'ప్రేక్షకుల ఆలోచనల్లో మార్పులొచ్చేసినట్లే కన్పిస్తోంది.. ఇకపై నేను కూడా ముద్దుల నేపథ్యంలోనే సినిమాలు తీయాల్సి వస్తుందేమో..' అంటూ ప్రముఖ నిర్మాత 'దిల్'రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇవి సినిమాటిక్ కామెంట్లు అనుకోవాలా.? సెటైరికల్ కామెంట్లు అనుకోవాలా.? ఏమో, 'దిల్' రాజుకే తెలియాలి. 'హుషారు' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న ఓ సినిమా ఫంక్షన్లో 'దిల్'రాజు ఆన్ స్క్రీన్ ముద్దులపై ఘాటు కామెంట్స్ చేశాడు.
కుటుంబ కథా చిత్రాలు తీయడంలో 'దిల్' రాజు దిట్ట. ఈ విషయం అందరికీ తెల్సిందే. కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడంలోనూ దిల్ రాజు ఎప్పుడూ ముందుంటాడు. క్లీన్ సినిమాలు తీయడంలోనే కాదు, అప్పుడప్పుడూ ఘాటెక్కించే కమర్షియల్ ఎంటర్టైనర్స్ని తెరకెక్కించిన క్రెడిట్ కూడా దిల్ రాజుకి దక్కుతుంది. దిల్ రాజు రూపొందించిన సినిమాల్లో హీరోయిన్ల గ్లామర్ తక్కువేమీ కాదు.
అయితే, ఇప్పుడొస్తున్న 'హాట్ సినిమాల'తో 'దిల్'రాజు సినిమాల్ని పోల్చలేం. అలాగని, అంత ఘాటు కామెంట్లని సీనియర్ ప్రొడ్యూసర్ 'దిల్'రాజు చిన్న సినిమాలపై చేసేయడమేంటట.? ఇదే ఇప్పుడు చాలామందిని వేధిస్తోన్న ప్రశ్న.
'అర్జున్‌రెడ్డి', 'ఆర్ఎక్స్ 100'.. ఇలా చెప్పుకుంటూపోతే, ఈ మధ్య ఘాటైన ముద్దులతో చాలా సినిమాలే వచ్చాయి, వస్తూనే వున్నాయి. అన్ని సినిమాలూ హిట్టయిపోవట్లేదు.. హీరోయిన్ల గ్లామర్ అన్ని సినిమాలకూ అదనపు అడ్వాంటేజ్ అయిపోవడంలేదు. ఆ విషయం నిర్మాత దిల్ రాజుకీ తెలుసు.
కానీ, ఎందుకో 'దిల్' రాజు కొంచెం బ్యాలెన్స్ తప్పినట్లే కన్పిస్తోంది. ఇంతకీ, 'దిల్'రాజు నుంచి, 'రా లవ్ స్టోరీస్' రాబోతున్నాయా.? ఏమో, వస్తాయేమో వేచి చూడాల్సిందే.