తన బలమేంటో త్రివిక్రమ్ కు బాగా తెలుసు. ఆ బలాన్నే వెండితెరపై చూపిస్తుంటాడు. హీరోగా పవన్, నితిన్, బన్నీ.. ఇలా ఎవరున్నా త్రివిక్రమ్ ఫార్ములా మాత్రం ఒకటే. అదే ఫ్యామిలీ ఎమోషన్స్. ఈ యాంగిల్ లో సినిమా తీసి హిట్ కొట్టడం త్రివిక్రమ్ కు ఇప్పుడు హాబీగా మారిపోయింది.
ఇక్కడ ఇంత బలం పెట్టుకొని మరో కొత్త జానర్ ను త్రివిక్రమ్ ఎంచుకుంటాడని ఊహించడం అమాయకత్వమే అవుతుంది. అవును.. ఎన్టీఆర్ సినిమాకు కూడా తనదైన ఫార్ములాతోనే వెళ్లబోతున్నాడు త్రివిక్రమ్. అందమైన ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో ఓ చక్కటి ప్రేమకథను తారక్ తో ప్రజెంట్ చేయబోతున్నాడు.
తారక్-త్రివిక్రమ్ సినిమాపై మొన్నటివరకు చాలా ఊహాగానాలు నడిచాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని కొందరు, కంప్లీట్ యాక్షన్ ఫార్మాట్ లో మూవీ రాబోతోందని మరికొందరు చెప్పుకొచ్చారు. కానీ త్రివిక్రమ్ మాత్రం ట్రాక్ తప్పలేదు. తనకు కలిసొచ్చిన ఫ్యామిలీ జానర్ లోనే సినిమా చేయబోతున్నాడు.
అటు ఎన్టీఆర్ కూడా ఈ కథకు ఓకే చెప్పడానికి ఓ కారణం ఉంది. బృందావనం తర్వాత మళ్లీ ఆ స్థాయిలో కంప్లీట్ ఫ్యామిలీ కమ్ లవ్ ఎంటర్ టైనర్ చేయలేదు. ఈమధ్య వచ్చిన టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ.. ఇలా ఏ సినిమా తీసుకున్నా అందులో ఫ్యామిలీ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి కానీ, వాటినే కథాంశంగా తీసుకున్న సినిమాల్లేవు. అందుకే త్రివిక్రమ్ చెప్పిన స్టోరీలైన్ కు ఎన్టీఆర్ ఓకే చెప్పాడు.