నాన్నకు ప్రేమతో.. నేడే విడుదల!
డిక్టేటర్.. రేపే విడుదల!
సంక్రాంతికి సీజన్ ను సొమ్ము చేసుకోవడంలో పోటీ పడుతున్న ఈ రెండు సినిమాల గురించి గత కొన్ని రోజుల గురించిన హడావుడి గురించి వేరే వివరించనక్కర్లేదు. ఇన్ని రోజులూ అంతా ఒకటే అనుకున్న బాబాయ్ అబ్బాయిల మధ్య ఇప్పుడు తీవ్రమైన పోటీ జరుగుతోంది. ఈ సినీ రాజకీయంలోకి నారా లోకేష్ బాబు కూడా ఇన్ వాల్వ్ అయ్యాడనేడి.. డిస్ట్రిబ్యూటర్స్ ను బాలయ్య ప్రభావితం చేశాడన్న వార్తలు ఆది నుంచి వస్తున్నవే! అయితే తమ మధ్య ఎలాంటి పోటీ లేదని.. బాబాయ్, అబ్బాయిలు వివరణలు ఇచ్చారు..! ఈ సంగతులన్నీ అలా ఉంటే.. ఇప్పుడు గ్రౌండ్ లెవల్ కు వెళ్లి పరిశీలిస్తే.. కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు కనిపిస్తున్నాయి.
అబ్బాయిని పక్కనపెట్టేస్తున్నామని నందమూరి అభిమానులు మొదట్లోనే స్పష్టం చేశారు. బాబాయ్ తో పోటీ పడేంత సీన్ అబ్బాయికి లేదని వీరు తేల్చేశారు. తాము చెట్టునే నమ్ముతామని చెప్పేశారు. ఇక డిస్ట్రిబ్యూటర్లు.. థియేటర్ల ఓనర్లు..బాబాయ్ , అబ్బాయిల మధ్య పోటీలో రాజకీయ జోక్యాలు.. వీటన్నింటి నేపథ్యంలో.. 'నాన్నకు ప్రేమతో' విడుదల అయ్యింది. థియేటర్ల సంఖ్య విషయంలో భారీ స్థాయిలోనే ఈ సినిమా విడుదల అవుతున్నా… ఈ ముచ్చట అంతా కేవలం ఒక్కరోజుకు పరిమితం అవుతోంది చాలా చోట్ల.
బాబాయ్ సినిమా విడుదల అయ్యేంత వరకే అబ్బాయి సినిమాను ఆడించే ఒప్పందాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎలాంటి సినిమాకైనా కనీసం వారం రోజుల వ్యవధిని ఇచ్చే థియేటర్ల ఓనర్లు.. నాన్నకు ప్రేమతోకి మాత్రం చాలా చోట్ల కేవలం ఒక్కరోజు పరిమితిని విధించారు. తెలుగుదేశం నేతల ఒత్తిళ్లు… బాలయ్య అభిమానుల ఒత్తిడితో.. నాన్నకు ప్రేమతో ను రెండో రోజే థియేటర్ల నుంచి లేపేస్తున్నారు. తొలి రోజు సంఖ్య విషయంలో భారీ స్థాయిలోనే విడుదల అవుతున్న ఎన్టీఆర్ సినిమా రెండో రోజే చాలా చోట్ల థియేటర్ల నుంచి మాయం కానుంది. పద్నాలుగో తేదీన ఆయా థియేటర్లలో 'ఢిక్టేటర్' సినిమా ప్రదర్శితం కానుంది. మరి కేవలం ఒక్క రోజులో.. ఎన్టీఆర్ సినిమా సాధించుకునే వసూళ్లతోనే సంతృప్తి పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.