సినిమా వాళ్లు ఉంటే చాలా బాగుంటాం.. లేకపోతే చాలా అధ్వాన్న స్థితిలో ఉంటాం… అని అంటాడు ప్రస్తుత మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్. సినిమా వాళ్ల ఆర్థిక స్థితిగతుల గురించి ఇలా ఒకే మాటతో వివరిస్తాడాయన. రాజేంద్రుడి మాట వందశాతం వాస్తవం అని అర్థమవుతుంది అనేక మంది సినీ హీరోల ఆర్థిక స్థితి గతుల గురించి గమనిస్తే. తెలుగు తెరపై తమకంటూ ప్రత్యేకతను సంతరించుకున్నా.. స్టార్‌లుగా గుర్తింపు పొందిన వారే.. చాలా సాధారణ జీవితం గడుపుతున్న వారు కొందరున్నారు. అపార్ట్ మెంట్లలోని ఫ్లాట్లలో నివసిస్తూ కాలం గడుపుతున్న వాళ్లున్నారు. మరి వారి స్టార్ డమ్‌కు ఏ డూప్లెక్స్ హౌస్‌లో.. కళ్లు చెదిరే ఇంద్రభవనాల్లాంటి బంగ్లాల్లో ఉండాల్సిన వాళ్లు.. అలా అపార్ట్ మెంట్లలో సాధారణ జీవితం గడుపుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొందరు జీవితాలు అంతే.. అనుకుని సరిపెట్టుకోవాలి.
తెలుగు వరకూ అలాంటి హీరోలు కొంతమంది ఉన్నారు. మరి మనోళ్లే కొంచెం బెటరు. తమిళంలో అయితే.. మరీ ఇన్ సాల్వమెంట్ పర్సన్ నోటీసులు ఇచ్చిన స్టార్ హీరోలు కూడా కొంతమంది ఉన్నారు! వ్యక్తిగత ప్రతిభతో ఒక వెలుగు వెలిగిన.. స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకున్న వాళ్లు అలాంటి పరిస్థితిని ఎదుర్కొనడం చాలా చిత్రమే. ఓడలు బళ్లు అయినట్టుగా తయారైంది వారి పరిస్థితి. అలాంటి స్థితిని ఎదుర్కొన్న ప్రముఖుల్లో భాగ్యరాజ్. కార్తిక్ వంటి స్టార్‌లు ఉండటం విశేషం.
తమిళ దర్శకుడు కమ్ హీరో భాగ్యరాజ్ గురించి వేరే పరిచయం చేయనక్కర్లేదు. తన సినిమాలతో యావత్ దేశ వ్యాప్తంగా గుర్తింపును కలిగి ఉన్న ప్రతిభావంతుడు భాగ్యరాజ్. తన మార్కు సినిమాలతో తనకంటూ ప్రత్యేక అభిమాన గణాన్ని కలిగిన భాగ్యరాజ్ ఒక దశలో ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొన్నారు. కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన ఫైనాన్షియల్ క్రైసిస్‌లో కూరుకుపోయి.. ఐపీ నోటీసు ఇవ్వడం వరకూ వెళ్లారు. మరి భాగ్యరాజ్ లాంటి స్టార్‌కు.. దశాబ్దాల కిందటే ఎన్నో విజయవంతమైన సినిమాలను రూపొందించి.. అప్పట్లోనే రికార్డు స్థాయి పారితోషకాలు పొందిన వ్యక్తికి అలాంటి పరిస్థితి ఏర్పడడం విధి వైచిత్రి అనే చెప్పాలి.
బాలీవుడ్‌లో అమితాబ్ వంటి వాళ్లే ఆర్థికంగా ఒక దశలో చితికిపోయారు.. భాగ్యరాజా ఏం గొప్ప అనుకొంటే ఏం చెప్పలేం కానీ, ఇలానే ఆర్థికంగా దెబ్బతిన్న మరో హీరో కార్తిక్, ‘సీతాకోక చిలుక’ ‘అన్వేషణ’ వంటి సినిమాలతో తెలుగు వారిలో శాశ్వత గుర్తింపును కలిగి ఉన్నాడు కార్తీక్. తమిళ ప్రసిద్ధ నటుడు ఆర్.ముత్తురామన్ తనయుడిగా సినిమాల్లోకి వచ్చిన కార్తీక్ వస్తూ వస్తూనే స్టార్ అయ్యాడు. క్లాసిక్స్ అనదగ్గ సినిమాల్లో హీరోగా నటించాడు. కేవలం తమిళంలోనే గాక తెలుగులో కూడా అడపాదడపా నటిస్టూ వచ్చాడు.
మణిరత్నం తీసిన ‘అగ్నినట్చత్రం’ వంటి సినిమాలు కార్తీక్‌ను మాస్ హీరోగా నిలబెడితే.. ‘మౌనరాగం’ వంటి సినిమాలతో కార్తీక్‌కు అమ్మాయిల్లో బీభత్సమైన ఫాలోయింగ్ పెరిగింది. మరి అలా ఒక వెలుగు వెలిగిన కార్తీక్… ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ ఏమంత బాగోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతాయి కోలీవుడ్ నుంచి. హీరోగా తనకున్న ఇమేజ్‌తో కోట్ల రూపాయలను సంపాదించిన కార్తీక్ .. విచ్చల విడిగా ఖర్చు చేశాడని ప్రత్యేకించి ప్లేబాయ్ తరహా లైఫ్ కోసం ఆయన హీరోయిన్లపై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని.. అందుకే ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడని ఆయనను బాగా ఎరిగిన వాళ్లు చెబుతుంటారు! హీరోగా ఉన్న గుర్తింపుతో రాజకీయాల్లోకి కూడా వచ్చిన కార్తీక్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం ఆయన ఫ్యాన్స్‌కు బాధను కలిగించే అంశమే.
హీరోలే కాదు.. ఆర్థిక ఇబ్బందులకు హీరోయిన్లూ మినహాయింపు కాదు. దక్షిణాదిలో ఒక దశలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన నిరోషా.. తన పతీ సమేతంగా ఐపీ నోటీసిచ్చింది కొంతకాలం క్రితం. ఈ మహాజనానికి మరదలు పిల్ల దక్షిణాదిలో ఒక దశలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. క్రేజీ గర్ల్‌గా నిలిచింది. ఎం.ఆర్. రాధా కూతురిగా సినిమాల వైపు వచ్చి.. తన సత్తా చాటిన నిరోషా తన సహనటుడు రాంకీనే వివాహం చేసుకుంది. అతడూ తెలుగు వారికి పరిచయం ఉన్న నటుడే. ‘సింధూరపువ్వు’, ‘ఒసేయ్ రాములమ్మ’ వంటి సినిమాల్లో రాంకీ ముఖ్య పాత్రలు పోషించాడు.
మరి ఈ దంపతులకు ఏమైందో కానీ.. కొన్నేళ్ల క్రితమే ఐపీ నోటీసులు ఇచ్చారు. ఒకవైపు నిరోషా వాళ్ల అక్క రాధిక.. కోలీవుడ్‌లో మంచి స్టార్ స్టేటస్, నిర్మాతగా సెటిలైన సమయంలో.. నిరోషా మాత్రం ఆర్థిక ఇబ్బందులతో వార్తల్లోకి వచ్చింది. ఆ ఆర్థిక ఇబ్బందుల తర్వాతనే నిరోషా కేరెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ తిరిగి కొత్త ఇన్నింగ్స్ ఆరంభించింది. ఈ మధ్య ఒకటీ అర తెలుగు సీరియల్స్‌లో కూడా నిరోషా నటిస్తోంది. మరి 80ల 90ల యువకుల పాలిట క్రేజీ గర్ల్‌గా నిలిచిన ఈ బ్లాక్ బ్యూటీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనడం ఆమె అభిమానులకు విషాదకరమైన అంశమే!
తమిళ స్టార్ హీరోహీరోయిన్ల ఆర్థిక ఇబ్బందులు ఇలా వార్తల్లోకి వచ్చాయి… బాలీవుడ్ వాళ్ల ధీనగాథలూ తెరపైకి వస్తాయి.. కానీ తెలుగు వాళ్లే వ్యవహారాలే చాలా గుంభనంగా ఉండిపోతాయి. కొందరు స్టార్ హీరోలు ఆర్థిక ఇబ్బందులతో వేసారిపోయినా వాళ్ల కథలు అంతగా బయటకు రావు. అలా రానీయకుండా చూసుకోవడం మనోళ్ల ప్రత్యేకత.