ఆఫీసర్ నిర్మాత కొత్త వాదన

ఎవరి పాయింట్లకు అనుగుణంగా వారి వాదనలు నిర్మించుకుంటారు. ఇది వాస్తవం. మూడున్నర కోట్లకు ఆఫీసర్ సినిమాను కొంత ఏరియాకు కొన్న బయ్యర్ నష్టపోయారు. ఆయన వాదన ఆయన వినిపించారు. ఆఫీసర్ సినిమా నిర్మాత ఆయన…

ఎవరి పాయింట్లకు అనుగుణంగా వారి వాదనలు నిర్మించుకుంటారు. ఇది వాస్తవం. మూడున్నర కోట్లకు ఆఫీసర్ సినిమాను కొంత ఏరియాకు కొన్న బయ్యర్ నష్టపోయారు. ఆయన వాదన ఆయన వినిపించారు. ఆఫీసర్ సినిమా నిర్మాత ఆయన వాదన ఆయన వినిపిస్తున్నారు. ఇంగ్లీష్ లో డ్రాఫ్టింగ్ చేయడంలో దర్శకుడు ఆర్జీవీ ఘనాఫాఠి. అందులో సందేహంలేదు. ఆ విద్య ఈ మీడియాకు బహిరంగ లేఖలో కూడా కాస్త కనిపించింది.

లేఖ ఆరంభంలోనే, ఆఫీసర్ సినిమా క్రియేటివ్ పరంగా, ఆర్థికంగా దెబ్బతిందని అంగీకరించారు. అయితే లేఖ ఆరంభంలోనే ఆఫీసర్ సినిమాను అమ్మారంటూ వినిపిస్తున్న నెంబర్లు అన్నీ అవాస్తవం అని ఒక్క మాటతో కొట్టేసారు. కానీ ఆఫీసర్ సినిమాను. అమ్మారని వినిపిస్తున్న మాటలు ఏమిటి? ఆంధ్ర ఏరియాను మూడున్నర కోట్లకు అమ్మారని మాత్రమే. నైజాం గురించో, సీడెడ్ గురించో వినిపించలేదు. 

ఆంధ్రలో అయిదు జిల్లాలు మాత్రం చాలా తక్కువకు, ఎంజికి అమ్మాం అని అంగీకరించారు. కొన్న బయ్యర్ చెప్పింది కూడా అదే. మూడున్నరకు ఆంధ్ర కొన్నాను. అందులో 70 లక్షలకు గుంటూరు ఇచ్చేసాను అని. నాగార్జున సినిమా ఆంధ్రకు మూడున్నర అంటే పరమ చౌక బేరం కాదు అని ఎవరు అన్నారు. చిన్నచిన్న హీరోల సినిమాలు సైతం ఆంధ్రకు నాలుగుకోట్ల రేషియోలో అమ్ముతున్నారు. అలాంటిది నాగ్ సినిమా మూడున్నర కోట్లు అంటే చౌకబేరమే, కాదని ఎవ్వరూ అనరు.

అయితే అయిదు ఏరియాలు మాత్రం అమ్మాము అని అనడం కరెక్ట్ కాదేమో? గుంటూరు ఏరియా తానే తన మిత్రుడికి 70 లక్షలకు ఇచ్చానని, ఆంధ్ర కొన్న బయ్యర్ సుబ్రహ్మణ్యం చెబుతున్నారు. ఈ డీల్ కన్నా ముందే కృష్ణజిల్లాను ఇంకో బయ్యర్ కు డిస్ట్రిబ్యూషన్ కు ఇచ్చేసారు. నాగార్జున సినిమా కృష్ణాకు తను చేయాలని నాగ్ అభిమాని అయినా ఆ డిస్ట్రిబ్యూటర్ కోరడంతో అక్కడ అలా జరిగింది. 

 సీడెడ్ ను ఎన్వీ ప్రసాద్ కు డిస్ట్రిబ్యూషన్ కు ఇచ్చేసారు. అంటే వైజాగ్ (మూడు జిల్లాలు) ఈస్ట్, వెస్ట్, నెల్లూరు, గుంటూరు అమ్మనట్లు అయింది. మిగిలిన సీడెడ్, నైజాం, సీడెడ్, కృష్ణ డిస్ట్రిబ్యూషన్ కు ఇచ్చినట్లు అయింది. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఆ కొద్దిపాటి ఏరియాలు, ఆ కొంచెం అమౌంట్ కు కొన్న బయ్యర్ నే రూపాయి రాలేదు, మొత్తం పోయిందని గగ్గోలు పెడుతున్నారు.

దానికి సమాధానం చెప్పకుండా, దాన్ని భర్తీ చేస్తామనో, కాదనో చెప్పకుండా, తాము లాభాలు చేసుకోలేదు, డిస్ట్రిబ్యూషన్ చేసాము, కొన్ని ఏరియాలే అమ్మాము అనడం ఏమిటి? మూడున్నర కోట్లకు (19 లక్షలు తక్కువ కట్టారు) ఎన్నో కొన్ని ఏరియాలు అమ్మిన మాట వాస్తవం. ఆ మూడున్నర కోట్లు పూర్తిగా పోయిన మాట వాస్తవం. పైగా ఖర్చులు ఎదురు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. 

ఈ విషయంలో ఏం చేస్తామో అన్నది మాత్రం నిర్మాత తన లేఖలో వివరించలేదు. తాము ఆర్థికంగా, క్రియేటివ్ పరంగా దెబ్బతిన్నామని మాత్రమే చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఆర్థికంగా దెబ్బతినడానికి ఎక్కువ అవకాశం లేదు. ఎందుకంటే 11కోట్లకు డిజిటల్, శాటిలైట్ హక్కులు అమ్మినట్లు బోగట్టా. మూడున్నర కోట్లు కొన్ని జిల్లాలకు వచ్చింది. అంటే 14.5కోట్లు నికరంగా వచ్చినట్లే. అడ్వాన్స్ లు ఏమైనా వచ్చాయా? అన్నది నిర్మాతకు తెలియాలి.

ఈ 14.5 కోట్లలో నాగ్ కు మూడుకోట్లు ఇచ్చారని టాక్ వుంది. సినిమా మేకింగ్ కు మరీ ఎక్కువ ఖర్చుచేయలేదని, కాస్టింగ్ అంతంత మాత్రం అని సినిమా చూసిన వారందరికీ అర్థం అవుతూనే వుంది. ఇవన్నీ వదిలేయండి. బయటకు మీడియాలో వచ్చిన విషయం ఒకటే. కొన్ని ఏరియాలకు మూడున్నర కోట్లకు కొన్న వ్యక్తి, మొత్తం నష్టపోయారు. ఆదుకోమని కోరుతున్నారు. నిర్మాత ఏమైనా చెప్పాలంటే దాని గురించి కదా? ముందుగా చెప్పాలి. అది వదిలేసి, ఏదేదో చెబితే ఏలా?