ఒక్క పరాజయం..ఎంత డ్యామేజీ?

ఒక నటుడికి ఒక సినిమా పరాజయం అన్నది పెద్ద పాయింట్ కాదు..మళ్లీ మరో హిట్ కొడితే అంతా లెవెల్ అయిపోతుంది. కానీ అనేక విషయాల్లో కీలకంగా వుండే హీరో, ఆకాశమంత ఎత్తు ఫ్యాన్ ఫాలోయింగ్…

ఒక నటుడికి ఒక సినిమా పరాజయం అన్నది పెద్ద పాయింట్ కాదు..మళ్లీ మరో హిట్ కొడితే అంతా లెవెల్ అయిపోతుంది. కానీ అనేక విషయాల్లో కీలకంగా వుండే హీరో, ఆకాశమంత ఎత్తు ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించిన హీరో, పొలిటికల్ మైలేజ్ అందుకునే అవకాశం వున్న హీరో, పోటీ హీరోలతో పోల్చుకుని ఫ్యాన్స్ గిలగిల లాడిపోయే నేపథ్యంలో ఫ్లాప్ వచ్చిందంటే..అది చాలా డ్యామేజీకి దారి తీస్తుంది.

పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో జరిగింది అదే. పవన్ కళ్యాణ్ కేవలం ఓ హీరో కాదు..ఆయన అవునన్నా, కాదన్నా ఓ సామాజిక వర్గానికి ప్రతినిధిగా గుర్తింపు సాధించారు.

ఓ పొలిటికల్ పార్టీకి అండగా నిలిచి, 2019 నాటికి తనకంటూ ఓ లక్ష్యం సెట్ చేసుకున్నట్లు వదంతులు వున్నాయి..అలాగే తన చరిష్మాకు ఆధారమైన అభిమానులు తలెత్తుకునేలా చేయాల్సిన బాధ్యత వుంది. ఇన్నింటి నేపథ్యంలో సర్దార్ గబ్బర్ సింగ్ పరాజయాన్న అవకలోకిస్తే..

సామాజిక వర్గం

అవున్నన్నా..కాదన్నా, తనకు క్యాస్ట్ ఫీలింగ్ అంటగట్టవద్దని పవన్ చెప్పినా కూడా ఆయనను కాపు సామాజిక వర్గ ప్రతినిధిగా చూస్తున్నారన్నది వాస్తవం. ఈస్ట్, వెస్ట్, విశాఖ పల్లెల్లో కాపు సామాజిక వర్గం తమ గ్రామాల ఫంక్షన్లకు, తమ బర్త్ డేలకు కూడా పవన్ ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టడం అన్నది కామన్.

చంద్రబాబు లాంటి సీనియర్ నేత కూడా పవన్ కు అధ్భుతమైన గౌరవ మర్యాదలు అందించడానికి కారణం ఆయన సామాజిక వర్గ ఓటు బ్యాంక్ తప్ప వేరు కాదు. సర్దార్ సినిమా లో పదేపదే రాజులు అంటూ తెగ డైలాగులు వున్నాయి.

ప్రజల్లోంచి వచ్చిన వాడే రాజు..కాపు కాయడానికి పనికి వస్తాం కానీ, ప్రేమించడానికి పనికిరామా..అంటూ ఇవన్నీ క్షత్రియ సామాజిక వర్గాన్ని కాస్త తెలివిగా కార్నర్ చేసే ప్రయత్నమే. పొట్టి బ్రహ్మానందాన్ని రాజ్ పుఠ్ అంటూ చూపించి  సెటైర్ వేసారు. నిజానికి రాజపుత్రులు, క్షత్రియలు నూటికి తొంభై మంది మాంచి పర్సనాలిటీతో వుంటారు. ప్రభాస్ పర్సనాలిటీ తెలిసిందే. ఎక్కడో కామెడీ యాక్టర్ పద్మనాభం వంటి వారు మాత్రమే కనిపిస్తారు క్షత్రియుల్లో పొట్టిగా. ఇలా చేయడం అంటే కాస్త సెటైర్ వేయడమే.

వెస్ట్ గోదావరిలో కాపులకు, క్షత్రియులకు అస్సలు పొసగదు. అలాంటిది 2014 ఎన్నికల్లో జగన్ పై కోపంతో కావచ్చు..ఇతరత్రా కారణాల వల్ల కావచ్చు..ఈ రెండు వర్గాలు చేతులు కలిపాయి. దాంతో తెలుగుదేశం అఖండ విజయం సాధించింది. అందుకే ఆ వెంటనే బాబు తన కృతజ్ఞత అన్నట్లు అశొక్ గజపతి రాజును కేంద్ర మంత్రిని చేసారు.                                                                                         

బాహుబలి విజయం ఇప్పుడు వెస్ట్ లోనే కాదు, ఓవర్ సీస్ లో కూడా క్షత్రియులకు భలే బూస్ట్ ను ఇచ్చింది. పైగా నేషనల్ లెవెల్ లో ప్రభాస్ పెద్ద స్టార్ అయిపోయాడు. బాహుబలి రికార్డును ఇప్పట్లో కొట్టడం అన్నది అసాధ్యం. అది మళ్లీ ప్రభాస్ బాహుబలి 2 వల్లే జరగాలి.  సో ఈ విధంగా క్షత్రియ ఫ్యాన్స్ ఇప్పుడు కాలర్ ఎగరేసే పరిస్థితి. వెస్ట్ లో పవన్ అభిమానులకు, ప్రభాస్ అభిమానులకు మధ్య లుకలుకలు వున్నాయి. ఇప్పుడు ఈ సినిమా పరాజయం పవన్ అభిమానులకు కాస్త ఇబ్బంది కర పరిస్థితే. అలా ఎందుకు వుంటుంది అనేవారు గతంలో పవన్ అన్న మాటలను పరిశీలించండి..’

ఒక్క హిట్,..ఒక్క హిట్ కొట్టన్నా, వేరే అభిమానుల ముందు తలెత్తుకోలేకపోతున్నాం’  అనే అర్థం వచ్చేలా తన అభిమానులు కోరారని గతంలో ఆయనే చెప్పారు. మరి ఇఫ్పుడు మళ్లీ పవన్ ను అభిమానులు ఓ హిట్ కొట్టమని కోరాలన్నమాట.

ఆల్ ఇండియా స్టార్

సో, రికార్డుల సంగతి పక్కన పెట్టి పవన్ కూడా ఆల్ ఇండియా స్టార్ ను చేద్దామన్న ప్రయత్నం సర్దార్ గబ్బర్ సింగ్ తో జరిగినట్లు కనిపిస్తోంది. అందుకే పని గట్టుకు హిందీ వెర్షన్ భారీగా విడుదల చేసారని వందతులు వినిపిస్తున్నాయి. బాహుబలి మాదిరిగానే ముంబాయి జర్నలిస్టులకు ప్రత్యేకంగా షొ వేసి వారిని పాంపర్ చేసే ప్రయత్నాలు జరిగాయని కూడా వదంతులు వినిపిస్తున్నాయి. పైగా పవన్ తెలుగు మీడియా వంక కనీసం ఓరకంట అయినా చూడలేదు.

నాగ్, ప్రభాస్, మహేష్ ఎవరైనా కూడా సినిమా విడుదల ముందు తెలుగు మీడియాతో మాట్లాడతారు. పవన్ ఆ ప్రయత్నం చేయలేదు. పైగా బాలీవుడ్ మీడియాను ప్రత్యేకంగా రప్పించి మరీ ఇంటర్వూలు ఇచ్చారు. ఇక్కడి మీడియాకు ప్రకటనలు పడేస్తే చాల్లే అనుకున్నారు.

కానీ ఇప్పుడు సినిమా రిజల్ట్ వల్ల ఆ ప్రయత్నం పూర్తిగా అభాసయింది. పవన్ నేషనల్ స్టార్ కావడం మాట అలా వుంచి, అసలు ఇదేం సినిమా అన్న రేంజ్ లో సమీక్షలు వచ్చాయి. రామ్ చరణ్ అయినా తుపాన్ తో సిన్సియర్ ప్రయత్నం చేసారు. కానీ పవన్ సర్దార్ అంత సిన్సియర్ ప్రయత్నంగా అనిపించదు. అసలు ఈ సినిమా నార్త్ వాళ్లకి ఎలా నచ్చుతుందనుకున్నారో? రజనీ ఏం చేసినా తమిళం వాళ్లకి, సల్మాన్ ఏం చేసినా ఉత్తరాది జనాలకు, పవన్ ఏం చేసినా మన జనాలకు నచ్చుతుంది. అలా అని పవన్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లి అవే చేస్తానంటే లైక్ చేయరు.

పైగా ఇక్కడ పవన్ రెంటికి చెడ్డారు. హిందీ కోసం అన్నట్లుగా సినిమాలో అంత్యాక్షరి, మిగిలిన చోట్ల అల్లా హిందీ పాటలు విరివిగా వాడారు. నైజాం జనాలకు తప్ప మిగిలిన సీమాంధ్రులకు ఈ హిందీ గోల పట్టదని గమనించలేదు.

స్టార్ ఇమేజ్

రాష్ట్రంలో ఓట్ల వేటకు, సినిమా హీరోల ఇమేజ్ కు సంబంధం వుందన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు తమ చర్మిష్మాను వాడుకుని అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసిన వారే. చోట మోటా నటులు, నిర్మాతలు, దర్శకుల సంగతి చెప్పనక్కరలేదు. ఇద్దరు ఎన్టీఆర్ లను దూరం చేసుకున్న తెలుగుదేశం పార్టీ  బాలయ్య లాంటి మాస్ స్టార్ అండతో భరోసా గా వుంది. మొన్నటి ఎన్నికల్లో పవన్ అండగా నిలిచాడు. కానీ 2019 నాటికి అదే అండగా వంటాడో వుండడో తెలియదు. అందుకే మరింత మంది నటులు వుండాలని రోహిత్, తారకరత్న వంటి వాళ్లను ఎంకరేజ్ చేస్తోంది.

సర్దార్ సినిమా హిట్ అయితే పవన్ ఇమేజ్ మరింత పెరుగుతుందని తెలుగుదేశం వర్గీయులు లోలోపల అయినా మల్లగుల్లాలు పడ్డారన్నది వాస్తవం. తెలుగుదేశం పార్టీకి అండగా వున్న కమ్మ సామాజిక వర్గ జనాలు పైకి ఏం మాట్లాడిని, అంతర్గత సంభాషణల్లో ఈ సినిమా పట్ల నెగిటివ్ గానే మాట్లాడేవారన్నది వాస్తవం.  రికార్డుల మాట ఎలా వున్న సినిమా బ్లాక్ బస్టర్ అయితే పెరిగే ఇమేజ్ వేరు. పవన్ ఇమేజ్ మరీ పెరిగిపోయి, 2019 నాటికి ఎదురుగా నిల్చుంటాడేమో అన్న భయం తెలుగుదేశం పార్టీకి, దానికి అండగా వుండే సామాజిక వర్గానికి వుందన్నది వాస్తవం. ఇప్పుడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాకపోవడం ఆ జనాలకు కాస్త మానసిక ఆనందాన్ని ఇచ్చిందన్నది అంతకన్నా వాస్తవం.

తక్షణ కర్తవ్యం

అర్జెంట్ గా మరో సినిమా చేసి హిట్ కొట్టడం ఒక్కటే పవన్ తన వ్యతిరేకులకు చెప్పగలిగిన సమాధానం. తన ఇమేజ్ తో తను ప్రయోగాలు చేసుకోకుండా, బుద్దిగా..త్రివిక్రమ్, వినాయక్, బోయపాటి వంటి స్టామినా వున్న దర్శకులకు అన్నీ అప్పచెప్పి, వారు చేప్పినట్లు నటించి, తన వేలు కాళ్లు పెట్టకుండా వుంటే మంచి హిట్ లు రావడం మంచినీళ్ల ప్రాయం. అలా చేయడం ద్వారా పవన్ ఈ ఒక్క సినిమాతో వచ్చిన అన్ని రకాల డామేజీని దిగ్విజయంగా మళ్లీ రిపేర్ చేసేసుకోవచ్చు.