సాధారణ రాజకీయాల్ని మించి సినిమా రాజకీయాలు రంజుగా మారిపోయాయి. ఎన్నికల వేళ రాజకీయ నాయకులు ఎలాగైతే ప్రత్యర్థులపై ఆరోపనలు చేసుకుంటారో, అంతకు మించిన ఘాటైన విమర్శలు సినీ రంగంలో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల కోసం సినీ రంగానికి చెందినవారు చేసుకుంటున్నారు.
అసలేం జరుగుతోంది.? వీళ్ళేనా.. నిన్న మొన్నటిదాకా మేమంతా ఒకటే సినీ కుటుంబానికి చెందినవారం.. అన్నదమ్ములం.. అక్క చెల్లెళ్ళలం.. అని చెప్పుకున్నది.? అని అంతా ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. ఎవరేమనుకుంటే మాకేంటి.? అని అనుకుంటున్నారో ఏమోగానీ, సినీ జనం ఏమాత్రం తగ్గడంలేదు. పోటాపోటీగా రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. రాజకీయాల్లో ఓ సీనియర్ని పట్టుకుని, కొత్తగా రాజకీయాల్లోకొచ్చిన వ్యక్తి చెడా మడా విమర్శించేస్తాడు. అది రాజకీయం.
సినీ రంగంలోనూ పరిస్థితి అలానే వుంది. సీనియర్ అన్న గౌరం లేకుండా, ఒకప్పుడు వాళ్ళ ఛెయిర్ పక్కనే కింద కూర్చుని సన్నాయి నొక్కులు నొక్కే జూనియర్లు కూడా ఇప్పుడు సీనియర్లపై నోరు పారేసుకుంటున్నారు. అసలేముంది ‘మా’ అధ్యక్ష పదవిలో.? అన్నది మాత్రం ఎవరికీ అంతుపట్టడంలేదు. ‘మా’ అధ్యక్షుడ్ని.. అని ఇప్పటిదాకా ఎవరూ చెప్పుకున్న సందర్భాల్లేవు. అది సినీ పరిశ్రమకు, అందులోని నటీనటులకు మాత్రమే పరిమితమైన పదవి. ఆ అసోసియేషన్లో సభ్యులూ వెయ్యికి మించి లేరు.
కానీ, ఈ పదవి కోసం మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ పోటీ పడ్తున్నారు. ఎమ్మెల్యే పదవి పోయాక, పదవి లేకపోవడంతో ఆమె పదవీ వ్యామోహంతోనే ఈ పదవి కోసం పోటీ పడ్తున్నారా.? అన్న విషయమై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. చేప నీళ్ళలో లేకపోతే ఎలా బతకలేదో, ఒక్కసారి పదవి అనుభవించాక అది లేకపోతే రాజకీయ నాయకులూ బతకలేరు.. అలా జయసుధ పదవి కోసం పాకులాడుతున్నారేమో అన్పిస్తోంది చాలామందికి.
మరోపక్క, రాజేంద్రప్రసాద్ పరిస్థితి వేరు. తాను ‘మా’ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు మురళీమోహన్ ప్రకటించగానే, రాజేంద్రప్రసాద్ తనకు ఆసక్తి వుందని వెల్లడిరచారు. తనకెవరూ పోటీ రారని ఆయన అనుకుని వుండొచ్చు. మామూలుగా అయితే సదరు వ్యక్తి గౌరవార్ధం పోటీలో ఎవరూ లేకుండా సినీ పెద్దలే వ్యవహారం చక్కబెట్టేస్తుంటారు. రాజేంద్రప్రసాద్ విషయంలో అలా జరగలేదు.
చూస్తోంటే, ఎవరూ ఔనన్నా ఎవరు కాదన్నా ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే జయసుధ పదవీ వ్యామోహంతోనే పోటీలో నిలిచారా.? అన్న వాదనే బలపడ్తోంది.