ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన రహస్యమే వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నల్లధనం స్వచ్చంద వెల్లడి పధకం కింద ఎవరికి తెలియని సీక్రెట్ ను ఆయన కనుగొన్నారు. అందుకు ఆయనను అభినందించవలసి ఉంటుంది.
కాకపోతే అబినందనలు అందుకోవడానికి ముందుగా ఆయన నిజమే చెప్పారన్న విషయం దృవపడాలి. హైదరాబాద్ లో పదమూడు వేల కోట్ల నల్లధనాన్ని కొంతమంది ఆదాయపన్ను శాఖకు తెలియచేస్తే అందులో ఒక వ్యక్తి పదివేల కోట్ల మేర నల్లధనానికి లెక్కలు చెప్పారన్నది ఆయన వెల్లడించిన రహస్యం.
కేంద్రం నిబందన ప్రకారం ఆదాయపన్ను శాఖ ఈ వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతారు. కాని చంద్రబాబుకు ఈ విషయం తెలిసిందంటే అది గొప్ప సంగతే అవుతుంది. అందులోను ఆయన ఒక మాట అన్నారు. పదివేల కోట్లు వెల్లడించినదెవరో తేలాల్సిన అవసరముందని, రూ.10 వేల కోట్లు నల్లధనం అర్జించే శక్తి ఎవరికుందని ? వ్యాపారవేత్తలకు సాధ్యమా? దేశం ఎక్కడకు వెళ్తొంది?అని చంద్రబాబు ప్రశ్నించారు.
నిజంగా చంద్రబాబు మంచి ప్రశ్నే వేశారు. ఆదాయపన్ను శాఖ కు మాత్రమే తెలిసే విషయాలు చంద్రబాబుకు కూడా తెలిశాయంటే ఆ శాఖలో ఈయనకు సంబందించినవారు ఉండి ఉండాలి. లేదా కేంద్రంలోని పెద్దలు సమాచారం ఇచ్చి ఉండాలి. అందులో నిజం ఉంటే దానిపై ప్రజలు కూడా స్పందించవలసి ఉంటుంది. అంత పెద్ద మొత్తంలో ఒకే వ్యక్తి నల్లదనం బయటపెడితే ఆయన పేరును కూడా చంద్రబాబు చెప్పి ఉండవచ్చు. ఆయన ఎందుకు అలా చేయలేదో తెలియదు. లేని పక్షంలో కేంద్రం అన్నా వివరణ ఇవ్వాలి.
వదంతులు, ఎదుటి పక్షాల మీద బురదజల్లడంలో చంద్రబాబుకు ఉన్నంత నైపుణ్యం మరెవరికి లేదని ఎక్కువమంది నమ్ముతారు. అబద్దాలు చెప్పి విజయం సాధించడంలో చంద్రబాబును మించి మొనగాడు లేడని ఆయన ప్రత్యర్ధులు వ్యాఖ్యానిస్తుంటారు. చంద్రబాబు తాను చెప్పింది నిజమేనని రుజువు చేసుకోవలసిన బాద్యత ఆయనపై ఉంది. లేకుంటే ఆయన మరో అబద్దం ఆడుతున్నారని అనుకుంటారు. ఏదో ఒక వదంతి సృష్టించి జనంలోకి వదలేశాములే అంటే సరిపోదు.
ఇక నల్లధనం గురించి, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం గురించి చంద్రబాబు ఎన్నైనా నీతులు చెప్పగలరు. ఎన్నికలలో ఐదుఆరు కోట్లు పెట్టడదానికి నేతలు ఇబ్బంది పడుతున్నారని ఆయనే చెబుతారు. అమరావతిలో భూములు ఇచ్చినవారికి కోట్లు వచ్చాయని అదంతా తమవల్లేనని ఆయనకాని, ఆయన మంత్రి నారాయణ కాని తరచూ చెబుతుంటారు. మరి అందులో నల్లధనం పాత్ర ఎంత ఉంది వారికి తెలియదనుకోనవసరం లేదు. అయినా నల్లధనం గురించి అనర్ఘళంగా చంద్రబాబు ఉపన్యాసం చెప్పగలరు. అదే ఆయన గొప్పదనం.
దురదృష్టవశాత్తు భారతదేశ ఆర్దిక వ్యవస్థలో నల్లధనం ఒక భాగం అయింది.అది మంచిదికాదని అంతా ఒప్పుకుంటారు. కాకపోతే రాజకీయ నేతలు నీతులు చెబుతూనే అన్ని అక్రమాలకు పాల్పడుతుంటారు.అంతదాకా ఎందుకు చంద్రబాబు తాను తన అభ్యర్ధులకు ఎన్ని కోట్లు చొప్పున గత ఎన్నికలలో డబ్బు ఇచ్చారో ఆయనకు గుర్తు ఉండదని అనుకుంటామా?.అదంతా నల్లధనం కాదని ఆయన ప్రమాణం చేసి చెప్పగలరా? ఆమాట కు వస్తే తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్ కు ఇస్తూ పట్టుబడిపోయిన ఏభై లక్షల రూపాయలు నల్లధనమో, తెల్లధనమో చంద్రబాబు చెబితే ఆయనకు హాట్స్ ఆఫ్ చెప్పవచ్చు.
ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయని ఒక కవి అంటారు. అలాగే చంద్రబాబు కూడా ఇలా నీతులు చెబితే ఇంటర్వ్యూ చేసే మీడియా ప్రతినిది ప్రశ్నించకపోవచ్చు. జనం లో కూడా ఈ ప్రశ్నలన్నీ రావని అనుకుంటే భ్రమపడడమే అవుతుంది.
కొమ్మినేని శ్రీనివాస్ రావు , సీనియర్ జర్నలిస్ట్