తమిళ, తెలుగు భాషల్లో ఎన్నో ఏళ్లుగా మంచి పొజిషన్‌లోనే ఉన్న త్రిష ఇంకా సీనియర్ నటి అనేంత కాకపోయినా… ఓ మోస్తరు మధ్య వయసు నటే అని చెప్పాలి. దాదాపు 32 ఏళ్ల వయసు దాటిపోయిన ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు తన అసలు వయసు కన్నాపదేళ్లు తక్కువ కనపడాలని నానా తంటాలు పడుతోంది. తిండి తగ్గించేసి, కసరత్తులు అవీ చేసేస్తోంది. అయితే ఇది ఏ కుర్రహీరోతోనో ప్రేమలో పడిన ఫలితం కాదు. సినిమాలోని పాత్రకు తగ్గట్టు నప్పాలనే యత్నం. పైగా అది హీరోయిన్ ఓరియెంట్ చిత్రం కావడంతో త్రిష మరింత కష్టపడుతోంది.
తెలుగు, తమిళ భాషల్లో త్రిష కధానాయికగా రూపొందుతున్న హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం నాయకి. హారర్-కామెడీ కధాంశంతో రూపొందుతున్న ఈ సినిమా 1980 ప్రాంతంలో జరిగిన కధతో రూపొందుతోందట. చిత్ర కధానుసారం త్రిష ఇరవైఏళ్ల వయసున్న యువతి పాత్ర పోషిస్తోందట. చిత్ర కధ మాత్రమే చెప్పిన దర్శకుడు తక్కువ వయసు అమ్మాయిలా కనపడాలనే సూచనలేమీ చేయకపోయినా త్రిష తనంత తానే అవసరాన్ని అర్ధం చేసుకుని కసరత్తులు మొదలెట్టేసిందట. ఇప్పటికే చెప్పుకోదగ్గ స్థాయిలో బరువు తగ్గిందని సమాచారం.
బరువైతే తగ్గొచ్చు గాని వయసుతో పాటు ముఖంలో వచ్చే మార్పుల్ని ఆపలేం కదా… అందుకే ఈ పాత్రకు తగ్గట్టుగా త్రిష రూపాన్ని తీర్చిదిద్దడానికి ముంబయికి చెందిన ఒక మేకప్ ఆర్టిస్ట్ ను, కాస్ట్యూమ్ డిజైనర్ ను రప్పిస్తున్నారట. ఈ సినిమా 90శాతం కామెడీ, 10శాతం హారర్ ఉండే చిత్రమని దర్శకుడు అంటున్నారు.