మనుషుల్లో స్థితప్రిజ్ఞత కలిగిన వారు అరుదుగా వుంటారు. సినిమా రంగంలో అయితే మరీనూ..రెండు హిట్ లు రాగానే ఎక్కడికో వెళ్లిపోతారు..ఒక్కటి ఫట్ మనగానే కాళ్లు నేలకు ఆనిపోతాయి.
ఇప్పుడు శ్రీను వైట్ల సంగతి అచ్చంగా అలాగే అనిపిస్తోంది. శ్రీనువైట్ల ఫార్ములా అన్న ప్రచారం. సక్సెస్ ఆయను ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. ఏ విజయమైనా ఎక్కడో ఒక దగ్గర టీమ్ వర్క్ కు కనెక్ట్ అయి వుంటుంది అన్న సంగతి వదిలేసి, తన టీమ్ ను తానే దూరం చేసుకున్నారు. రైట్ జడ్జిమెంట్ అన్నది టీమ్ లీడర్ కు వరం. అంతే కానీ, అన్ని పనులు తానే చేసుకోగల సత్తా అందరికీ వుండదు.
కానీ దాన్ని విస్మరించి, అంతా తన ఘనతే అనుకుంటే కష్టం. కోన వెంకట్ అండ్ కో దూరం కాగానే శ్రీను వైట్లకు ఇబ్బందులు మొదలయ్యాయి. అయినా హిట్ లు కొట్టారు. దాంతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ మరింత మీదకు వెళ్లాయి. ఫలితమే ఆగడు..కథ కథనాలు..వివాదాలు,. తన సినిమానే అటు తిప్పి ఇటు తిప్పి వదిల్తే చాలు జనం చూస్తారనుకున్నాడు. కానీ జనం తాము ఇలాంటి వాళ్లని, ఇలాంటి వ్యవహారాలను చాలా చూసామన్నట్లు రిజల్ట్ ఇచ్చారు.
దీంతో శ్రీను వైట్ల పరిస్థితి ఆగడుకు ముందు..తరువాత అన్నట్లు తయారైంది. ఆగడుకు ముందు..ఆయన దూకుడు ఇంతా అంతా కాదు..ఆగడే ఆగడు అన్నట్లుంది. ఆ దూకుడులోనే ప్రకాష్ రాజ్ తో కూడా కయ్యానికి దిగారు. ఆగడు సినిమా కొట్టిన దెబ్బ ఇంతా అంతా కాదు. అన్ని విజయాలను ఒక్క పరాజయం తుడిచిపెట్టేసింది. శ్రీను వైట్లను నూటికి నూరు శాతం డిఫెన్స్ లోకి నెట్టేసింది.
నిజానికి అన్ని విజయాలు చూసిన ఓ దర్శకుడు ఇంత నీరసపడకూడదు. అసలు తన చాప్టర్ క్లోజ్ అన్నంతగా విలవిల లాడారు. ఆఖరికి ఎలాగోలా రామ్ చరణ్ సినిమా ఓకె చేయించుకున్నారు. ఇప్పుడు దాని ప్రభావం స్పష్టంగా తెలుస్తోంది. తను జత కట్టను ఎప్పటికీ అనుకున్న కోన వెంకట్, గోపీ మోహన్ లతో జత కట్టక తప్పేలేదు. లేదంటే రామ్ చరణ్ సినిమా వుండదు.
గతంలో ఆఫ్ ది రికార్డుగా చాలా మందితో అన్నారని వినికిడి..థమన్ ను ఇక తన సినిమాకు సంగీత దర్శకుడిగా పెట్టుకోను అని. కానీ ఇప్పుడేమంది..మళ్లీ థమన్ నే శ్రీను వైట్లకు జత కూర్చింది మెగా క్యాంప్. ఇవన్నీ ఒక ఎత్తు..మళ్లీ ప్రకాష్ రాజ్ దగ్గరకు వెళ్లి స్నేహ హస్తం చాచడం మరో ఎత్తు. ఇప్పుడు చరణ్ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా వున్నారని వినికిడి. ఇప్పుడే చెబితే బాగుండదని చెప్పడం లేదని అంటున్నారు.
అంటే శ్రీనువైట్ల మాట పట్టింపులు, ఇష్టాలు..అన్నీ పక్కకు పోయాయి. కేవలం ఒక్క సినిమా దర్శకత్వ అవకాశం కోసం శ్రీనువైట్ల ఇప్పుడు ఎంత ఒదగాలో అంతా ఒదిగారు. అదే ఆయన ఈ సినిమా కోసం చూసుకోకుండా, మిడిల్ రేంజ్ హీరో ఎవరితోనైనా మాంచి సినిమా తీసి హిట్ కొట్టి వుంటే పెద్ద సినిమాలు ఆయనను వెదుక్కుంటూ వచ్చేవి..ఆయన మాట చెల్లేది. ఇప్పుడు పడిన రాజీలు వుండకపోను. కానీ ఒక్క ఓటమి శ్రీనువైట్లను సినిమా చాన్స్ కోసం కిందా మీదా పడేలా చేసింది..రాజీ మార్గం పట్టేలా చేసింది.