ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఎవరెన్ని రకాలుగా విమర్శలు చేసినా, తిరుగులేని జననేతగా నిలిచారన్నది వాస్తవం. అయితే ఇదేమీ ఊరికే రాలేదు. పిల్లలంటే ప్రేమించని మనిషి, మనసు ఉండదు. పిల్లల యోగక్షేమాలను పట్టించుకునే విషయంలో జగన్ తర్వాతే ఏ పాలకుడైనా అని చెప్పేందుకు అనేక ఉదాహరణలున్నాయి.
పిల్లలు చదువుకునేందుకు అమ్మ ఒడి ద్వారా ఏడాదికి రూ.15 వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే. మరో తాజా గొప్ప నిర్ణయాన్ని కూడా చెప్పుకోవచ్చు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు భవిష్యత్‌పై భరోసా, భద్రత కల్పించేందుకు వారి పేరుతో రూ.10 లక్షలు డిపాజిట్ చేయడం బహుశా దేశంలోనే ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని చెప్పొచ్చు. ఈ పరంపరలో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా పీడియాట్రిక్ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది. ఏపీఎంఎస్‌ఐడీసీ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో 8 మందితో పీడియాట్రిక్ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
పిల్లలకు కోవిడ్ సోకితే తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. వారంలోపు ప్రాథమిక నివేదక ఇవ్వాల్సిందిగా టాస్క్‌ఫోర్స్ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్ సోకిన పిల్లలకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలాంటి ఎక్వీప్మెంట్ రెడీ చేసుకోవాలి.. తదితర అంశాలపై పూర్తిస్ధాయి నివేదిక ఇవ్వాలని టాస్క్ ఫోర్స్ కమిటీని జగన్ ఆదేశించారని సమాచారం.
కరోనా సెకెండ్ వేవ్‌లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా థర్డ్ వేవ్‌పై ఎంతో ముందు జాగ్రత్తలు తీసుకోవడం అభినందనీయం. నవంబర్, డిసెంబర్ నెలల్లో మూడో వేవ్ వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో జగన్ సర్కార్ ఎంతో ముందు చూపుతో వ్యవహరిస్తోందనేందుకు టాస్క్‌పోర్స్ ఏర్పాటే నిదర్శనం.