించిన స్తాయి విజయాన్ని సొంతం చేసుకోవడం. విజయం వస్తూ వస్తూ అందలాన్ని ఎక్కిస్తుంది. ఆ ఊపును కొనసాగించకపోతే.. అందలం నుంచి దిగినట్టే! కాబట్టి.. ఎన్టీఆర్‌ ఆ అందలం దిగాల్సిన పరిస్థితి తలెత్తకుండా చూసుకుంటే ఆయన అభిమానులకు ఆనందం!

దర్శకులను లెక్కచేయడం లేదా!

తారక్‌కు ఒక అలవాటుంది.. అదేమనగా, విజయాలతో ఉన్న దర్శకుల వెంటబడటం. తన సాటి హీరోలెవరికైనా ఒక హిట్‌ లభించిందటే.. సదరు సినిమా దర్శకుడితో ఎన్టీఆర్‌ మరో సినిమా చేయడం అనేది తప్పనిసరి అనే పరిస్థితే కొనసాగింది ఇన్ని రోజులూ. ఇందులో తప్పేం లేదు కూడా. కానీ.. ఒకసారి ఆ దర్శకులు తన దగ్గరకు వచ్చాకా కొంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తాడనే పేరు కూడా ఉంది ఇతడికి. కొన్నాళ్ల కిందట ఒక దర్శకుడు ఇతడి పిలుపు మేరకు, ఇతడు ప్రదర్శించిన ఆసక్తి మేరకు.. కలవడానికి ఇంటికి వెళితే చేదు అనుభవం ఎదురైందని సమాచారం. 

కొన్ని గంటల సేపు కూర్చోబెట్టి.. కనీసం కలవకుండానే ఎన్టీఆర్‌ పంపించేసినట్టుగా తెలుస్తోంది. ఆ దర్శకుడు ఏమీ అవకాశాల కోసం దేబిరించాల్సిన పరిస్థితుల్లో లేడు. దీంతో ఎన్టీఆర్‌ తీరును తీవ్రమైన ఇన్సల్ట్‌ గానే భావించాడట. ఇక 'జనతా గ్యారేజ్‌'' భారీ కలెక్షన్లు ఎన్టీఆర్‌కు కొంత గర్వాన్ని కూడా తెచ్చిపెట్టాయనే ప్రచారం జరుగుతోంది. ఇంతకు మించిన స్థాయి వసూళ్లు రాబట్టే సినిమా చేయాలంటూ.. తనకు అల్లాటప్పా అనిపించిన వారిని అస్సలు లెక్కే చేయడం లేదనే మాటా వినిపిస్తోంది!

-వెంకట్‌ ఆరికట్ల

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?