ఓ సినిమా హిట్ అయితే ఆ సినిమాలో కాస్త మంచి పాత్ర చేసిన వాళ్లంతా ఆనందిస్తారు. కానీ షకలక శంకర్ కు ఆ ఆనందం దక్కలేదు. రాజుగారి గది 2 సినిమా విడుదలయింది. మంచి కలెక్షన్లు అందుకుంటోంది. ఫస్ట్ వీక్ మూడు రోజుల కలిసి దాదాపు అయిదు కోట్ల వరకు వసూళ్లు సాగిస్తోంది. కానీ ఆ సినిమాలో ఓ కీలకపాత్ర ధరించిన షకలక శంకర్ కు మాత్రం ఆ ఆనందంలో పాలు దొరకలేదు.
ఇప్పటికి రాజుగారి గది 2 కోసం మూడు గ్రూప్ ప్రెస్ మీట్ లు పెట్టారు. మొదటి దానికి నాగ్, మరి కొంతమంది వచ్చారు. రెండో ప్రెస్ మీట్ కు టోటల్ నటులు, క్రూ హాజరయ్యారు. మూడో ప్రెస్ మీట్ ఇవ్వాళ జరిగింది. అందరూ వచ్చేసారు. కానీ షకలక శంకర్ మాత్రం రాలేదు.
దీనికి సహేతుక కారణం వుండనే వుంది. సినిమాలో షకలక శంకర్ నటించిన అయిదు నిమషాల సీన్లు ఎడిటింగ్ కత్తెరకు గురయ్యాయి. పైగా ఆ ఎడిటర్ ఎవరో కాదు, హీరో నాగార్జునే. సినిమా విడుదలకు ముందుగా చూసి, ఆయన ఈ అయిదు నిమిషాల కామెడీ సీన్లు, మరో రెండు నిమషాల కామెడీ సీన్లు లేపేసారు. ఈ అయిదు నిమిషాల షకలక శంకర్ కామెడీ సీన్లు అద్భుతంగా వచ్చాయని వినికిడి. కేఎ పాల్, ఇంకా మరి కొంత మందిని షకలక శంకర్ బాగా అనుకరణ చేసాడని తెలుస్తోంది.
కానీ మరి నాగ్ అయిడియా వేరుగా వుండడంతో వాటిని లేపేసాడు. హీరో కావడంతో మరి యూనిట్ ఏమీ మాట్లాడలేకపోయింది. ఈ విషయమై నాగ్ ను ప్రశ్నిస్తే, మాంచి ఫీల్ గుడ్ సీన్ల తరువాత కామెడీ సీన్లు రావడం సరి కాదని, యూనిట్ అంతా అలాగే అభిప్రాయ పడడంతో లేపేసామని అన్నారు. కానీ ఇది నాగ్ ఒక్కడి నిర్ణయమే అని వినికిడి. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా కు కూడా నాగ్ ఇలాగే పది నిమషాల కామెడీ సీన్లు లేపేసాడు.
మరి ఆయన అయిడియా అలా వుంది. దాంతో షకలక శంకర్ ఫీలయినట్లున్నాడు. ఒక్క మీట్ కు కూడా హాజరు కాలేదు. చిన్న కమెడియన్. అంతకన్నా ఏం చేయగలడు?