కోరి తెచ్చుకుంటున్న పోటీ

మీడియాను మొత్తం తమ గుత్తాధిపత్యంలో వుంచుకుంటే, తాము నంది అంటే నంది, కాదు అంటే కాదు అని జనాలను అక్షరాలతో వంచించవచ్చు అన్నది తెలుగునాట ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ప్రగాఢ నమ్మకం. ఇన్నాళ్లుగా…

మీడియాను మొత్తం తమ గుత్తాధిపత్యంలో వుంచుకుంటే, తాము నంది అంటే నంది, కాదు అంటే కాదు అని జనాలను అక్షరాలతో వంచించవచ్చు అన్నది తెలుగునాట ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ప్రగాఢ నమ్మకం. ఇన్నాళ్లుగా ఇన్నేళ్లుగా అదే సాగుతూ వస్తోంది కూడా. దీన్ని తెగించి బ్రేక్ చేయగలిగారు కొంతవరకు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ సెక్షన్ ఆఫ్ మీడియా అన్నది సామాజికవర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది, తమ వర్గం అంటే పడదు అన్నది అన్యాపదేశంగా పదే పదే చెప్పడానికి ప్రయత్నించారు. అది జనంలోకి చాలావరకు వెళ్లింది కూడా. 

ఎంతవరకు వెళ్లింది అంటే, తెలుగునాట పత్రికలు, చానెళ్లు ఏవేవీ, ఏయే పార్టీకి కొమ్ముకాస్తయన్నది జనాలందరికీ ఇప్పుడు తెలుసు. అందుకే వాటిని చూస్తారు. చదువుతారు. ఆపైన తమ తమ రాజకీయ, సామాజిక అనుబంధాలు, సిద్ధాంతాల ప్రాతిపదికగా వాటిని నమ్మడం, నమ్మకపోవడం అన్నది వుంటుంది. ఇదిలా వుంటే టోటల్ గా తెలుగు మీడియా రంగం మీద గుత్తాధిపత్యం సాధించాలన్న పర్టిక్యులర్ సామాజికవర్గం ఆశలు మాత్రం నెరవేరడం లేదు.

సాక్షి మీడియా రావడంతోనే కౌంటర్ పాయింట్లు అన్నవి బయటకు రావడం ప్రారంభమైంది. ఆ తరువాత పాపులారిటీ సంగతి అలా వుంచితే, ఎంత కొంత తేడా అన్నది వచ్చింది. తాజగా జనసేన పార్టీ కూడా తమ తమ చానెళ్లను ఏర్పాటు చేసుకుంటోంది. ఎందువల్ల. గుత్తాధిపత్యం వహించాలనుకుంటున్న మీడియాలో తమ పార్టీకి, తమ కార్యక్రమాలకు కవరేజ్ రాకపోవడం వల్ల. ఇప్పుడేమవుతుంది దీనివల్ల కేవలం కవరేజ్ రావడం ఒక్కటే కాదు.

ఎప్పుడో వైఎస్, ఇప్పుడు జగన్ చెబుతున్న మాటలకు వత్తాసు దొరుకుతుంది. వైఎస్ ఫ్యామిలీ మాత్రమే 'ఆ పర్టిక్యులర్ మీడియా' మీద నిందలు మోపితే, ఏమో అనుకోవచ్చు. ఇప్పుడు మరో సామాజిక వర్గం కూడా అదే పని చేయబోతోంది. అంటే రాష్ట్రంలోని రెండు కీలక సామాజిక వర్గాలు, మరో కీలక సామాజిక వర్గానికి చెందిన మీడియా పై పోరు సాగిస్తున్నాయి. ఒకరు చెబితే ఏమో అనుకోవచ్చు, పదిమంది చెబితే ఆలోచించడం ప్రారంభమవుతుంది.

తెలంగాణలో ఆట కట్టు
ఆంధ్రలో ఏ సెక్షన్ ఆఫ్ మీడియా అయితే రాజకీయాలను శాసిస్తూ, తెలుగుదేశం పార్టీ తప్ప వేరొకరు అధికారంలోకి రాకూడదని తమ సర్వశక్తులు ఒడ్డుతోందో, అదే మీడియా తెలంగాణలో మాత్రం చతికిలపడింది. అక్కడ కూడా హవా, హల్ చల్ సాగిద్దాం అనుకుంటే  మాత్రం కుదరలేదు. ఆంధ్రలో లోకల్ అయిన మీడియా, తెలంగాణలో నాన్ లోకల్ కావడంతో, అక్కడ సెంటిమెంట్ బలంగా వుండడంతో, ఆదిలోనే ప్రభుత్వం ఇలాంటి వ్యవహారాలను గట్టిగా ఉక్కుపాదంతో అణచివేసే పని మొదలుపెట్టింది.

ఆరంభంలో ఎంతోకొంత ట్రయ్ చేసినా, తమ ఆటలు సాగవని తెలిసి, ప్రభుత్వంతో రాజీకి వచ్చారు. ఇప్పుడు కెసిఆర్ కు వ్యతిరేంగా ప్రసారం చేసే ఆలోచన కనీస భవిష్యత్ లో లేదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జీరో స్థాయికి పడిపోవడం వెనుక వున్న బలమైన కారణాల్లో ఇది ఒకటి.  అదే పరిస్థితి ఆంధ్రలో కూడా వస్తే, తెలుగుదేశానికి కష్టం అవుతుంది. అలాంటి పరిస్థితి రాదు కానీ బలమైన మీడియా పోటీ మాత్రం వచ్చే అవకాశం మాత్రం క్లియర్ గా వుంది. వైకాపా తరపున ఒకటి, జనసేన తరపున రెండు మీడియా సంస్థలు వచ్చినపుడు, వేరు వేరు గొంతులు వినిపించడం ప్రారంభమవుతుంది.

ఇప్పటికే ప్రజల్లో కొన్ని చానెళ్ల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇలా అన్నివిధాలా తమకు తిరుగులేదు, ఏం చేసినా చెల్లుతుంది అని అనుకోవడం వల్ల పరిస్థితులు మారుతున్నాయి. పోటీ మీడియా, ప్రజల్లో వ్యతిరేకత, నమ్మకం తగ్గడం వంటివి అనివార్యం అవుతున్నాయి. ఇదంతా ఆ 'పర్టిక్యులర్ మీడియా' కోరి తెచ్చుకున్నది. ఇంకా తెచ్చుకుంటున్నది.