పరుశురామ్ పై ‘ఛాంబర్’ కు?

టాలీవుడ్ లో కొంతమంది డైరక్టర్లకు ఓ అలవాటు వుంది. ఇస్తామన్నవారి అందరి దగ్గరా అడ్వాన్స్ లు తీసేసుకోవడం. ఆ తరువాత ఇదిగో సినిమా అదిగో సినిమా అని తిప్పించుకోవడం. పైగా అలా తిప్పించుకుని, తప్పించుకోవడానికి…

టాలీవుడ్ లో కొంతమంది డైరక్టర్లకు ఓ అలవాటు వుంది. ఇస్తామన్నవారి అందరి దగ్గరా అడ్వాన్స్ లు తీసేసుకోవడం. ఆ తరువాత ఇదిగో సినిమా అదిగో సినిమా అని తిప్పించుకోవడం. పైగా అలా తిప్పించుకుని, తప్పించుకోవడానికి కూడా బోలెడు ఉపాయాలు వున్నాయి. హీరోను తీసుకురండి. హీరోను ఒప్పించండి, అంటూ లింక్ పెట్టడం, తీరా చేయడం ఇష్టం లేకపోతే, అరకొర కథలు చెప్పడం ఇలా చాలా వుంటాయి వ్యవహారాలు.

ఇప్పుడు ఇంతకీ విషయం ఏమిటంటే, చిన్న సినిమాలు తీసే పరుశురామ్ ఒక్కసారిగా గీతగోవిందం హిట్ తో పెద్ద డైరక్టర్ అయిపోయారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడానికి చాలా కారణాలు వున్నాయి. పాటలు, విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్, ఇలా చాలా వున్నాయి. సరే, క్రెడిట్ పరుశురామ్  ఖాతాలో పడింది. దాంతో ఆయన తరువాత సినిమా ఎవరికి అన్నది క్రేజీగా మారింది.

అప్పటికే ఆయనకు అడ్వాన్స్ లు ఇచ్చిన వారు కొందరు వున్నాయి. అందరి కన్నా ముందుగా 2008లో భోగవిల్లి ప్రసాద్ పాతిక లక్షలు ఇచ్చారు. గీతగోవిందం కన్నా ముందే సినిమా సంగతి గుర్తు చేస్తే, ఇదిగో అదిగో అంటూ గీతగోవిందం చేసారు పరుశురామ్. ఆ తరువాత అంటే మళ్లీ ఇదిగో అదిగో అంటున్నారు.

ఇలాంటి నేపథ్యంలో 14రీల్స్ తో సినిమాకు రెడీ అయిపోయారు. ఇప్పటికే పరుశురామ్ పద్దతి తెలిసి మంచు ఫ్యామిలీ తమ అడ్వాన్స్ తీసుకునో, వుంచుకునో ఓ సెటిల్ మెంట్ కు వచ్చినట్లు టాక్ వుంది. మైత్రీ మూవీస్ కూడా తమ అడ్వాన్స్ వెనక్కు తీసేసుకుంది. 

అడ్వాన్స్ ఇచ్చేయడం విషయం కాదు. ఓసారి మాట, కమిట్ మెంట్ అన్నాక చేయాలి కదా? అలా చేయకపోతే మాటకు విలువేముంటుంది? బోగవిల్లి ప్రసాద్ ఈ విషయంలో కాస్త బాధపడినట్లు తెలుస్తోంది. తను ఇచ్చిన అడ్వాన్స్ ఇప్పుడు వడ్డీతో కలిపి ఆరు కోట్లు అయిందని, వెనక్కు ఇవ్వమని నిర్మాతల చాంబర్ ను ఆయన ఆశ్రయించబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికీ పరుశురామ్ మాత్రం బోగవిల్లి ప్రసాద్ కు ఇదిగో సినిమా..అదిగో సినిమా అని నమ్మబలుకుతూనే వున్నట్లు బోగట్టా. ఏమైనా డైరక్టర్లు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, హిట్ వస్తే, మన వ్యవహారశైలి ఎలావున్నా బాగానే వుంటుంది. కానీ తేడా వస్తేనే, మన వ్యవహారశైలి నిర్మాతలకు గుర్తుకువచ్చి, అవకాశాలు దూరం చేస్తుంది.