విశాల్ లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్టు పందెం కోడి-2. ఈ సినిమా అక్టోబర్ 18న విడుదల కాబోతోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాత టాగోర్ మధు చేతికి వచ్చింది. ఆ సినిమా తెలుగు హక్కులు ఆయన తీసుకున్నారు. డీల్ ఏమిటన్నది క్లియర్ గా తెలియదు కానీ, పది కోట్ల వరకు వుంటుందని తెలుస్తోంది. తెలుగు వెర్షన్ థియేటర్, శాటిలైట్ అన్నీ కలిపి ఈ రేటు అని తెలుస్తోంది. ఒకవేళ శాటిలైట్ కనుక అన్ని భాషలకు కలిపి చేసుకుంటే, ఆ మేరకు రేటు తగ్గుతుంది.
విశాల్ పందెంకోడి తెలుగునాట కూడా పెద్ద హిట్. దానికి సీక్వెల్ అనగానే కాస్త మంచి క్రేజ్ వచ్చింది. పైగా ఇటీవల డిటెక్టివ్, అభిమన్యుడు సినిమాలతో విశాల్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. అభిమన్యుడు సినిమా తెలుగునాట పెద్ద హిట్ అయింది. ఇప్పటికీ ఆ సినిమా జనాలకు గుర్తు వుంది. ఆ సినిమా రూపొందించిన దర్శకుడు లింగుస్వామినే పార్ట్ 2 కూడా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇదిలా వుండగా తెలుగులో హిట్ అయిన టెంపర్ సినిమాను టాగోర్ మధు తమిళంలో విశాల్ హీరోగా పునర్నిర్మిస్తున్నారు. ఆ సినిమా ఆగస్టు నుంచి సెట్ మీదకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో పందెంకోడి-2 హక్కులు కూడా తీసుకోవడం విశేషం.