పాపం పూజాహెగ్దే బలైపోయింది.!

సోషల్‌ మీడియాలో కొత్త ట్రెండ్‌ నడుస్తోంది. మహేష్‌బాబు అభిమానులు తమ అభిమాన హీరోని ఎవరైనా సరే 'సర్‌' అని సంబోదించాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. పాపం, పూజాహెగ్దే బలైపోయిందిప్పుడు. మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా మా 'రుషి'కి…

సోషల్‌ మీడియాలో కొత్త ట్రెండ్‌ నడుస్తోంది. మహేష్‌బాబు అభిమానులు తమ అభిమాన హీరోని ఎవరైనా సరే 'సర్‌' అని సంబోదించాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. పాపం, పూజాహెగ్దే బలైపోయిందిప్పుడు. మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా మా 'రుషి'కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. అని పూజాహెగ్దే సోషల్‌ మీడియాలో విషెస్‌ అందించడమే ఆమె చేసిన నేరం. 

మహేష్‌ కొత్త సినిమా 'మహర్షి' ఫస్ట్‌ లుక్‌ విడుదలయ్యింది. ఆ లుక్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ, అందులో 'రుషి' పాత్రధారి అయిన మహేష్‌కి శుభాకాంక్షలు తెలిపింది పూజాహెగ్దే. ఈ క్రమంలో 'మహేష్‌ సర్‌' అని పూజాహెగ్దే సంబోదించలేదని మహేష్‌ అభిమానులు కారాలూ మిరియాలూ నూరేస్తున్నారు సోషల్‌ మీడియాలో. అంతేనా, 'హ్యాపీబర్త్‌డే టు మహేష్‌' అనే ట్యాగ్‌లైన్‌ జోడించలేదనీ గుస్సా అయ్యారు. 

కొద్ది రోజుల క్రితమే 'గూఢచారి' సినిమా బావుందని మహేష్‌ సోషల్‌ మీడియాలో స్పందిస్తే, సింపుల్‌గా 'థ్యాంక్స్‌' చెప్పిందని 'గూఢచారి' ఫేం తెలుగమ్మాయ్‌ శోభిత ధూళిపాళ్ళపై బూతుల దండకం అందుకున్నారు మహేష్‌ అభిమానులు. 'సర్‌' అనడం నేర్చుకోమని క్లాస్‌ తీసేసుకున్నారు. నిన్న మొన్నటిదాకా పవన్‌కళ్యాణ్‌ అభిమానుల పైత్యం సోషల్‌ మీడియాలో చూశాం. ఇప్పుడు మహేష్‌ అభిమానులు ఆ 'అభిమాన పైత్యాన్ని' పరాకాష్టకి తీసుకెళ్ళిపోతున్నారు. 

స్వర్గీయ ఎన్టీఆర్‌ని 'ఎన్టీవోడు' అనేవారు. మెగాస్టార్‌ చిరంజీవి అయితే, 'నన్ను చిరు అని పిలిస్తేనే నాకు ఎక్కువ ఇష్టం..' అని చెబుతుంటారు. ప్రభాస్‌ని ఎవరన్నా 'డార్లింగ్‌' అని పిలిస్తే తెగ హ్యాపీ ఫీలయిపోతాడు. 'గారు, సర్‌..' అని ఆయా సినీ ప్రముఖుల్ని సంబోధించాలా.? వద్దా.? అన్నది ఆయా వ్యక్తుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి వుంటుంది. ఈ అభిమానుల గోలేంటోగానీ.. ఇదంతా 'భరత్‌ అనే నేను' సినిమా తెచ్చిన మార్పు.. అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అందులో మహేష్‌ ముఖ్యమంత్రిగా నటించాడు కదా.. రియల్‌ లైఫ్‌ ముఖ్యమంత్రి మహేష్‌ అన్న భ్రమలో మహేష్‌ అభిమానులు వున్నారేమో.!