సాధారణంగా కొన్ని డబ్బింగ్ సినిమాలు ఎప్పుడు విడుదలై వెళ్లిపోతాయో.. చాలా మందికి తెలియదు. జనాల ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండే థియేటర్లలో ఇలాంటి అనామక సినిమాలు విడుదలయ్యే అవకాశాలే ఉండవు. జిల్లా స్థాయిల్లో ప్రాభవం కోల్పోయిన థియేటర్లలో.. తాలూకా, మండల స్థాయిల్లోని థియేటర్లలో మాత్రమే పరాయి భాషల నుంచి డబ్ అయ్యే సినిమాలు విడుదలై వెళ్లిపోతూ ఉంటాయి. కొన్ని అనువాద సినిమాలు ఆ మాత్రం అవకాశాన్ని అయినా పొందుతాయి కానీ.. మరికొన్నింటికి అలాంటి భాగ్యం కూడా ఉండదు. మరి ఒకసారి కాదు.. ఒక సినిమా అయితే రెండుసార్లు అలాంటి అనుభవాన్నే ఎదుర్కొంది. రెండు భాషల నుంచి ఆ సినిమాను తెలుగులోకి డబ్ చేసి విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించలేకపోయారు. చివరకు మాత్రం ఒక భాష నుంచి అనువదించారు.. సినిమా సూపర్ హిట్ అయ్యింది!
ఇది ‘చంద్రముఖి’ సినిమా విషయంలో! రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్టో వేరే చెప్పనక్కర్లేదు. తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయ్యే సినిమాలకు కొత్త ఊపు ఇచ్చిన సబ్జెక్ట్ ఇది. విశేషం ఏమిటంటే.. ఈ సినిమా అప్పటికే రెండు భాషల నుంచి తెలుగులోకి డబ్ అయ్యింది. కానీ విడుదల కాలేదు. చంద్రముఖి సినిమా మలయాళంలో వచ్చి మణిచిత్రతాజు అనే సినిమాకు రీమేక్ అని వేరే చెప్పనక్కర్లేదు. మోహన్ లాల్, సురేష్ గోపి, శోభనలు ముఖ్య పాత్రల్లో నటించగా రూపొందింది ఆ సినిమా. అక్కడ సంచలన విజయం సాధించే సరికి దాన్ని అప్పట్లోనే తెలుగులోకి అనువదించారు! అంటే 1995లోనే ఆ సినిమా తెలుగులోకి డబ్ అయ్యింది. ఆ డబ్డ్ వెర్షన్ పేరు ‘ఆత్మరాగం’!
1995 ఆగస్టు నాటికి ఆ సినిమా తెలుగులోకి డబ్ అయ్యింది. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి కానీ.. సినిమా మాత్రం విడుదల కాలేదు! డబ్బింగ్ అయ్యి విడుదల ఆగిపోయే అనామక సినిమాగా అది అలా మిగిలిపోయింది! తొలిసారి అలా మలయాళం నుంచి తెలుగులోకి అనువాదం అయ్యి విడుదల కావడంలో విఘ్నాలు ఎదుర్కొన్న ఆ సినిమా ఆ తర్వాత 2004లో అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. తమిళంలో ‘చంద్రముఖి’ రూపొందడానికి మునుపే ఆ సినిమాను కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా రీమేక్ చేశారు. సౌందర్య, రమేష్ అరవింద్‌లు ముఖ్యపాత్రలో పోషించగా ఆ సినిమాను ‘నాగవల్లి’ పేరుతో రూపొందించారు. కన్నడలో ఆ సినిమా సంచలన విజయం సాధించే సరికి తెలుగు ఔత్సాహిక నిర్మాతలు దాన్ని అదే పేరుతో డబ్ చేశారు! ఇక విడుదలే తరువాయి అనుకొంటున్న తరుణంలో… రజనీకాంత్ హీరోగా ‘చంద్రముఖి’ సినిమా ప్రతిపాదన రావడం.. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా రజనీకి కీలకం కావడంతో ‘నాగవల్లి’కి ఇబ్బందులు మొదలయ్యాయి!
ఆ సినిమాను విడుదల కాకుండా ఒక బలమైన లాబీ అడ్డుపడింది. ఆ విధంగా ‘చంద్రముఖి’ సబ్జెక్ట్‌కు ద్వితీయ విఘ్నం ఎదురైంది. చివరగా మూడో డబ్బింగ్ వెర్షన్‌గా రజనీకాంత్ నటించిన సినిమాను తెలుగులోకి అనువదించి దిగ్విజయంగా విడుదల చేశారు. సినిమా సూపర్ హిట్ అయ్యింది. మలయాళ డబ్బింగ్ వెర్షన్ ఏమైందో తెలీదు కానీ.. కన్నడ నుంచి డబ్ అయిన వెర్షన్‌ను థియేటర్లలో గాక టీవీల్లో విడుదల చేశారు. ఆ సినిమాను తరచుగా ఒక ఛానల్ వారు ప్రసారం చేస్తూ ఉంటారు. ఆ వెర్షన్‌కు ఆ విధమైన మోక్షం అయినా లభించింది!
ఒకే సినిమా.. రెండు సార్లు డబ్బింగ్.. విడుదల మాత్రం లేదు!
సాధారణంగా కొన్ని డబ్బింగ్ సినిమాలు ఎప్పుడు విడుదలై వెళ్లిపోతాయో.. చాలా మందికి తెలియదు. జనాల ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండే థియేటర్లలో ఇలాంటి అనామక సినిమాలు విడుదలయ్యే అవకాశాలే ఉండవు. జిల్లా స్థాయిల్లో ప్రాభవం కోల్పోయిన…
Advertisement