ఎమ్బీయస్‌: తమిళ రాజకీయాలు- 74

పిఎంకె (పాట్టాల్‌ మక్కళ్‌ కచ్చి -శ్రామికుల పార్టీ) స్థాపకుడు డా|| రామదాసు. వణ్నియార్‌ కులస్తుడు. ఉత్తర, దక్షిణ ఆర్కాట్‌ జిల్లాలలో వణ్నియార్లు అధిక సంఖ్యలో వున్నారు. వణ్నియార్‌ సంఘం పేరుతో 1980లో ఒక సంఘం…

పిఎంకె (పాట్టాల్‌ మక్కళ్‌ కచ్చి -శ్రామికుల పార్టీ) స్థాపకుడు డా|| రామదాసు. వణ్నియార్‌ కులస్తుడు. ఉత్తర, దక్షిణ ఆర్కాట్‌ జిల్లాలలో వణ్నియార్లు అధిక సంఖ్యలో వున్నారు. వణ్నియార్‌ సంఘం పేరుతో 1980లో ఒక సంఘం ఏర్పడి తమ జనాభాకు అనుగుణంగా బిసిలలో కోటా లేదని, తమ కోసం బిసిలలో సబ్‌-కోటా యివ్వాలని అడగసాగారు. 1960ల నుంచి వణ్నియార్లు డిఎంకె పార్టీకి మద్దతు యిస్తూ వచ్చారు. డిఎంకె కాని, ఎడిఎంకె కాని బిసిలలో వర్గీకరణ చేసి కోటాలు నిర్ధారించడానికి సిద్ధపడలేదు. ఆ సమయంలో డా|| రామదాసు రంగంలోకి దిగి వణ్నియార్‌ ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చాడు. 1987 సెప్టెంబరులో ఒక వారం పాటు తమ ప్రాబల్యం వున్న ప్రాంతంలో వాహనాలు తిరగకుండా చేస్తామని ప్రకటించి వేలాది చెట్లు కొట్టేసి రోడ్లకు అడ్డంగా  పడేశారు. చెట్లు నాటకపోగా పచ్చని చెట్లు కొట్టేసిన వృక్షహంతకులుగా వణ్నియార్లు అప్పటికి, ఎప్పటికి ముద్ర పడడానికి కారణం ఆనాటి ఆందోళనే. ఆ వారంలో వాళ్లు యథేచ్ఛగా చేసిన దోపిడీలు, పోలీసులతో కొట్లాటలు వారి ఉద్యమానికి మాయని మచ్చగా మిగిలాయి. అప్పటి ముఖ్యమంత్రి ఎమ్జీయార్‌ వారిని అదుపు చేయడానికి పోలీసుబలాల్ని ఉపయోగించాడు. వందలాది కార్యకర్తలను అరెస్టు చేయించాడు. వారి చర్యలను ఏ పార్టీ సమర్థించలేకపోయింది. వణ్నియార్‌ సంఘం బెదరలేదు. 1989 అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించింది. వారు పెద్ద సంఖ్యలో వున్న గ్రామాల్లో పెద్దపెద్ద బ్యానర్లు కట్టారు – 'వణ్నియారు ఓటు అన్యులకు కాదు', 'ఓట్లడగడానికి యిటు రాకండి' అని. అంతేకాదు ప్రచారనిమిత్తం యితర పార్టీలు కట్టిన బ్యానర్లు చించేశారు. ఓట్లు వేయడానికి ప్రయత్నించిన ఓటర్లను అడ్డుకున్నారు. 

దీని తర్వాత వణ్నియార్‌ సంఘం పిఎంకెగా అవతరించింది. పార్టీ ఏర్పరుస్తూ తను కాని, తన కుటుంబసభ్యులు కాని పార్టీ పదవులు ఆశించమని, పార్టీ వాహనాలు వాడమని, ఎన్నికలలో పోటీ చేయమని, తమ పార్టీ తొలి ముఖ్యమంత్రి హరిజనుడేనని ప్రతిజ్ఞ చేశాడు. తెరాస ఏర్పరుస్తూ కెసియార్‌ చేసిన ప్రతిజ్ఞల్లాటివే యివి. రామదాసు పార్టీ అధ్యక్షుడయ్యాడు, కొడుకు దరిమిలా కేంద్ర ఆరోగ్యమంత్రి అయ్యాడు. 1989 ఎన్నికలలో వణ్నియార్ల కారణంగా డిఎంకె ఓట్లు చెదిరాయి. దాంతో గెలిచాక డిఎంకె బిసిలలో ఎంబిసి (మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌ కాస్ట్‌)ల వర్గీకరణ చేసింది. కానీ వణ్నియార్లు అప్పటికే సొంతంగా రాజకీయశక్తిగా ఎదగడానికి నిశ్చయించుకున్నారు. 1989 లోకసభ ఎన్నికలలో నిలబడింది ఏ సీటూ గెలవలేదు. 1991 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో ఏ కూటమిలో చేరకుండా విడిగా నిలబడింది. రామదాసు ''తమిళనాడులో జయలలిత అనామకురాలిగా మారిపోతుంది. చూసుకోండి.  నేను మా పార్టీకి ఓటేయదలచినవారందరినీ తలా రెండు రూపాయలు పంపమన్నాను. రూ. 25 లక్షలు వచ్చాయి.  ఏప్రిల్‌ నెలాఖరుకి 50 లక్షల మంది మద్దతుదారులను, కోటి రూపాయలను సంపాదించి, 90 సీట్లు తెచ్చుకుంటాం చూడండి.'' అన్నాడు. 

డిఎంకె వాళ్లు కూడా జయలలితను తీసిపారేశారు – ''ప్రతిపక్ష నాయకురాలిగా చేయలేకపోయినామె ముఖ్యమంత్రి అయి పరిపాలించగలదా? ఇప్పటిదాకా మంత్రిగా కూడా చేయలేదు.'' అని. తనకు అనుభవం లేకపోయినా, ఎమ్జీయార్‌ వారసురాలిగా ఎమ్జీయార్‌ పథకాలను అమలు చేస్తానని జయలలిత వాగ్దానాలు చేయసాగింది. ఆమెకు ఆ ఎడ్వాంటేజి కూడా లేకుండా చేయడానికి ఎమ్జీయార్‌ తనకు గల పాత సాన్నిహిత్యాన్ని కరుణానిధి చాటుకోసాగారు. ఇద్దరూ కలిసి పని చేసిన సినిమా వర్కింగ్‌ స్టిల్స్‌తో పోస్టర్లు విడుదల చేశారు. జయలలిత పట్ల కరుణానిధి చిన్నచూపు ఏ మాత్రం తగ్గలేదు. అసెంబ్లీలో శోభన్‌బాబు ప్రస్తావన తెచ్చి రెచ్చిగొట్టినట్లే, యిప్పుడు ఆమెను రాజీవ్‌ గాంధీ 'పొలిటికల్‌ గర్ల్‌ఫ్రెండ్‌' అని వర్ణించాడు. దాంతో ఎడిఎంకె మహిళా సంఘాలు అతనిపై విరుచుకుపడ్డారు. దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. రుణానిధి ఒకే సమయంలో యిద్దరు భార్యలు కలిగి వుండడం గురించి రచ్చ చేశారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు రెండూ ఒకేసారి జరిగినప్పుడు కాంగ్రెసుతో పొత్తు పెట్టుకున్న పార్టీ అప్పటిదాకా గెలుస్తూ వస్తోందన్న సంగతి డిఎంకెకు చింత కలిగించింది. ప్రాంతీయ పార్టీలతో కలిసి ఏర్పడిన నేషనల్‌ ఫ్రంట్‌ జాతీయ పార్టీయే అయినా నార్త్‌ ఇండియా పార్టీగా తోస్తోంది. అందుకే డిఎంకె ఆదుర్దా. తమ ప్రభుత్వాన్ని అన్యాయంగా రద్దు చేశారని రచ్చ చేసి సానుభూతి సంపాదించబోయింది. కానీ డిఎంకె ఎల్‌టిటిఇకి మద్దతిస్తోందన్నది బహిరంగరహస్యం. తమిళనాడు ప్రజలందరికీ తెలుసు. ఐపికెఎఫ్‌ పట్ల తమిళ ప్రజల్లో విముఖత వుందని, అందువలన ఐపికెఎఫ్‌ను పంపిన రాజీవ్‌ గాంధీ అంటే తమిళులు అసహ్యించుకుంటారని కరుణానిధి అనుకున్నాడు. కానీ ఒక పత్రిక నిర్వహించిన సర్వేలో దేశంలో తక్కిన ప్రజల్లాగే తమిళుల్లో అధికశాతం మంది ఐపికెఎఫ్‌ చర్యలకు ఆమోదం తెలుపుతున్నారని తేలింది.

కరుణానిధి తరఫున విపి సింగ్‌, యితర నేషనల్‌ ఫ్రంట్‌ నాయకులు ప్రచారం చేయగా దానికి ప్రతిగా రాజీవ్‌, జయలలిత ప్రచారం చేయసాగారు. ఎన్నికల ప్రచారానికై వచ్చిన రాజీవ్‌ గాంధీని మే 21 న ఎల్‌టిటిఇ హత్య చేసింది. 1991 ఫిబ్రవరిలో బర్నాలాను మార్చి భీష్మ నారాయణ్‌ సింగ్‌ను గవర్నరుగా నియమించింది కేంద్రప్రభుత్వం. అందువలన రాజీవ్‌ హత్య జరగనిచ్చిన పోలీసు వైఫల్యం గవర్నరు నెత్తిమీదకే రావాలి. కానీ అప్పటిదాకా నడిచినది డిఎంకె ప్రభుత్వం కాబట్టి, డిఎంకెకు, టైగర్లకు వున్న బంధం అందరికీ తెలుసు కాబట్టి రాజీవ్‌ హత్యపై ప్రజాగ్రహం డిఎంకెపై పడింది. దానికి తోడు సాధారణంగా తెల్లవారుఝాము దాకా నడిచే డిఎంకె సమావేశాలు ఆ రోజు అర్ధరాత్రికి ముందే ముగిసిపోవడం అందరికీ సందేహం కలిగించింది. రాజీవ్‌ హత్య గురించి డిఎంకెకు ముందస్తు సమాచారం వుందని అర్థమైంది. అంతే డిఎంకె ఆఫీసులపై దాడి జరిగి దగ్ధం చేశారు. ఈ విషయాలన్నీ 'రాజీవ్‌ హత్య' సీరీస్‌లో విపులంగా రాశాను. రాజీవ్‌ హత్య తమ నేలపై జరగడం తమిళులను విపరీతంగా బాధించింది. శరణార్థులుగా వచ్చారు పోనీ కదాని ఆశ్రయం యిస్తే మన దేశపు మాజీ ప్రధానినే చంపేటంత ధైర్యమా? అని మండిపడ్డారు.  డిఎంకె టైగర్లకు ఎంత మద్దతిచ్చిందో అన్నీ బయటకు రాసాగాయి. 1990లో పద్మనాభను, అతని అనుచరులను హత్య చేసి పారిపోతూ పట్టుబడిన టైగర్లు ముఖ్యమంత్రి కరుణానిధితో డైరక్టుగా మాట్లాడించకపోతే సైనైడ్‌ మింగుతామని బెదిరించారు. తర్వాత డిఎంకె మంత్రుల సిబ్బంది వాళ్లకు బెయిల్‌ ఏర్పాటు చేసి విడిపించారు. వాళ్లు పారిపోయారు. నేవీ చీఫ్‌ ఎడ్మిరల్‌ రాందాస్‌ తంజావూరు తీరంలో నేవీ పట్టుకున్న వందమంది టైగర్లను  రుణానిధి ప్రభుత్వం ఒత్తిడి చేసి విడిపించిందని బయటపెట్టారు. డిఎంకె నాయకుడు వైగో గాయపడిన టైగర్లను తిరుచ్చి తంజావూరు నర్శింగ్‌ హోముల్లో చికిత్స చేయిస్తున్న సంగతీ బయటకు వచ్చింది. ఇదేమిటి అని అడిగితే వైగో జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధఖైదీలను రక్షించవలసిన బాధ్యత అంటూ సందర్భం లేకుండా మాట్లాడాడు. ఇవన్నీ చూసి, జూన్‌ 24 నాటి ఎన్నికలో తమిళ ఓటర్లు టైగర్లపై కసిని డిఎంకెపై, దాని భాగస్వాములపై చూపించారు, ఎడిఎంకె, కాంగ్రెసు కూటమికి ఓట్ల వర్షం కురిపించారు. 

పార్లమెంటు సీట్లలో కాంగ్రెసుకు 28, ఎడిఎంకెకు 11 వచ్చాయి. 65% ఓట్లు వచ్చాయి. డిఎంకె కూటమికి ఒక్కటి కూడా రాలేదు. 28% ఓట్లు వచ్చాయి. ఎసెంబ్లీ ఎన్నికలలో ఎడిఎంకె కూటమికి 60% ఓట్లు, 225 సీట్లు వచ్చాయి. ఎడిఎంకెకు 164 కాంగ్రెసుకు 60, ఐసియస్‌కు 1 వచ్చాయి. డిఎంకె రెండే రెండు స్థానాల్లో గెలిచింది. వాటిలో కరుణానిధి ఓడిపోబోయి గెలిచాడు. గెలవగానే రాజీనామా చేశాడు. టిఎంకెకు 2, సిపిఎంకు 1, జనతాదళ్‌కు 1, సిపిఐకు 1,  ఇతరులకు 2,  ఇండిపెండెంటు 1 గెలిచారు. పిఎంకె తరఫున పన్‌రూటి రామచంద్రన్‌ గెలిచాడు. ఈ అఖండ విజయం కేంద్రంలో పివి నరసింహరావు నేతృత్వంలో కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడడానికి ఎంతగానో దోహదపడింది. ఇక రాష్ట్రంలో మంత్రిగా కూడా చేయని జయలలిత ఒక్కసారిగా ముఖ్యమంత్రి అయిపోయింది. అదీ అడ్డూ, అదుపూ లేని మెజారిటీతో!  (సశేషం) ఫోటో – ఎన్నికల సభలో జయలలిత, రాజీవ్‌ గాంధీ

 – ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2015)

[email protected]

Click Here For Archives