పదేళ్ల కష్టానికి ఫలితం దక్కింది

ఒక కల నిజం కావాలంటే అంత సులువు కాదు. ఓ దర్శకుడికి కొడుకు. నటుడు కావాలనుకున్నాడు. నిజానికి ఆ బ్యాక్ గ్రవుండ్ వుంది కాబట్టి సులువే అనుకోవచ్చు. కానీ కాలం కలిసి రాలేదు. తండ్రిని…

ఒక కల నిజం కావాలంటే అంత సులువు కాదు. ఓ దర్శకుడికి కొడుకు. నటుడు కావాలనుకున్నాడు. నిజానికి ఆ బ్యాక్ గ్రవుండ్ వుంది కాబట్టి సులువే అనుకోవచ్చు. కానీ కాలం కలిసి రాలేదు. తండ్రిని తీసుకుపోయింది. ఆ తల్లి ఇద్దరు పిల్లల్ని ఒంటరిగా పెంచాల్సి వచ్చింది. ఆర్థిక సమస్యలు సరేసరి. కానీ హీరో కావాలన్న పట్టుదల అలాగే వుందా కుర్రాడిలో. 

ఒకటీ అరా సినిమాలు గ్యాప్ గ్యాప్ తో చేస్తూనే వచ్చాడు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. యువి లాంటి పెద్ద బ్యానర్ లో సినిమా. మళ్లీ సమస్య. థియేటర్లు బంద్. సినిమా ఓటిటికి వెళ్లింది. అన్ని వైపుల నుంచి బాగా చేసాడనే ప్రశంసలు. పదేళ్ల కష్టానికి ఫలితం దక్కిందన్న ఆనందం. అతగాడే సంతోష్ శోభన్. దర్శకుడు శోభన్ కుమారుడు. ఏక్ మినీ కథ సినిమా హీరో. అతగాడితో చిన్న చిట్ చాట్.

ఏక్ మినీ కథ..ఫలితం ఎలా వుంది? రెస్పాన్స్ ఎలా వుంది?

ట్రెమండస్ గా వుంది. అన్ని వైపుల నుంచి ఫుల్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్. పదేళ్ల కష్టం. ఇప్పటికి కల నెరవేరిందనే సంతోషం. నిజంగా పదేళ్లు ఎన్ని సమస్యలు తట్టకుని, నిలబడ్డానో. ఇప్పటికి ఓ ఆనందం దక్కింది.

హీరోగా కొన్నాళ్లు ఇక్కడ వుండగలననే ధైర్యం, భరోసా దొరికేసినట్లేనా?

ధైర్యం, భరోసా అనే కన్నా, నమ్మకం. నా మీద, నా ప్రయత్నం మీద నమ్మకం. నిలబడింది. ఈ ప్రయత్నం ఇలా కొనసాగించవచ్చు అనే పట్టుదల పెరిగింది

అసలే హీరోగా చాన్స్ ల కోసం చూస్తున్నపుడు ఇలా అడల్ట్ టచ్ వున్న సినిమాలో చేస్తే, ముద్ర పడిపోతుందేమో అన్న భయం వేయలేదా?

లేదు. మేర్లపాక గాంధీ కథను చెప్పిన విధానమే వేరు. ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఓ టిపికల్ పాయింట్ ను డీల్ చేస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా తీసి చూపించారు కూడా. ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ ను చేసే అవకాశం ఎర్లీ డేస్ లోనే రావడం విశేషం కదా.

ఒటిటి సినిమా అంటే ఇంట్లో అందరూ కూర్చుని చూడాల్సి వుంటుంది. కానీ ఈ సినిమా అలా చూడడం సాధ్యమా?

అంత ఇబ్బంది కలిగించేలా ఎక్కడా లేదు. విషయం అలాంటిది కావచ్చు కానీ తీసిన విధానం మాత్రం అలా కాదు.

సినిమా విడుదలయిపోయింది. సమీక్షలు వచ్చేసాయి. దాచడానికి ఏమీ లేదు. ఇప్పుడు చెప్పండి…సినిమాలో ప్లస్ పాయింట్ ఏమిటి? మైనస్ ఏమిటి?

ఫన్, ఎంటర్ టైన్ మెంట్ ను మిస్ కాకుండా, ఓ టిపికల్ పాయింట్ ను డీల్ చేయడం సినిమాకు ప్లస్ పాయింట్. నాకు మైనస్ లు అని ఏవీ అనిపించలేదు.

సినిమా సెకండాఫ్ పై డిఫరెంట్ ఒపీనియన్లు వున్నాయి.

క్రిటిక్స్ ఒపీనియన్లను నేను గౌరవిస్తాను. కానీ సెకండాఫ్ నే నచ్చిందని, సెకండాఫ్ కూడా బాగుందని నాకు చెప్పిన వారు, చెపుతున్నవారు చాలా మంది వున్నారు.

తరువాత ఏంటీ

మంచి అవకాశాలు రావాలి. మంచి అవకాశంతో పాటు మంచి కథలు రావాలి. అంత వరకు కష్టపడుతూనే వుండాలి.

ఒకె ఆల్ ది బెస్ట్

థాంక్యూ

విఎస్ఎన్ మూర్తి.