Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఒకే ఫార్ములా.. మళ్లీ మళ్లీ హిట్‌!

ఒకే ఫార్ములా.. మళ్లీ మళ్లీ హిట్‌!

ఏదైనా సినిమాకు మరో సినిమాతో కంప్యారిజన్‌ వస్తే ప్రేక్షకులు సహించరు. క్రిటిక్స్‌ అయితే కుమ్మేస్తారు. ఆ సినిమాకూ ఈ సినిమాకూ పోలికపెట్టి ఏకేస్తారు. కొత్తదనం ఏదీ అని కొశ్చన్‌ చేస్తారు. ఈ విషయంలో ఎవ్వరూ రాజీపడరు. కాపీకొట్టినా, అనుకోకుండా ఏదైనా రిపీట్‌ అయినా విమర్శలు తప్పవు. అయితే ఈ విమర్శలను పట్టించుకోకుండా కొందరు సినిమా జనాలు తమకు తోచింది చేస్తూ ఉంటారు. దీంతో విమర్శలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి అనుకరణలూ లేదా రిపిటేషన్లు ఆ సినిమాలకు చాలానష్టమే చేస్తూ ఉంటాయి.

అయితే తాము అనుకున్న కథకు అదే కథనమే దారి అని ఇది వరకూ పెద్ద సినిమాలు ఆ కాన్సెప్ట్‌తో వచ్చినా తామేం చేయలేకపోతుంటాం అని మూవీమేకర్లు కూడా తేల్చేస్తూ ఉంటారు. అయితే ఒక్కోసారి ఆ రిపీటెడ్‌ ఫార్ములా జనాలకు బాగా ఎక్కుతుంటుంది కూడా. ముందుగా విమర్శలు పాలైన కాన్సెప్టులు కొన్ని కొన్ని ఉన్నాయి. ఇటీవలే వచ్చిన భరత్‌ అనే నేను సినిమాలో హీరోహీరోయిన్ల రొమాన్స్‌ ఒకే ఒక్కడు సినిమాను బాగా గుర్తుచేసింది. హీరో ముఖ్యమంత్రి, హీరోయిన్‌ మిడిల్‌ క్లాస్‌ అమ్మాయి. వీళ్లిద్దరి మధ్యన ప్రేమ. రొమాన్స్‌ చేయించి జనాలను ఎంటర్‌ టైన్‌ చేయాలి.

అందుకోసమని హీరోకి బుర్ర మీసాలు పెట్టి మారు వేషం వేయించాడు ఒకేఒక్కడు దర్శకుడు శంకర్‌. అది కొత్తదనం అనిపించింది. దశాబ్దంన్నర పైనే అయ్యింది ఒకే ఒక్కడు వచ్చి.., అప్పటికి హీరో సీఎం కావడమూ కొత్తే, ఆ తరహా రొమాన్సూ కొత్తే. ఒకే ఒక్కడు సూపర్‌ హిట్‌. కల్ట్‌ హిట్‌. ఒక్కసారిగా భరత్‌ అనే నేనులో కూడా హీరోగారు మారువేషంలో అంటే మీసాలు పెట్టుకుని హీరోయిన్‌తో రొమాన్స్‌ చేస్తే జనాలు ఒక్కే ఒక్కడునే గుర్తు చేసుకున్నారు.

క్రిటిక్స్‌ సంగతి పక్కనపెట్టు.. కామన్‌ ఆడియన్సే థియేటర్లో ఈ సీన్లు వచ్చినప్పుడు ఒకే ఒక్కడును తలుచుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. భరత్‌ అనే నేను దర్శకుడు కొరటాల శివకు హీరోకి ఆ సీన్లో మారువేషం వేయించి పంపడం తప్ప మరోమార్గం లేకపోవచ్చు. అయితే ఒకే ఒక్కడు వంటి కల్ట్‌ హిట్‌లోని సీన్లను పేరడీ చేసినట్టే అయ్యింది పాపం. ఆ మధ్య 'కిక్‌' సినిమా విషయంలోనూ ఇదే విమర్శలే వచ్చాయి. దాదాపు పదేళ్ల కిందట వచ్చిన ఈ సినిమాలో హీరో రాబిన్‌హుడ్‌. ఈ రాబిన్‌హుడ్‌ కాన్సెప్ట్‌ సినిమాలో చరిత్రలో బోలెడు ఉన్నాయి.

దక్షిణాది ప్రేక్షకులకు అలాంటి వాటిల్లో బాగా ఆకట్టుకున్న సినిమా 'జెంటిల్మన్‌'. ఇది కూడా శంకర్‌ సినిమానే. జెంటిల్మన్‌కు ముందు తెలుగులో కూడా చిరంజీవి, బాలయ్యలు హీరోలుగా బోలెడన్ని రాబిన్‌హుడ్‌ కథాంశం సినిమాలు వచ్చాయి. అయితే శంకర్‌ స్టైల్‌ మేకింగ్‌తో జెంటిల్మన్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది. ఇదే సినిమాను హిందీలో చిరంజీవి రీమేక్‌ చేయాల్సి వచ్చింది. కిక్‌ సినిమాలో కూడా హీరో రాబిన్‌హుడ్డే. పెద్దలను దోచి పేదలకు పెడుతూ ఉంటాడు.

హీరో నేపథ్యం, ఇతర కథనమంతా వేరే అయినా 'కిక్‌' విడుదల అయిన తొలివారంలో 'జెంటిల్మన్‌'తో పోలికలు వచ్చాయి. అయితే రాబిన్‌హుడ్‌ కథ కాబట్టి.. ఎవరు ఎవరిని కాపీకొట్టారో చెప్పడంకష్టం. ట్రూ కాపీ వేరు, ఇలా కొంచెం కొంచెం, కొసరు కాపీలు వేరు. కార్బన్‌ కాపీ సినిమాలను ఇక్కడ ప్రస్తావించడం లేదసలు. అనుకోకుండా మ్యాచ్‌ అయిన కథాంశాలు ఇవి. ఈ కోవలోకే వస్తుంది 'రాజా రాణి' సినిమా కూడా. తమిళంలో సూపర్‌ హిట్‌ ఇది. తెలుగులోనూ అంతేస్థాయి హిట్‌. ప్రత్యేకించి యూత్‌ను బాగా రీచ్‌ అయిన సినిమా ఇది.

జనాలను బాగా ఆకట్టుకున్న ట్రాజెడీ, లవ్‌ ఫెయిల్యూర్‌ సినిమాల్లో రాజా రాణి ఒకటి అవుతుంది. లవ్‌ ట్రాజెడీ సినిమాలు జనాలకు అంత ఈజీగా ఎక్కువ. ఆ మధ్య 'మరోచరిత్ర' సినిమాను రీమేక్‌ చేస్తే అది నవ్వులపాలైంది. ఇక 'ఓయ్‌' వంటి సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల నడుము 'రాజా రాణి' వచ్చి హిట్‌ అయ్యింది. అయితే ఈ దశాబ్దానికి అయితే రాజా రాణి కానీ, ఇదే కథను ఏనాడో మణిరత్నం తీసిచూపించాడు. అదే 'మౌనరాగం'. మౌనరాగం సినిమా కథాంశం నుంచినే రాజా రాణి పుట్టిందని స్పష్టం అవుతుంది.

మౌనరాగం సినిమాలో హీరోయిన్‌ ముందుగా ఒక హీరోని ప్రేమిస్తుంది. అతడు అనుకోకుండా చనిపోతాడు. అతడితో పెళ్లి వరకూ వెళ్లిన హీరోయిన్‌ ఇంట్లో వాళ్లూ చూసిన మరో హీరోని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లి అయితే చేసుకుంది కానీ అతడితో కలవలేదు. అందుకే జరిగిందంతా చెప్పేస్తుంది. పెద్దమనసు కలిగిన హీరో ఆమె కోరినట్టుగానే విడాకులు ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఆమె గురించి ఎవ్వరికీ చెప్పకుండా తన మీదే నిందవేసుకుని ఆమెను పంపించడానికి సిద్ధం అవుతాడు. అయితే ఈ ప్రయత్నంలోనే వారిద్దరూ దగ్గరవుతారు.

మౌనరాగంలో మూడుపాత్రల మధ్యన నడిచే కథకు నాలుగో పాత్రను తగిలించి అట్లీ అనే దర్శకుడు 'రాజా రాణి'రూపొందించాడు. మౌనరాగంలో ఒక హీరో చనిపోతే, రాజారాణిలో కల్పించిన నాలుగో పాత్రను చంపేశాడు. విడాకుల వరకూ వెళ్లిన జంట క్లైమాక్స్‌లో రైల్వేస్టేషన్లో కలుస్తారు మౌనరాగం సినిమాలో. రాజారాణిలో క్లైమాక్స్‌ను ఎయిర్‌ పోర్టులో ప్లాన్‌ చేశారు. ఇలాంటి వేరేయేషన్లతో ఈ తరానికి తగ్గట్టుగా మౌనరాగం సినిమాను తిప్పి తీసి సూపర్‌ హిట్‌కొట్టడం అట్లీ ఘనతే అనుకోవాలి.

అయితే ఇది అందరికీ సాధ్యంఅయ్యే పనికాదు. ఆ మధ్య తెలుగులో వచ్చిన 'అందాల రాక్షసి'లో కూడా 'మౌనరాగం' వాసనలు కొడతాయి. మణిరత్నంను అతిగా అనుకరించబోయి తీసిన సినిమా ఇది. కొందరు సినిమా వాళ్లుదీన్నొక కళాఖండం అని ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చారు కానీ.. అందాల రాక్షసి సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తిప్పి తీయడానికి చాలా కసరత్తు చేయాలి లేకపోతే అంతే సంగతులు అనేందుకు అందాల రాక్షసి ఒక ఉదాహరణ.

ఇక ఇలా తిప్పి తీయడంలో బాగా విజయవంతం అయిన మరో సినిమా 'మన్మథ'. ఈ సినిమా కాన్సెప్ట్‌ అప్పట్లో థియేటర్లో కూర్చుని చూసిన ప్రేక్షకులను థ్రిల్‌ చేసింది. అసలు ఇలాంటి సినిమా ఒకదాన్ని చూస్తామని అప్పట్లో తెలుగు జనాలు ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. అందుకే ఈ డబ్బింగ్‌ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. అయితే కొన్నేళ్ల గ్యాప్‌తో అలాంటి కథాంశం వచ్చి జనాలను ఆకట్టుకుంది. అయితే వాస్తవానికి మన్మథ సినిమా కాన్సెప్ట్‌ అలనాటిది. కమల్‌ హాసన్‌ సూపర్‌హిట్‌ సినిమా 'ఎర్రగులాబీలు' రీమేకే మన్మథ.

పాత సారాను కొత్త సీసాలో పోసినట్టుగా, శాడిస్టిక్‌ ప్రేమికుడి కథను హీరో యాంగిల్‌లో కథానాన్ని మార్చి చూపించారు. మన్మథ మాస్‌ జనాలను కూడా బాగా ఎక్కేయగా, తమిళ రివ్యూయర్లు గగ్గోలుపెట్టారు. ఇది కమల్‌ పాత సినిమాకు కాపీ అని, అయితే శింబూ మాత్రం అది తమ సినిమాకు ప్రశంస అని చెప్పుకున్నాడు. ఆ సినిమాతో కంప్యారిజన్‌ గౌరవం అన్నాడు. తను కాపీ కొట్టిన కాన్సెప్ట్‌ను ఇలా సమర్థించుకున్నాడు ఈ హీరో.

కొత్తగా రాసుకునే సత్తా ఉంటే.. పాతసినిమా కథాకథనాల నుంచే సూపర్‌హిట్‌ కొట్టవచ్చని చాలామంది నిరూపించారు. తెలుగు సూపర్‌ హిట్స్‌లో అనేక సినిమాలు ఇలా తిప్పి తీసుకున్నవే. 'వర్షం' సినిమా కథా, కథనాలు 'టూ టౌన్‌ రౌడీ' సినిమాలోనేవే. దానికి మూలం 'తేజాబ్‌' సినిమా. హిందీ సినీ చరిత్రలో సంచలన సినిమా తేజాబ్‌. దాన్నే తెలుగులో వెంకటేష్‌ టూ టౌన్‌ రౌడీగా రీమేక్‌ చేశాడు. తెలుగులో అప్పట్లో ఫ్లాప్‌ అయ్యింది. కాస్త మార్చి వర్షం అని కొన్నేళ్ల తర్వాత తీస్తే సూపర్‌ హిట్‌ అయ్యిందే. అదే వర్షం సినిమాను ఇటీవలే హిందీలో రీమేక్‌ చేసుకున్నారు.

అలాగే 'మైనే ప్యార్‌ కియా'ను కాస్త మార్చి 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' అని తీస్తే అదిరిపోయే హిట్‌ అయ్యింది. ఇలా చెబుతూపోతే పాత నవల కాన్సెప్ట్‌తో సూపర్‌ హిట్‌ కొట్టొచ్చని 'మీనా' కథతో 'అ..ఆ' తీసి నిరూపించాడు త్రివిక్రమ్‌. కథను తయారు చేసుకోవడంలో కాపీకొట్టడం ఒక ప్రక్రియ అయితే, ఇలా పాతకథలకు కొత్త సుగంధాలు అద్దడం.. రెండో టెక్నిక్‌ అని ఇన్ని సూపర్‌హిట్‌ సినిమాలు వివరించి చెబుతున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?