విలువలు తెలిసిన గొప్ప నటుడు

స్కూలుకెళ్ళి డిగ్రీలు చదువుకోలేదు. అయినా డాక్టరేట్‌ పొందాడు. ప్రపంచాన్ని నిరంతరం చదివాడు, పద్మశ్రీ అయ్యాడు. ఆయనే నట సమ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు. విలువలకు ఎంతో గౌరవం ఇచ్చే నాగేశ్వరరావు తన సొంత సినిమాలు తీస్తున్నప్పుడు…

స్కూలుకెళ్ళి డిగ్రీలు చదువుకోలేదు. అయినా డాక్టరేట్‌ పొందాడు. ప్రపంచాన్ని నిరంతరం చదివాడు, పద్మశ్రీ అయ్యాడు. ఆయనే నట సమ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు. విలువలకు ఎంతో గౌరవం ఇచ్చే నాగేశ్వరరావు తన సొంత సినిమాలు తీస్తున్నప్పుడు కూడా నిర్మాతగా ఎక్కడా డాంబికం చూపించకుండా, సగటు నటుడిగానే మెసులుకునేవాడట. 

‘ప్రేమాభిషేకం’ సినిమా తీస్తున్న రోజువి. సినిమాలో చాలా భాగం అన్నపూర్ణా స్టూడియోలోనే షూటింగ్‌ చేసేశారు. షూటింగ్‌ గ్యాపుల్లో హీరోలూ, హీరోయిన్స్‌ రెస్ట్‌ రూమ్‌లలో కాస్సేపు విశ్రమించడం అతి సాధారణం. స్టార్‌ హీరో అక్కినేని తన స్టూడియోలో తన సొంత లగ్జరీ గెస్ట్‌ హౌస్‌ల వున్నాసరే,  ఆయన కుర్చీలోనే కూర్చుని టేబుల్‌ ఫ్యాన్‌ పెట్టుకుని కాస్సేపు సేదతీరేవాడట. 

గెస్ట్‌ హౌస్‌లో రెస్ట్‌ తీసుకుంటే ఎంతో కష్టపడి అలసిపోయిన సిబ్బంది తనను మరో విధంగా అనుకుంటారేమో అనే ఆలోచనతో ఆయన యూనిట్‌ మధ్యలోనే వుండేవాడట. ఫ్యాన్లు లేని టైమ్‌లో కేవలం చేతి విసనకర్రలతో షూటింగ్స్‌ చేసిన అనుభవం ఆయనకు వుందట. 

ఇప్పుడంటే ఓ మాదిరి కమెడియన్‌ కూడా క్యారవాన్‌లు అడిగేస్తున్నాడుగానీ ఆ రోజుల్లో హీరోకి కుర్చీ వేసినా, వచ్చిపోయే పెద్దలు ఏమీ అనుకోకుండా చాలాసేపు నిలబడే వుండేవారట. అలాంటి విలువలు అక్కినేనిలో ఇంకా ఎన్నో వున్నాయని ఆయన్ని దగ్గరగా చూసినవారు చెబుతారు. అందుకే ఆయన నటుడిగానూ వ్యక్తిగానూ ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరుకుని, పరిపూర్ణ జీవితాన్ని అనుభవించి వెళ్ళిపోయాడు.