లోకేష్ ఎవరని అడిగి, పార్టీలో వుండగలరా?

చంద్రబాబు ఎవరు? అని నిలదీసి తెలుగుదేశం పార్టీలో వుండగలరా? ఎవరైనా? అలాగే లోకేష్ బాబు ఎవరు అభ్యర్ధులను ప్రకటించడానికి అని అడిగి, పార్టీలో మనగలరా? ఎవరు ఎన్నికబుర్లు చెప్పినా, ఎన్ని సిద్దాంతాలు వల్లె వేసినా,…

చంద్రబాబు ఎవరు? అని నిలదీసి తెలుగుదేశం పార్టీలో వుండగలరా? ఎవరైనా? అలాగే లోకేష్ బాబు ఎవరు అభ్యర్ధులను ప్రకటించడానికి అని అడిగి, పార్టీలో మనగలరా? ఎవరు ఎన్నికబుర్లు చెప్పినా, ఎన్ని సిద్దాంతాలు వల్లె వేసినా, నందమూరి వారసులకు కాకుండా, తెలివిగా తమ చేతుల్లోకి తీసుకున్న తెలుగుదేశం పార్టీ వారసత్వం నారాలోకేష్ నాయుడు దే. అందులో సందేహంలేదు.

లోకేష్ ఎంట్రీని కానీ, ఎమ్మెల్సీ పదవిని కానీ, ఆపై మంత్రి పదవిని కానీ ఎవ్వరన్నా ఒక్కమాట అభ్యంతరం చెప్పకుండా చకచకా జరిగిపోయాయి. దాదాపు మూడేళ్లుగా పార్టీ డే టుడే యాక్టివిటీస్ అన్నీ లోకేష్ బాబు కనుసన్నలలో నడుస్తున్నాయన్నది పార్టీ జనాలందరికీ తెలిసిన విషయం.

ఇలాంటి నేపథ్యంలో టిజి వెంకటేష్ నేరుగా లోకేష్ నే, ఏం అధికారం వుందీ అని ప్రశ్నించారు అంటే అది, ఆవేశం అయినా అయి వుండాలి. లేదా అజ్ఞానం అయినా అయి వుండాలి. ఈ రెండూ కాకపోతే, అవసరం అయితే పార్టీ నుంచి జంప్ అవుతాను అనే ఆలోచన అన్నా వుండి వుండాలి.

ఒకటి మాత్రం స్పష్టం. ఒకసారి లోకేష్ ప్రకటించేసాక, మరి అభ్యర్ధుల మార్పు అయితే జరగదు. ఎందుకంటే, అలా మారిస్తే, టిజి వెంకటేష్ హూంకరింపులకు లోకేష్, ఆయన తండ్రి చంద్రబాబు బెదిరినట్లు కలర్ వస్తుంది. అందువల్ల అది జరగదు. ఇక మిగిలినవి రెండు ఆఫ్షన్ లే. ప్రస్తుతానికి బాబు ఫోన్ ఆదేశాలు వస్తే, సైలంట్ గా వుండడం. ఎన్నికల టైమ్ లో బాబు ఇచ్చే హామీలతో సరిపుచ్చుకోవడం. 

లేదూ అంటే జంప్ జిలానీ అంటూ వేరే పార్టీ వైపు చూడడం. అయితే అలా వేరేపార్టీలో ఇప్పటి నుంచీ వెళ్లిపోయే అవకాశం బాబు ఇవ్వరు. తానేదో చేయబోతున్నట్లు, చేస్తానన్నట్లు కలర్ ఇస్తూ ఇక్కడే వుంచే ప్రయత్నం చేస్తారు. తీరా పరిస్థితి చేజారినపుడు పార్టీ మారదాం అంటే అక్కడ అంత అవకాశం వుండదు. అందువల్ల టిజి వెంకటేష్ ఏం చేసినా, ఇప్పుడే చేయడం ఉత్తమమేమో?