సక్సెస్ లు వుంటే సినిమాలు వుంటాయి. సినిమాలు వుంటే విలువ వుంటుంది. అలా కాకుండా ఫ్లాపులు పలకరిస్తూ పోతూ వుంటే హీరోల వెనక బడిపోతూ వుంటారు. గోపీచంద్ ను వరుసగా ఫ్లాపులు పలకరిస్తున్నాయి. సినిమాలు మామూలు డిజాస్టర్లు కావడం లేదు. ఇలాంటి టైమ్ లో సంపత్ నందితో సినిమా తెరకెక్కుతోంది. సాధారణంగా పండగ అంటే ఏదో ఒకటి ఆ సినిమా నుంచి విడుదల చేయడం కామన్.
అయితే గోపీచంద్-సంపత్ నంది సినిమాకు సంబంధించి ఓ చిన్న విడియో విడుదల చేసారు. విడియో అంటే సినిమా షూటింగ్ సన్నాహాలు, ఆ సన్నాహాల్లో డైరక్టర్ సంపత్ నంది హడావుడి. అంతే తప్ప మరేం లేదు. హీరో ఎక్కడా కనిపించలేదు. సరే, హీరో లుక్ కోసం దాచారు అని అనుకుంటే, మిగిలిన కీలకమైన స్టార్ కాస్ట్ అయినా లేదు.
కేవలం సంపత్ నంది, ఆయనకు సదా గొడుగు పడుతూ వెనుక అసిస్టెంట్. ఇది తప్ప ఆ విడియోలో చెప్పుకోవడానికి ఏమీలేదు. చివర్లో మాత్రం ఫస్ట్ లుక్ త్వరలో అని ఇచ్చేసారు. ఆ ఇచ్చేదేదో ఈ సంక్రాంతికే ఇస్తే సరిపోయేది కదా? అలా చేస్తే, ఈ 'గొడుగు' విడియో వదలడానికి వీలు కాదనేమో?