విక్టరీ వెంకటేష్ కు కొత్త సినిమా పట్టు చిక్కడం లేదు. కథల కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కానీ కుదరడం లేదు. ఏ దర్శకుడిని ట్రయ్ చేసినా, సురేష్ బాబును మెప్పించలేకపోతున్నారు. ఒక్కో డైరక్టర్ రావడం నెలా, రెండు నెలలు డిస్కషన్లు సాగించడం, ఆపై మాయం కావడం.
కిషోర్ తిరుమల వచ్చాడు వెళ్లాడు, బాలీవుడ్ లో ట్రయినింగ్ అయిన తెలుగు కుర్రాడు ఒకడు వచ్చాడు వెళ్లాడు. ఆ మధ్య ఓ తమిళ డైరక్టర్ తోడేళ్ల నడుమ వెంకీ వుండే ఓ కొత్త తరహా గ్రాఫిక్స్ కథ పట్టుకువచ్చాడు. రెండు మూడు నెలలు కిందా మీదా అయింది. అది కూడా కంచికి వెళ్లిపోయింది.
ఇక ఇప్పుడు లేటెస్ట్ గా హిట్ లే కాదు, సినిమా కూడా లేకుండా సతమతమవుతున్న బొమ్మరిల్లు భాస్కర్ వంతు వచ్చింది. ఓ మల్టీ స్టారర్ కథ తెచ్చాడట. ప్రస్తుతం డిస్కషన్లు ప్రారంభమయ్యాయని వినికిడి. కానీ వెంకీతో మల్టీ స్టారర్ అంటే ఎవరు ముందుకు వస్తారన్నది ప్రశ్న. రామ్ చేసాడు.
పైకి ఏమీ చెప్పకున్నా, అతని పాత్రకు అన్యాయం జరిగిందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. మరి యంగ్ కుర్రాళ్లు ఎవరు సై అంటారన్నది చూడాలి. ఇప్పటి కుర్రాళ్లు మొహమాటానికి పోయి సై అనడం మానేసారు. అందువల్ల ఈ ప్రాజెక్టు ఎంత వరకు మెటీరియలైజ్ అవుతుందో చూడాలి.