పదేళ్ళ కెరీర్‌ మాటేమిటో.!

పాత తరం హీరోయిన్లతో పోల్చలేంగానీ ఈతరం హీరోయిన్లలో కొందరు పదేళ్ళ తరబడి కెరీర్‌ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. అనుష్క, నయనతార, త్రిష, శ్రియ.. ఇలా కొంతమంది హీరోయిన్లు నటనతో, అందచందాలతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే వున్నారు. ఇంకా…

పాత తరం హీరోయిన్లతో పోల్చలేంగానీ ఈతరం హీరోయిన్లలో కొందరు పదేళ్ళ తరబడి కెరీర్‌ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. అనుష్క, నయనతార, త్రిష, శ్రియ.. ఇలా కొంతమంది హీరోయిన్లు నటనతో, అందచందాలతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే వున్నారు. ఇంకా ఇంకా వారికి అవకాశాలు వస్తూనే వున్నాయి.

దర్శకరత్న దాసరి నారాయణరావు, ‘నేటితరం హీరోయిన్ల కెరీర్‌ ఐదారేళ్ళు మాత్రమే.. హీరోయిన్లు ఐటమ్‌ గర్ల్స్‌ని తలపిస్తున్నారు..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. దాసరి వ్యాఖ్యల్లో ఎంతోకొంత నిజం లేకపోలేదు. కానీ, సందర్భం చూసుకుని, సంచలన వ్యాఖ్యలు చేయడానికే పరిమితమవుతున్న దాసరిని చూసి, ‘ఎందుకిలా?’ అని ముక్కున వేలేసుకుంటున్నారు సినీ జనం.

కొందరు హీరోయిన్లు ఒక్క సినిమాతోనే కెరీర్‌ని అటకెక్కించేస్తుంటే, అతి తక్కువ మంది మాత్రం కెరీర్‌లో నిలదొక్కుకుంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో లక్కుకీ, గ్లామర్‌కీ మాత్రమే ఎక్కువ అవకాశం వుంటోంది. నటనా ప్రతిభ.. అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే ఉపయోగపడ్తోంది హీరోయిన్ల కెరీర్‌కి. ఇక, ఐటమ్‌ గర్ల్స్‌.. అన్న విషయానికొస్తే ట్రెండ్‌ అలా వుంది మరి.. దాన్ని ఏమీ అనలేం.

బాలీవుడ్‌లోనే మేటి హీరోయిన్లు ఐటమ్‌ సాంగ్స్‌కి ‘సై’ అనేస్తున్నారు. మార్కెట్‌ పరిధి పెరగడంతో, బడ్జెట్‌ కంట్రోల్‌ తప్పుతోంది. సినిమాకి కమర్షియల్‌ హంగులు అత్యవసరం. ఐటమ్‌ గర్ల్స్‌కి డిమాండ్‌ తగ్గిపోయింది కాబట్టి, ముమైత్‌ఖాన్‌ లాంటోళ్ళకే అవకాశాలు దక్కడంలేదు. హీరోయిన్లకు వున్న గ్లామర్‌ క్రేజ్‌తో నిర్మాతలు వారితో ఐటమ్‌ సాంగ్‌ చేయించడానికి ముందుకొస్తున్నారు. ఇది ట్రెండ్‌లో వచ్చిన మార్పుగా సీనియర్‌ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు పరిగణిస్తే బావుండేదేమో. ఎందుకంటే, లోపాల్ని ఎత్తి చూపినా, ఇండస్ట్రీలో వాటిని సరిదిద్దుకునే పరిస్థితి కనిపించడంలేదు మరి.!