గీతం విద్యాసంస్థల అధినేత, తెలుగేదశం నాయకుడు ఎంవీవీఎస్ మూర్తి హఠన్మరణంతో ఉత్తర అమెరికా గీతం పూర్వవిద్యార్థుల అసోసియేషన్(గానం) సంస్మరణ సభ నిర్వహించింది. హృదయ విదారకమైన ప్రమాదంలో మృత్యువాత పడిన ఎంవీవీఎస్ మూర్తితోపాటు, వెలువోలు బసవపున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్, వీబీఆర్ చౌదరిల గురించి జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. ఈ కార్యక్రమంలో 200కుపైగా గీతం పూర్వవిద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొని ఘనంగా నివాళి అర్పించారు. ఫ్రీమాంట్ సిటీ మేయర్ లిలీ మీయి కూడా హాజరై ఆమె సంతాపాన్ని కూడా తెలియజేశారు.
గీతం కుటుంబానికి సన్నిహితులైన ఉత్తర అమెరికాలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి, తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, ఏపీఎన్నార్టీ బృందం, బాటా ఎగ్జిక్యూటివ్ బృందం, తానా, ఎన్నారై టీడీపీ సభ్యులు పాల్గొని వారి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గానం అధ్యక్ష కార్యదర్శులు రవి పాపోలు, కామేష్ మల్లాలు సంస్మరణ సభకు ప్రారంభోపన్యాసం చేస్తూ గడిచిన కొన్ని వారాలుగా మూర్తి, ఇతర ముఖ్యవ్యక్తులతో వారితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు.
గానం ఏర్పాటులో వారు చూపిన ఆసక్తి, ఉత్సాహాన్ని ఈ సందర్భంగా తెలియపరిచారు. ఏ ఆశయంతో అయితే గానం స్థాపించారో వాటిని సాకారం చేయడానికి తమవంతు కృషిచేస్తామని తెలిపారు. ఏపీలో పేరోందిన విద్యాసంస్థగా ఎదిగిన గీతంలో అనుబంధం ఉండటం తమకెంతో గౌరవం తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు, ఇతర ప్రముఖలకు వారు ధన్యవాదాలు తెలియజేశారు. టెక్సాస్ నుంచి అధ్యక్ష, కార్యదర్శులులైన విక్రాంత్, ప్రసాద్ గుజ్జు హాజరై తమ సంతాపాన్ని తెలియజేశారు.
ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖులతో తమకున్న అనుబంధాన్ని జయరాం గుర్తు చేసుకున్నారు. గానం ఏర్పాటు మూర్తి, పున్నయ్యల ప్రోద్బలం, సహకారం గురించి ఈ సందర్భంగా తెలియజేశారు. తోటకూరప్రసాద్ మాట్లాడుతూ ఆయనతో ఉండే సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సంక్షిప్త బయోగ్రఫీలను అందజేశారు.
పూర్వపు ఫ్యాకల్టీ సభ్యులు నాగవల్లి, రవి కర్రి, నరసింహరావు గీతంతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తమ సంతాపాన్ని తెలియజేశారు. గానం ప్రారంభం వేడుకల్లో పాల్గొనాలని ఆ మహావ్యక్తులైన మూర్తి, బసవపున్నయ్యలు చూశారని, కాని ఈ రోజు వారి సంస్మరణ సభకు హాజరవుతారని ఎవరూ అనుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
తమ అభిమాన నాయకుల అంతిమ లక్ష్యం తీసేందుకు తాము ప్రయత్నిస్తామని గానం సభ్యులు ప్రతిజ్ఞచేశారు.