రాను రాను తెలుగు సినిమా అంటే పెద్ద సినిమా. నటుడు అంటే పెద్దనటుడు అన్నట్లు తయారవుతోంది. బాధ కలిగించే విషయం ఏమిటంటే, రాజుగారి దేవతా వస్త్రాలు బాగున్నాయి.. అంటే బాగున్నాయి అంటూ చెలరేగి ట్వీట్ లు షేర్ లు చేయడం తప్ప, నిజంగా బాగున్నది బాగున్నాయి. బాగాలేనిది బాగాలేదు అని చెప్పే ఆలోచన లేకుండా పోయింది. దీనికి తోడు మీడియా కూడా అలాగే తయారైంది.
డ్యాన్స్ లు అంటే పెద్ద హీరోనే చేయాలి. ఫైట్లు అంటే పెద్ద హీరోనే చేయాలి. చిన్న హీరోలు, కమెడియన్లు పెద్ద సినిమాలు చేసే ప్రయత్నం, ఎదిగే ప్రయత్నం చేయకూడదు. పెద్ద హీరో కాలు అడ్డందిడ్డంగా పెట్టికూర్చున్నా, 'సూపరెహె' అంటారు. అదే చిన్న హీరో పద్దతిగా డ్యాన్స్ చేసే ప్రయత్నం చేసినా, 'అవసరమా వీడికి ఇదంతా' అంటూ ముందు మీడియానే డిస్కరేజ్ చేయడం ప్రారంభిస్తుంది.
కన్నడం, తమిళంలో ఎంతమంది కమెడియన్లు హీరోలుగా కామెడీ సినిమాలు చేయలేదు. కామెడీ సినిమాను కామెడీ సినిమాగా చూడాలి. కామెడీ సినిమాలో కామెడీ హీరో చేసే డ్యాన్స్ లను ఫైట్లను కామెడీగానే చూడాలి. అంతేకానీ, వీడికి అవసరమా? అని కామెంట్ చేయడం ఏమిటో అర్థంకాదు.
ఓ చిన్న జర్నలిస్ట్ రాసిన వార్తకు, పెద్ద ఎడిటర్ రాసిన వార్తకు ఏమిటి తేడా? చిన్న జర్నలిస్ట్ పెద్ద ఎడిటర్ అయ్యే ప్రయత్నం చేయకూడదా? అప్పుడు ఇదీ ఓ వార్తేనా? అని గేలి చేస్తారా? చేసిన ప్రయత్నం బాగా లేకపోతే విమర్శించవచ్చు. అసలు ప్రయత్నాన్నే విమర్శిస్తే ఎలా? సునీల్ సిక్స్ ప్యాక్ చేస్తే, అవసరమా? అంటారు. అదే పెద్ద హీరో సిక్స్ ఫ్యాక్ చేస్తే సూపర్ అంటారు. సప్తగిరి డ్యాన్స్ చేస్తే అవసరమా అంటారు.
కాశీనాథ్, నగేష్, రేలంగి, రాజబాబు, చలం ఇలా ఎందరు కమెడియన్లు హీరోలు కాలేదు. పాటలు, డ్యాన్స్ లు చేయలేదు. ఇప్పటి మాదిరిగా మీడియా అప్పట్లో వాళ్లను విమర్శించలేదే? సినిమాలు బాగుంటే ఎంకరేజ్ చేయాలి. లేదూ అంటే విమర్శించాలి. అంతేకానీ ఎదగాలనుకున్న వాళ్ల కోరికను కాదు.
ఇది ఇండస్ట్రీలో ఓ నటుడి వాదన.. ఆవేదన.. స్వగతం.