ఇవాళ్టితో జియో ప్రైమ్ మెంబర్ షిప్ గడువు ముగుస్తుంది. కేవలం 99రూపాయల ప్రైమ్ మెంబర్ షిప్ కే ఇన్నాళ్లూ అన్-లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్ అందించింది జియో. ఈ ఏడాది ఈ సంస్థ లాభాల్లోకి కూడా వచ్చేసింది. సో.. ఇక ప్రైమ్ సౌలభ్యాలు ఉండవని, మెంబర్ షిప్ చార్జీలు పెరిగే అవకాశం ఉందంటూ కథనాలు వచ్చాయి. కానీ జియో మాత్రం మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది.
తమ వినియోగదారులు మరో ఏడాది పాటు ఉచితంగా అన్ని ప్రైమ్ సేవలు పొందవచ్చని ప్రకటించింది జియో. గతేడాది ప్రైమ్ మెంబర్ షిప్ కోసం 99రూపాయలు కట్టిన కస్టమర్లు అందరికీ ఈ సేవల్ని మరో ఏడాది పాటు, అంటే 2019మార్చి వరకు ఉచితంగా అందించబోతున్నట్టు తెలిపింది. చార్జీలు పెంచడం మాట అటుంచి, ఈ ఏడాది కట్టాల్సిన 99రూపాయల చార్జీని కూడా మాఫీ చేసిందన్నమాట.
99రూపాయలు చెల్లించడం ద్వారా జియోకు సంబంధించిన అన్ని సేవల్ని ఉచితంగా పొందవచ్చు. జియో టీవీ, జియో మూవీస్, జియో మ్యూజిక్, జియో చాట్, జియో న్యూస్ పేపర్, జియో ఎక్స్ ప్రెస్ న్యూస్.. ఇలా ఎన్నో యాప్స్ ను ఉచితంగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడీ ఫ్రీ-సర్వీస్ ను మరో ఏడాది పొడిగించింది జియో. ఇక ప్రీ-పెయిడ్ రీచార్జీల్లో భాగంగా ఇప్పటికే డేటా పరిమితిని 40శాతం పెంచిన విషయం తెలిసిందే.
తాజా నిర్ణయంతో ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ పై మరింత ఒత్తిడి పెరిగింది. జియో ప్రైమ్ చార్జీలు పెరుగుతాయని ఆ సంస్థలు భావించాయి. కానీ ఉన్న చార్జీల్ని కూడా ఎత్తివేయడంతో ఆ కంపెనీలన్నీ ఇరకాటంలో పడ్డాయి. మరోవైపు నెట్ వర్క్ సమస్యలు వల్ల చాలామంది వినియోగదారులు జియో నుంచి మళ్లీ ఎయిర్ టెల్ కు వెళ్లిపోతున్నారన్న వార్తల్ని జియో ఖండించింది. తమ వినియోగదారులు 160మిలియన్ నుంచి 175మిలియన్ కు చేరారని ప్రకటించింది.