అది పవన్ కల్యాణ్ సినిమా వేడుక కాదు, కనీసం మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమా ఫంక్షన్ కూడా కాదు. సినిమాల్లో నటించిన వారిలో కానీ, సినిమాకు పని చేసిన వారిలో కానీ పవన్ కల్యాణ్ కు దూరపు చుట్టాలెవరూ లేరు…. మరి అలాంటి చోట ప్రత్యక్షం అయ్యారు సో కాల్డ్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్. మెడలో ఎర్ర కండువాలు వేసుకుని వస్తే వచ్చారు.. ఆ గోల ఎందుకు? ‘పవర్ స్టార్.. పవర్ స్టార్..’ అంటూ అరుపులు!
ఇంతకీ వీళ్ల ఉద్దేశం ఏమిటి? పవన్ కల్యాణ్ పరువు తీయడానికి వచ్చారా? లేక వేరే సినిమా కార్యక్రమాన్ని డిస్ట్రబ్ చేసేందుకు వచ్చారా? ఇది కొత్త కూడా కాదు, ఇది వరకూ ఏం జరిగిందో.. ఎన్ని సార్లు జరిగిందో అందరికీ తెలిసిందే. వీళ్ల కేకలపై మెగా కుటుంబీకులే విసుగుచెందారు. వీళ్లపై అసహనం వ్యక్తం చేస్తూ అల్లుఅర్జున్ ‘ చెప్పను బ్రదర్..’ అనడమూ బాగా పాపులర్ అయ్యిందే, వీరి తీరుపై నాగబాబు విరుచుకుపడమూ తెలిసిందే. ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ -150’ ఫంక్షన్లో జనసేన జెండాలు ప్రదర్శించి చిరంజీవి ఆగ్రహానికి గురయ్యారు పవన్ కల్యాణ్ అభిమానులు. అవే చెత్త పనులు అనుకుంటే.. ఏకంగా బాహుబలి పార్ట్ టూ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా వీళ్లు రెచ్చిపోయారు.
ఎర్రకండువాలు వేసుకుని.. తమ రొటీన్ లొల్లి చేశారు. మరి ఇదంతా పవన్ మీద అభిమానమే అని వాళ్లు భ్రమపడితే పడొచ్చు. కానీ.. పవన్ పరువును తీయడానికే వీళ్లు కంకణం కట్టుకుని ఉన్నారని మాత్రం బయటివాళ్లకు స్పష్టత వస్తోంది. నిన్నటి ఫంక్లన్లో వీళ్ల అతి చూశాకా మాత్రం.. గతంలో ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు గుర్తుకురాక మానవు, ఆర్జీవీ వాజ్ రైట్.. అనిపించకా మానదు.