రంగస్థలం సినిమా ఎప్పుడు శ్రీకారం చుట్టారు? 2016లో కథ చెప్పాడు సుకుమార్. అదే ఏడాది చివరలో ప్లానింగ్ మొదలు పెట్టారు. 2017సమ్మర్ అని టార్గెట్ పెట్టుకున్నారు. కాదు కాదు, దసరా అనుకున్నారు. కుదరదు 2018సంక్రాంతికి ఎలాగైనా రావాల్సిందే అనుకున్నారు. కానీ అజ్ఞాతవాసి అడ్డం పడింది. సరే, సమ్మర్ కే అని మళ్లీ డేట్ మార్చారు.
చిత్రమేమిటంటే ఇలా డేట్ మారినపుడల్లా, ఇంకా సినిమాను చెక్కుతూనే వున్నారు దర్శకుడు సుకుమార్. సినిమా ఆరంభంలో ఒకటికి రెండు మూడు సార్లు ఈస్ట్ గోదావరి వెళ్లాల్సి వచ్చింది. చరణ్, సుకుమార్ పనులతో ఎన్ని షూటింగ్ డేస్ క్యాన్సిల్ అయ్యాయన్నది యూనిట్ కు తెలుసు. దాదాపు 48రోజులు క్యాన్సిల్ అయ్యాయని అనధికార బోగట్టా. అంటే ఎంత వృధా. ఆరంభంలో ఓ ఆర్ట్ డైరక్టర్ ను అనుకున్నారు. కానీ సినిమాకు ఓ కీలక టెక్నీషియన్ వచ్చి చేరిన తరువాత ఆ ఆర్ట్ డైరక్టర్ ఎంపికపై రాజకీయాలు నడిచాయని వినికిడి. దాంతో రామకృష్ణ వచ్చి చేరారు.
ఆరంభంలో ఊరికి ఊరు సెట్ వేద్దాం అనుకున్నారు. చాలా డిజైన్లు చూసారు. కాదు, నాచురల్ లోకేషన్లకే వెళదాం అని సుకుమార్ పట్టు. అలాగే అని ఈస్ట్ గోదావరి వెళ్లారు. కానీ జనం తాకిడి, ఉత్సాహం, వాతావరణం అన్నీ చూసాక అంత ఈజీగా అయ్యేది కాదు అనుకున్నారు. ఆర్ ఎఫ్ సిలో సెట్ వేద్దాం అనుకున్నారు.
ఆఖరికి జూబ్లీ హిల్స్ లోపల కొండల మీద సెట్ వేసారు. విలేజ్ సెట్ రీ ప్రొడ్యూస్ అన్న మాటే కానీ, మరీ ఎక్కువగా వేయలేకపోవడం ఒక సమస్య. ఏరియల్ వ్యూ చూపించలేకపోవడం మరో సమస్య. ఎందుకంటే పక్కన అంతా భారీ భవంతులే. పైగా అదే ప్లేస్ లో అదే టైమ్ లో మరో ఒకటి రెండు సినిమాల షూటింగ్ లు.
ఇలా ఆలస్యం అనివార్యం అయింది. పెట్టుబడి పెరిగింది. వడ్డీలు పెరిగాయి. కానీ వచ్చి, వచ్చి సరైన టైమ్ లో పడింది. ఎలా? జనవరి నుంచి సరైన సినిమా పడలేదు. భాగమతి తరువాత, ఛలో, తొలిప్రేమ లాంటి మీడియం హిట్ సినిమాలు తప్ప, పెద్ద సినిమాలు, పెద్ద హిట్ లు లేవు. సమ్మర్ కు బోణీ కొట్టిన కిర్రాక్ పార్టీ కూడా పెద్దగా ఫలితం ఇవ్వలేదు.. సరీగ్గా, ఇంటర్, టెన్త్ పరీక్షలు పూర్తయ్యాయి. సమ్మర్ స్టార్ట్ అయింది. జనాలు సినిమా ఆకలి మీద వున్నారు. అలాంటి టైమ్ లో వచ్చింది రంగస్థలం.
ఇదిలావుంటే రామ్ చరణ్ మీద ఫ్యాన్స్ ను పక్కన పెడితే మిగిలిన జనాలకు పెద్దగా హోప్స్ లేవు. గెటప్ ఓకె కానీ, బాగా చేయగలడని అనుకోలేదు. కానీ రంగస్థలంలో అదే సర్ప్రయిజ్ ప్యాకేజ్ అయింది. సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు రామ్ చరణ్ సూపర్ అనిపించేసుకున్నాడు. ఇప్పటి దాకా సుకుమార్ సినిమాలకు సుకుమార్ కే పేరు వచ్చింది. అది వాస్తవం. ఫస్ట్ టైమ్ సుకుమార్ సినిమాకు హీరోకు పేరు వచ్చింది.
దీంతో ఇప్పుడు రంగస్థలం కలెక్షన్లు విరగదీస్తున్నాయి. ఇంకా చిత్రం ఏమిటంటే, రంగస్థలం సినిమాను అమ్మడానికి నిర్మాతలు కాస్త ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఆంధ్రను 35కోట్ల రేషియోలో అమ్ముదాం అనుకుంటే వారి వల్ల కాలేదు. ఆఖరికి 30నుంచి 32కోట్ల రేషియోలో అమ్మారు. అక్కడ కూడా వేరే లోపాయికారీ ఒప్పందాలు వున్నాయి తప్ప, అవుట్ రేట్ కాదు. సినిమా విడుదలయ్యే సరికి నిర్మాతల మీద 16కోట్ల పరోక్ష రిస్క్ వుందని చాలా కొద్ది మందికి మాత్రం తెలుసు.
ఇలా అన్నివిధాలా అడ్డంకులు వచ్చినా, నిర్మాతలు మాత్రం చాలా ధైర్యంగా వున్నారు. సుకుమార్ ను నమ్మారు. అతను చెప్పిన సబ్జెక్ట్ ను నమ్మారు. తీసి చూపించిన రష్ కాపీని నమ్మారు. ఎంతలా నమ్మారు అంటే మళ్లీ సుకుమార్ తమతోనే సినిమా చేయాలని మాట తీసుకునేంత. ఇప్పుడు ఆ నమ్మకం, కష్టం ఫలించింది.