పాపం, అల్లరి నరేష్

ఓడలు బళ్లు, బళ్లు ఓడలు కావడం అంటే ఇదే. అల్లరి నరేష్ సినిమా అంటే ఒకప్పుడు హాట్ కేక్. పెద్ద హీరోల రెమ్యూనిరేషన్ అయిదు నుంచి ఆరు కోట్ల రేంజ్ లో వున్నపుడు అల్లరి…

ఓడలు బళ్లు, బళ్లు ఓడలు కావడం అంటే ఇదే. అల్లరి నరేష్ సినిమా అంటే ఒకప్పుడు హాట్ కేక్. పెద్ద హీరోల రెమ్యూనిరేషన్ అయిదు నుంచి ఆరు కోట్ల రేంజ్ లో వున్నపుడు అల్లరి నరేష్ రెమ్యూనిరేషన్ కోటిన్నర, రెండు కోట్లు వుండేది. అప్పట్లో నాలుగయిదు కోట్లతో అల్లరి నరేష్ సినిమా తీస్తే నిర్మాతకు లాభాల పంటే. అలాంటిది రోజులు మారాయి. సుడిగాడు సినిమా తరువాత అల్లరి నరేష్ కు సరైన విజయాలు లభించడం లేదు. 

ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎందరు రైటర్లను మారుస్తున్నా, ఏ కథలు చేస్తున్నా లక్కు చిక్కి హిట్ కొట్టలేకపోతున్నాడు. ఆఖరికి మళయాలంలో మంచి హిట్ అయిన సినిమా రీమేక్ హక్కులు కొని, మేడమీద అబ్బాయి అనే డిఫరెంట్ సినిమా చేసాడు. ఆ భాషలో మంచి హిట్ సినిమా. ఈ హక్కుల కోసం అప్పట్లో చాలా మంది పోటీ పడ్డారు కూడా. అలాంటి సినిమా సంపాదించి పూర్తి చేసాడు. 

అంతవరకు బాగానే వుంది. కానీ ఆ సినిమాను అమ్మడం గగనం అవుతోందని వార్తలు వినవస్తున్నాయి. విడుదల వారం రోజుల లోపునకు వచ్చేసింది. కానీ ఇంకా అమ్మకాలు షురూ కాలేదంటున్నారు. ఎలా లేదన్నా సినిమాకు అయిదారు కోట్లకు పైగానే ఖర్చయివుంటుంది. సినిమా బాగుంటే శాటిలైట్ మూడు దాకా వచ్చేస్తుంది. కానీ మిగిలింది? డైరక్ట్ విడుదల చేసుకుంటే గాల్లో దీపం పెట్టినట్లే.

అయితే జాక్ పాట్ కొట్టొచ్చు. లేదూ అంటే లేదు. పైగా పిచ్చ కాంఫిటీషన్ లో విడుదలవుతోంది ఈ సినిమా. అటు నాగ్ చైతన్య యుద్ధం శరణం వుండనే వుంది. అందువల్ల ఓపెనింగ్స్ తో సమస్య వుండనే వుంటుంది. ఇంకా మరో ఒకటి రెండు సినిమాలు వుండే అవకాశం వుంది. ఇలాంటపుడు అయిన కాడికి తక్కువ రేట్లకు అమ్మలేరు. అలా అని నేరుగా విడుదల చేసుకోవాలంటే మరింత ఖర్చు. కష్టమే మరి.