టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి, నారా లోకేశ్ మాతృమూర్తి భువనేశ్వరి తాను కలత చెందినట్టు పేర్కొన్నారు. ఆమె కలతకు కారణం …కోవిడ్ కారణంగా మృతి చెంది అంతిమ సంస్కారానికి నోచుకోక పోవడమే. రోడ్ల పక్కన పడేసిన అనాథ మృతదేహాలను చూసి తానెంతో కలత చెంది ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వెల్లడించారు.
కరోనా బారిన పడి చివరి మజిలీకి నోచుకోని అనాథ మృతదేహాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతిమ సంస్కారం నిర్వహిస్తామని ఆమె ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక వాహనాలను సిద్ధం చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు.
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుని కుటుంబ సభ్యుల నిరాదరణకు గురి కావడం గురించి కథలుకథలుగా వింటున్నాం. అలాంటి అనాథ శవాలకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆయా వ్యక్తుల మతానుసారం అంత్యక్రియలు నిర్వహిస్తూ మన్ననలు పొందుతున్నారు.
తిరుపతిలో కొందరు ముస్లింలు ఒక అసోసియేషన్‌గా ఏర్పడి పెద్ద ఎత్తున అనాథ మృతదేహాలకు గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుండడం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు.