cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

టాలీవుడ్ కు టెన్షన్.. టెన్షన్

టాలీవుడ్ కు టెన్షన్.. టెన్షన్

ఇన్నేళ్ల అనుభవం తరువాత కూడా టాలీవుడ్ కు టెన్షన్ తప్పడంలేదు. జనం ఏ సినిమాను ఆదరిస్తారు? ఏ సినిమాను ఆదరించరు? అన్నది ఓ టెన్షన్. అసలు సినిమాకు ఓపెనింగ్స్ రావాలంటే ఏం చేయాలి? ఇది మరో టెన్షన్. భయంకరమైన బజ్ వచ్చేసింది, పబ్లిసిటీ కుమ్మేసారు అనుకున్న సినిమాకు ఓపెనింగ్స్ రాకుండా పోయిన సంఘటనలు చూస్తుంటే టాలీవుడ్ జనాలకు టెన్షన్ తప్పడంలేదు.

సినిమా ఆడడం, ఆడకపోవడం అన్నది దాని క్వాలిటీ మీద ఆధారపడి వుంటుంది. కానీ ఓపెనింగ్స్ అన్నది బ్యానర్, కాంబినేషన్, పబ్లిసిటీ మీద కాస్త ఆధారపడుతుంది. ఓపెనింగ్స్ తరువాత సినిమా కలెక్షన్లు నిలబడడం అన్నది క్వాలిటీ పైనే వుంటుంది. అయితే ఓపెనింగ్స్ కూడా రాకపోతుంటే టాలీవుడ్ జనాలు కిందామీదా అవుతున్నారు. అసలు ఏం జరుగుతోంది. థియేటర్ కు జనాలు ఎందుకు వస్తున్నట్లు? కొన్నింటికి ఎందుకు రానట్లు? చిన్న సినిమాల సంగతి అలా వుంచితే బ్యానర్ వాల్యూ, హీరో కాంబినేషన్ వున్నా కూడా రాకపోతే ఏమనుకోవాలి?

ఇలాంటి ఆలోచనలే రాబోయే సినిమాల నిర్మాతలను, దర్శకులను కలవరపెడుతున్నాయి. గూఢచారి సినిమా కన్నా చిలసౌ సినిమాకు ప్రచారం ఎక్కువ జరిగింది. గూఢచారి సినిమాతో సమానంగా చిలసౌ సోషల్ నెట్ వర్క్ లో హడావుడి చేసింది. కానీ బయట పబ్లిసిటీ చిలసౌకి కాస్త ఎక్కువ జరిగింది. చిలసౌకి మంచి టాక్ నే వచ్చింది. కానీ ఓపెనింగ్స్ లేవు. కలెక్షన్లు నిలబడలేదు.

హ్యాపీ వెడ్డింగ్ సినిమా ఆంధ్ర అంతా కాలేజీల్లో హీరో హీరోయిన్లు చేసిన హడావుడి ఇంతాఅంతా కాదు. కానీ ఓపెనింగ్స్ చూస్తే తేడా. ఈవారం విడుదల అయిన శ్రీనివాస కళ్యాణం. పబ్లిసిటీలో ఎక్కడా లోటులేదు. బజ్ కు ఎక్కడా తక్కువలేదు. సినిమాను మూడురోజులు ముందే బయ్యర్లకు ప్రదర్శించారు. వన్ పర్సంట్ నెగిటివ్ టాక్ లేదు. కానీ ఓపెనింగ్స్ చూస్తే నిరాశ.

మెగా హీరోల విజేత, తేజ్ ఐలవ్ యూ సినిమాలకు చేసిన హడావుడి ఇంతాఅంతా కాదు. కానీ ఓపెనింగ్స్ చూస్తే డొల్ల. అక్కడ బయటపడిపోతోంది అసలు సంగతి అంతా. ఓపెనింగ్స్ నే అలా వుంటే, సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే, మొత్తం వాష్ అవుట్ అవుతోంది. కనీసం ఓపెనింగ్స్ కుమ్మేస్తే, ఫస్ట్ వీకెండ్ లో కాస్త రికవరీ చాన్స్ వుంటుంది. అయితే కొన్ని సినిమాలకు ఎంత ప్రచారం చేసి, బజ్ వచ్చినా అది వుండడంలేదు. ఎందుకో అన్నది సినిమా జనాలు జుట్టు పీక్కున్నా అర్థంకావడం లేదు.

ఎందుకిలా?
సినిమా ప్రచారం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. సోషల్ నెట్ వర్క్ ను ఎక్కువగా నమ్ముకుంటున్నారు. దాని ప్రభావం వుంది. కాదనడానికి లేదు. కానీ దాన్ని నమ్ముకుని సాంప్రదాయ పబ్లిసిటీ పద్దతులను వదిలేస్తున్నారు. పైగా సోషల్ నెట్ వర్క్ పబ్లిసిటీ అంతా జెన్యూన్ కాదు. ఫేక్ అక్కౌంట్లు, ఫేక్ హిట్ లు, వేలు ఖర్చు పెడితే మిలియన్ల క్లిక్ లు, పైగా ట్విట్టర్ లో భజన బృందాలు. ఇవన్నీ చూసుకుని సినిమాకు బజ్ వచ్చేసింది అనుకుంటున్నారు. కానీ తీరాచూస్తే సినిమా హడావుడి కిందకు చేరడంలేదు.

ట్రయిలర్, టీజర్ ఎలా వున్నాయి అన్న వాటిపై జెన్యూన్ రిపోర్ట్ మేకర్లకు అందడంలేదు. ఎప్పుడైతే డబ్బలు ఖర్చుచేసి ఫేక్ హిట్ లు కొనుక్కుంటున్నారో? వాటి వెనుక జెన్యూన్ రిపోర్ట్ లు కొట్టుకుపోతున్నాయి. శ్రీనివాసకళ్యాణం ట్రయిలర్ వచ్చినపుడు అహో అన్నారు. నిజానికి టీజర్ నే బాగుంది. టీజర్ ప్లస్ మేకింగ్ వీడియో కలిపితే ట్రైలర్ అయింది అన్న గుసగుసలు వినిపించాయి.

మరోపక్క విజువల్ పబ్లిసిటీ కోసం ఎక్కువగా న్యూస్ చానెళ్లనే నమ్ముకుంటున్నారు. వాస్తవానికి మహిళలు న్యూస్ చానెళ్లు చూసేది తక్కువ. వాళ్లు ఎక్కువగా ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లు చూస్తారు. అయితే ఎంటర్ టైన్ మెంట్ చానెళ్ల పబ్లిసిటీ రేటు ఎక్కువ. న్యూస్ చానెళ్ల రేటు చీప్. కానీ టార్గెట్ ఆడియన్స్ కు కంటెంట్ రీచ్ అవుతోందా లేదా అన్నది గమనించడం లేదు.

గతంలో షూటింగ్ స్థాయి నుంచి వార్తలు, ఫోటోలు అందించడం గ్రాడ్యువల్ గా బజ్ పెంచడం వుండేది. ఇప్పుడు అంతా గుట్టుగా వుంచుకుంటున్నారు. సినిమా విడుదలకు నెలముందు మొదలు పెడుతున్నారు. ఓ ఫస్ట్ లుక్, ఓ టీజర్, ఆపై మేకింగ్ వీడియో, ట్రయిలర్. మహా అయితే సాంగ్స్. అంతే గుంపగత్తగా ఒకేసారి స్టిల్స్ పడేస్తున్నారు. అవి ఎంతవరకు రీచ్ కాగలవో అంతవరకే రీచ్ అవుతున్నాయి.

ఇలాంటి వ్యవహారాలు అన్నీకలిసి ఓపెనింగ్స్ కు గండికొడుతున్నాయి. ఇంకా ఈ ఏడాదిలో చాలా సినిమాలు రావాల్సి వుంది. నర్తనశాల, శైలజారెడ్డి అల్లుడు, అమర్ అక్బర్ ఆంథోని, హలోగురూ ప్రేమకోసమే, అరవింద సమేత, సవ్యసాచి, ముద్ర, ఇంకా చాలా వున్నాయి. వీటిలో మరీ అరవింద సమేత లాంటి వాటికి ఓపెనింగ్స్ సమస్య వుండదు. కానీ మిగిలిన వాటన్నింటికీ టెన్షన్ నే. ఓపెనింగ్స్ ఓపెన్ అయ్యేవరకు.