దర్శకుడు త్రివిక్రమ్ సాధారణంగా మీడియాకు దూరంగా వుంటారు. సినిమా విడుదలకు ముందు మీడియాను కలవడం, ఇంటర్వూలు ఇవ్వడం లాంటి మొహమాటపు కార్యక్రమాలు ఆయనకు పెద్దగా నచ్చవు. కానీ అరవింద సమేత వీరరాఘవ సినిమాకు మాత్రం ఆయనకు ఇవన్నీ తప్పలేదు. అజ్ఞాతవాసి ఫలితం కావచ్చు, హారిక హాసిని బలవంతంగా ఒప్పించడం కావచ్చు. మొత్తానికి శని, ఆదివారాల్లో ఆయన రోజంతా పార్క్ హయాత్ హోటల్ లో ఎన్టీఆర్ తో కలిసి ఇంటర్వూలు ఇచ్చుకుంటూ వచ్చారు.
అరగంటకి ఓ ఛానెల్ వంతను ఓ రోజల్లా ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లు, ఓ రోజంతా న్యూస్ చానెళ్లకు ఇంటర్వూలు ఇచ్చారు. ఈ ఇంటర్వూలు అన్నీ ఓపిగ్గా గమనిస్తే, అందరికీ ఓ విషయం బయటపడుతుంది. సాధారణంగా ఇలాంటి ఇంటర్వూలకు అందమైన యాంకర్లనే తీసుకువస్తారు. రెగ్యులర్ జర్నలిస్ట్ లను కాదు. వారేదో వారి ధోరణిలో వాళ్లు అడుగుతారు. సినిమా కోసం తప్పదు కనుక సమాధానాలు చెబుతారు.
కానీ త్రివిక్రమ్ కు ఇదంతా చాలా ఇరిటేటింగ్ గా, ఫన్నీగా అనిపించినట్లు తెలుస్తోంది. ఇంటర్వూల విడియోలు అన్నీ యూ ట్యూబ్ లో వున్నాయి. ఓపిగ్గా చూస్తే ఓ విషయం అర్థం అవుతుంది. ప్రశ్నల టైమ్ లో త్రివిక్రమ్-ఎన్టీఆర్ ఒకరిని ఒకరు చూసుకుని ముసిముసిగా నవ్వు కోవడం, చిన్నగా మాట్లాడుకోవడం ఇలా. అంతే కాదు, ఎన్టీఆర్ ఆఫ్ ది స్క్రీన్ కూడా అద్భుతంగా నటించేయగలరు కాబట్టి ఎక్కువ ప్రశ్నలను ఆయనే తీసుకుని సమాధానం చెప్పి, త్రివిక్రమ్ ఇబ్బందని దాటవేసారు కూడా. ఇంటర్వూ, ఇంటర్వూ గ్యాప్ లో త్రివిక్రమ్, సినిమా పీఆర్ టీమ్ ను, ప్రత్యేకంగా రిక్వెస్ట్ కూడా చేసినట్లు తెలుస్తోంది.
కాస్త మంచి క్వశ్నన్ లు అడగమని చెప్పండి. ప్రశ్నలు రొటీన్ గా వుంటున్నాయి మార్చమని చెప్పండి అని. అక్కడితో ఆగకుండా ఇంటర్వూల మధ్యలోనే బయట వున్న పీఆర్ టీమ్ కు మెసేజ్ లు కూడా పంపి, మంచి ప్రశ్నలు అడిగేలా చూడమని కోరినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఇంటర్వూ, ఇంటర్వ్యూ గ్యాప్ లో త్రివిక్రమ్, ఎన్టీఆర్ జరిగిన ఇంటర్వ్యూలను తలుచుకుని కొంచెం నవ్వుకున్నట్లు బోగట్టా.