రాజమౌళి మల్టీస్టారర్ కోసం ఇద్దరు స్టార్ హీరోలు దాదాపు రెండేళ్లు లాక్ అయిపోతారనే సరికి, అదే సమయంలో పవన్‌కళ్యాణ్ సినిమాలు వీడి రాజకీయాల్లోకి వెళ్లిపోయేసరికి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లకి హీరోలు దొరకడం లేదు. ప్రభాస్ ముందే ఫిక్స్ చేసుకున్న ప్రాజెక్టులతో రెండేళ్లు బిజీగా వుండడంతో మిగిలిన ముగ్గురు హీరోల కోసమే ప్రయత్నించాల్సిన పరిస్థితి.
మరోవైపు మహేష్ తన తదుపరి చిత్రాన్ని ముందే ఫిక్స్ చేసి పెట్టుకున్నాడు. అల్లు అర్జున్ ఇంకా ఏ సినిమా చేయాలనేది నిర్ణయించుకోలేదు. దీంతో స్టార్ హీరోల డేట్స్ దొరక్క చాలా మంది డైరెక్టర్లు ఇరకాటంలో పడిపోయారు. మరి హీరోలంతా ఖాళీ అయ్యేవరకు ఎదురు చూస్తారో లేక ద్వితీయ శ్రేణిలో టాప్‌లో వున్న వారితో చేయడానికి ముందుకొస్తారో చూడాలి.
హీరోలంతా బిజీ అయిపోవడంతో అగ్ర నిర్మాతలకి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొందరు హీరోలకి ఎప్పుడో అడ్వాన్సులు ఇచ్చినా కానీ మరో రెండు, మూడేళ్ల వరకు డేట్లు దొరకవంటే అడ్వాన్సులు వెనక్కి తీసుకోవాలో, లేక వాళ్లు డేట్స్ ఇచ్చే వరకు వేచి చూడాలో తెలియడం లేదట. మొత్తానికి ఒక్క మల్టీస్టారర్‌తో ఇద్దరు హీరోలు లాక్ అవడం, ఒక హీరో సినిమాలకి దూరంగా వుండడం టాలీవుడ్ టాప్ లీగ్ బిజినెస్‌కి గండి కొడుతోంది.