మొదట్నించీ డైరక్టర్ సంపత్ నందితో అసోసియేట్ అవుతూ వస్తున్న నిర్మాత రాధామోహన్. ఇప్పుడు కూడా ఆయన ఓ సినిమాను సంపత్ నంది-గోపీచంద్ కాంబినేషన్ లో నిర్మించాల్సి వుంది. ఇందుకోసం స్క్రిప్ట్ రెడీగా వుంది. కానీ ఆ సబ్జెక్ట్ ను ఇప్పుడే చేయడానికి హీరో గోపీచంద్ అంతగా ఇష్టపడలేదు. మంచి స్క్రిప్ట్ నే కానీ, తరువాత చేద్దాం అనేసారు.
కానీ దర్శకుడు సంపత్ నంది ఆగలేకపోయారు. మరో స్క్రిప్ట్ ను రెడీ చేసి వినిపించారు. ఒకే చేయించేసుకున్నారు. కానీ అక్కడే వచ్చింది తకరారు. ఆ స్క్రిప్ట్ ను రాధామోహన్ కు కాకుండా వేరే నిర్మాతకు చేసారు. దాంతో ఆ ప్రాజెక్టు అటు వెళ్లిపోయింది. వాస్తవానికి సంపత్ నంది, అదే గోపీచంద్ తో సినిమా చేయాలి అంటే రాధామోహన్ కే చేయాలి. కానీ రూటు మార్చేసారు.
పాపం, దాంతో రాధామోహన్ ఖంగుతిన్నారు. తను దర్శకుడిని హీరోని నమ్మి, అలా దాని మీదే వుండిపోతే ఇలా అయిందేమిటా? అని ఫీలవుతున్నారు. గోపీచంద్ తను తెచ్చిన సంపత్ నంది స్క్రిప్ట్ ను ఓకె అననప్పుడు, తాను వేరే దర్శకుడిని తీసుకెళ్లి కథ చెప్పించకుండా, నిబద్దతతో వున్నానని, కానీ సంపత్ నంది మాత్రం ఇలా చేసారేమిటా అని ఆయన సన్నిహితుల దగ్గర చెప్పుకుని బాధపడుతున్నట్లు బోగట్టా.
కానీ సంపత్ నంది మాత్రం ఏం చేస్తారు. గౌతమ్ నందా దారుణ పరాజయం తరువాత ఆయనకు పెద్ద సినిమా అవకాశం రావడంలేదు. ఇప్పుడు మొత్తానికి వచ్చింది. ఏదో విధంగా దాన్ని పట్టాలు ఎక్కించుకోకుంటే, సినిమా జనాలు ఆయనను మరిచిపోయే ప్రమాదం వుంది. అందుకే ఈ నిర్మాతను వదిలి ఆ నిర్మాతను పట్టుకున్నారు. సినిమా తెచ్చుకున్నారు.
అయినా ఫామ్ లో వున్న టాప్ హీరోతో సినిమా మిస్ అయితే రాధామోహన్ ఫీలవ్వాలి కానీ, స్ట్రగులింగ్ లో వున్న హీరోతో సినిమా మిస్ అయితే సమస్య ఏముంది? ఇవ్వాళ కాకుంటే రేపయినా డేట్లు వస్తాయి. వేచి వుండడమే.