ఎమ్బీయస్‌: గోడ్సేని ఎలా చూడాలి? – 19

ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు కొన్ని వున్నాయి. గాంధీ అహింసా మార్గాన్ని నిరసించిన గోడ్సే స్వయంగా హింసావాది కాదు. తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి హింసను అవలంబించినవాడు కాదు. నేరప్రవృత్తి, కాఠిన్యం యివేమీ అతని గుణాలు…

ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు కొన్ని వున్నాయి. గాంధీ అహింసా మార్గాన్ని నిరసించిన గోడ్సే స్వయంగా హింసావాది కాదు. తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి హింసను అవలంబించినవాడు కాదు. నేరప్రవృత్తి, కాఠిన్యం యివేమీ అతని గుణాలు కావు. కనీసం పట్టాలు పేల్చేసే, రైళ్లు పడగొట్టే, ఆంగ్ల సైనికులపై దాడులు చేసే విప్లవ మార్గాన్ని కూడా పట్టినవాడు కాదు. భగత్‌ సింగ్‌లా ఆత్మాహుతి చేసుకునే వీరుడూ కాడు. 1948 జనవరి 20 నాటి విఫలహత్యా ప్రయత్నం చేసినపుడు గోడ్సే ఆయుధం చేపట్టాలనీ, పట్టుబడదాలనీ అనుకోలేదు. అతనూ, ఆప్టే హత్యాస్థలానికి వెళ్లిన టాక్సీని వెయిటింగ్‌లో పెట్టి, రానూపోనూ ఛార్జీలు బేరమాడుకున్నారు. హోటల్లో చాకలికి బట్టలు వేసి 22వ తారీక్కు డెలివరీ ఇమ్మన్నారు కూడా! ముఠా అందరూ బాంబులు ఎడాపెడా విసిరేశాక, ఎవరి కంటా పడకుండా వచ్చి హోటల్లో రెండు రోజులు కాస్త అణిగిమణిగి ఉండి, ఎవరి ఊళ్లకు వాళ్లు రైళ్లెక్కేయ వచ్చనుకున్నారు. అది విఫలం కావడంతో గత్యంతరం తోచక గోడ్సే తనే రంగంలోకి దిగి 30 న గాంధీ ఎదుటబడి కాల్చేశాడు. తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. గాంధీని కాల్చగానే చుట్టూ జనమంతా అతనిపై విరుచుకు పడ్డారు. కానీ హంతకుడినైనా ప్రజాగ్రహం నుంచి రక్షించడం తన విద్యుక్తధర్మంగా, శాంతిభద్రతలు కాపాడడం తన బాధ్యతగా భావించిన ఒక పోలీసు ఆఫీసరు అతన్ని జనం బారి నుంచి కాపాడాడు. చట్టరీత్యా విచారణ జరిగి గోడ్సే 1949 నవంబరులో ఉరి తీయబడ్డాడు. చట్టాన్ని తన చేతిలో తీసుకున్నా అదే చట్టం అతనికి యింకో 22 నెలల ఆయుర్దాయం యిచ్చింది. 

అతనికి జైలులో రక్షణ లభించింది కానీ అతని కారణంగా మహారాష్ట్ర బ్రాహ్మణుల జీవితాలు దుర్భరమయ్యాయి. ఇందిరా గాంధీ హత్య తర్వాత శిఖ్కుల మీద దురంతాలు జరిగినట్లే, గోడ్సే మహారాష్ట్ర బ్రాహ్మణుడు కాబట్టి వారిపై అత్యాచారాలు జరిగాయి. కొంతమంది యిళ్లూ, వాకిళ్లూ కోల్పోయారు. అలా నిర్వాసితుడైన జి.టి. మద్‌ఖోల్కర్‌ అనే ప్రఖ్యాత రచయిత 'ఏకా నిర్వాసితాచీ కహానీ' అనే పుస్తకంలో తమకీ దురవస్థ తెచ్చిపెట్టిన గోడ్సేను తిట్టిపోశాడు. జైల్లో వున్న గోడ్సే అది చదివి, చలించిపోయి మద్‌ఖోల్కర్‌ పేర రాసిన ఉత్తరంలో తనెందుకు హత్య చేయవలసినదో వివరిస్తూ ''గాంధీ ప్రవచించే అహింస ఆచరణలో పనికిరాదని నాకు విధించిన ఉరిశిక్షే చాటి చెబుతోంది..'' అంటూ వితండ వాదన చేశాడు. నిజానికి గోడ్సే అప్పటి వరకు పాటించినవన్నీ గాంధీ మార్గమైన నిరసనలు, ప్రదర్శనలు, మాత్రమే. హింసాప్రయోగం ద్వారా ఆధునిక యుగంలో సాధించిన ఫలితాలు ఏమిటో ఆమెరికా రికార్డు మనకు చెపుతోంది. ఎన్ని బాంబులు వేసినా వియత్నాం వంటి చిన్న దేశాన్ని లొంగదీసుకోలేక పోయింది. ఇటీవలి కాలంలో చేస్తున్న ఇరాక్‌, ప్రయోగం ఎలా వికటించిందో, తాలిబన్లతో చెలిమి ఎలా బెడిసి కొట్టిందో అన్నీ చూస్తున్నాం. నేరం జరిగాక రాజ్యం, సమాజం, వ్యవస్థ గుడ్లప్పగించి చూస్తాయని, శిక్ష వేయకుండా వుంటాయని అనుకోవడానికి లేదు. దాన్ని హింస అంటే ప్రతీ సైనికుణ్నీ హంతకుడనాలి.

హింసాక్రీడలో పాల్గొన్నవారే కాదు, వారికి సంబంధించిన వారందరూ కష్టనష్టాల పాలవుతారు. గోడ్సే కారణంగా మహారాష్ట్ర బ్రాహ్మణులపై దాడులు జరగడమే కాదు, వీర సావర్కార్‌ వంటి మహానుభావుడు కూడా స్వతంత్రదేశంలో జైలుపాలయ్యాడు. గోడ్సే తన వాఙ్మూలంలో ప్రస్తావించిన సావర్కార్‌ గురించి, శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ గురించి తెలుసుకోవలసిన అవసరం వుంది. వినాయక్‌ సావర్కార్‌ నాసిక్‌లో స్కూల్లో చదివేటప్పుడే బ్రిటిషు వారికి వ్యతిరేకంగా విప్లవసంఘం ఏర్పరచారు. పూనా కాలేజీలో చదువుతో రాజకీయ కారణాల చేత బహిష్కృతుడైన తొలి భారతీయ విద్యార్థి యీయనే. 22 వ యేట బారిస్టర్‌ చదువుకై ఇంగ్లండ్‌ వెళ్లారు. అక్కడ ఒక యింగ్లీషు వనితను పెళ్లాడారు కానీ యింగ్లీషువారిపై తన పోరాటాన్ని కొనసాగించడానికి లండన్‌లో 'ఫ్రీ ఇండియా సొసైటీ' ఏర్పరచి, ఓ రష్యన్‌ విప్లవకారుని సహాయంతో బాంబు తయారీ గురించి సమాచారం సేకరించి, పుస్తకరూపంలో ముద్రించి భారతదేశంలోని విప్లవకారులకు పంపిణీ చేశారు. 1857 సిపాయి తిరుగుబాటు గురించి, ఇటాలియన్‌ విప్లవకారుడు గైసెపీ యూజినీ గురించి ఆయన రాసిన పుస్తకాలు పరిశీలించిన ఇంగ్లీషు ప్రభుత్వం ఆయనను ఇండియాలో అడుగు పెట్టరాదని ఆంక్షలు విధించింది. అయితే ఇండియాలో సావర్కార్‌ అనుయాయులు చేపట్టిన 'విద్రోహ చర్యల' విషయంలో ఆయన్ని ఇండియాకు తీసుకుని వచ్చి కోర్టులో విచారించి శిక్ష వేయాలని ప్లాన్‌ చేసింది. లండన్‌లో అరెస్టు చేసి అతి భద్రంగా ఓడలో తీసుకు వస్తూండగా సావర్కార్‌ టాయిలెట్‌ కన్నంద్వారా సముద్రంలోకి దూకి, పారిపోయి, ఫ్రాన్స్‌లోని మార్సేల్స్‌ తీరం చేరారు. అక్కడ ఒక ఫ్రెంచ్‌ పోలీసు రక్షణ కోరగా, అతను సరిగ్గా అర్థం చేసుకోకుండా తిరిగి ఇంగ్లీషు పోలీసులకు అప్పగించేశాడు. 

భారతదేశంలో విచారణ జరిపిన ఆంగ్ల ప్రభుత్వం ఆయనకు 50 సం||రాల జైలు శిక్ష వేసింది. 10 సం||లు అండమాన్‌ జైల్లో వుండేసరికి ఆయన భౌతికంగా, మానసికంగా చితికిపోయారు. అప్పుడు ఇండియాలోని జైలుకి తరలించి, మరో నాలుగేళ్లు వుంచి, అప్పుడు పెరోల్‌ మీద విడిచిపెట్టి మహారాష్ట్రలోని రత్నగిరి తాలూకాలో నివాసమేర్పరచి జిల్లా దాటి వెళ్లకూడదని కట్టడి చేసింది. 1937లో జరిగిన ఎన్నికలలో బాంబే ప్రెసిడెన్సీలో అధికారం చేపట్టిన కాంగ్రెసు ప్రభుత్వం ఆయనపై ఆంక్షలు ఎత్తివేసింది. అప్పుడు సావర్కార్‌ అన్ని ముఖ్యపట్టణాలలో ఉపన్యాసాలు యిస్తూ 'హిందూ సంఘటన' ఉద్యమాన్ని 'హిందూ మహాసభ' అనే రాజకీయపార్టీగా తీర్చి దిద్దారు. రెండవ ప్రపంచ యుద్ధాన్ని సమర్థించే విషయంలో కాంగ్రెసుకు, హిందూ మహాసభకు పొరపొచ్చాలు వచ్చాయి. 'ఇప్పటివరకు మారణాయుధాలు దగ్గరుంటే దండించే ప్రభుత్వం యిప్పుడు మనవాళ్లను సైన్యంలోకి చేర్చుకుని ఆయుధాలలో తనే తర్ఫీదు యిస్తోంది. ఈ అవకాశాన్ని హిందూ యువకులు వుపయోగించుకుంటే, స్వాతంత్య్రం తర్వాత చెలరేగే హిందూ-ముస్లిమ్‌ ఘర్షణలలో హిందువులదే పై చేయి అవుతుంది' అని సావర్కార్‌ వాదన. క్విట్‌ ఇండియా ఉద్యమం నడుపుతున్న కాంగ్రెసు భారతీయులెవరూ సైన్యంలో చేరకూడదని వాదించింది. సావర్కార్‌ చాలా మంది కాంగ్రెసు నాయకులపై నోరు పారేసుకుని శత్రువులను కొని తెచ్చుకున్నారు. గాంధీ హత్య కేసులో వాళ్లు పగ తీర్చుకున్నారు. గోడ్సేను ప్రేరేపించినది యీయనే అంటూ జైలుపాలు చేశారు. (సశేషం)

 – ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]

Click Here For Previous Articles