ఏ వ్యవహారం ఎలా వున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వున్న చరిష్మా కాదనలేనిది. ఈ విషయం తెలుసుకనుకనే తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పవన్ పట్ల అత్యంత సున్నితంగా వ్యవహరిస్తున్నారు. అది వేరే సంగతి. ఇక సినిమా సంగతికి వస్తే, అజ్ఞాతవాసి ప్రీ రిలీజ్ బిజినెస్, టికెట్ ల బుకింగ్ గురించి వినవస్తున్న వార్తలు, ప్రీమియర్ షోలు, ఓవర్ సీస్ షోలు, బిజినెస్ ఇవన్నీ చూస్తుంటే కచ్చితంగా అతని చరిష్మా కాదనలేనిది అని ఒప్పుకోకతప్పదు.
నిజానికి అత్తారింటికి ముందు వెనుక పవన్ లిస్ట్ లో చాలా డిజాస్టర్లు వున్నాయి. అయినా కూడా అజ్ఞాతవాసి వాటికి పదింతలు బజ్ వస్తోంది. అంతకన్నా భయంకరమైన బిజినెస్ జరిగింది. అజ్ఞాతవాసి బిజినెస్ ఫిగర్స్ నే ఓ ఆశ్చర్యం. ఎందుకంటే అజ్ఞాతవాసి ముందు రెండు భయంకరమైన ఫ్లాపులు వున్నా కూడా. అయితే ఇక్కడ పవన్ ఫ్యాన్స్ వాదన వేరుగా వుంది. తెలుగులో టాప్ స్టార్ ల బ్లాక్ బస్టర్లు తో సమానంగా పవన్ ఫ్లాప్ సినిమాలు వసూలు చేస్తాయని. అదే పవన్ చరిష్మాకు పెద్ద ఉదాహరణ.
సర్దార్ గబ్బర్ సింగ్ కు అద్భుతమైన బజ్ వచ్చింది. బిజినెస్ జరిగింది. నిజానికి కాటమరాయుడుకు ఆ మేరకు బజ్ రాకపోయినా, బిజినిస్ విషయంలో లోటు జరగలేదు. రెండింటికీ బయ్యర్లు లాస్ అయ్యారు. ఇవన్నీ తెలిసి కూడా. ఆ రెండు సినిమాలకు కలిపి జరిగింనంత బిజినెస్ అజ్ఞాతవాసికి జరగడం విశేషం. బాహుబలి తరవాత తెలుగు సినిమాల్లో ఈ రేంజ్ బిజినెస్ జరగడం ఈ సినిమాకే.
ఏ ప్రచారం లేకున్నా
సోషల్ మీడియాలో విడియోలు, ట్వీట్ లు, వగైరా తప్ప, బేసిక్ పబ్లిసిటీ అంతగా స్టార్ట్ చేయలేదు ఇప్పటివరకు అజ్ఞాతవాసికి. అయినా అప్పుడే రెండు రోజుల కిందటే టికెట్ ల బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. ట్రయిలర్ రానేలేదు. అప్పుడే తొలి రోజులు ఆటలన్నీ ఫుల్ అయిపోయాయి. పైగా రెండు వందల కామన్ టికెట్ అన్నా జనాలకు ఏమీ తేడా కనిపించలేదు.
దాదాపు అన్ని మీడియాలు అజ్ఞాతవాసి వార్తల చుట్టూనే తిరుగుతున్నాయి. సినిమా విడుదల ఇంకో మూడు రోజులకు వచ్చేసినా ఇప్పటికి ఓ మీడియా మీట్ లేదు, టెక్నీషియన్ల, నటీనటుల ఇంటర్వూలు లేవు. అయినా వార్తలతో పత్రికలు నిండిపోతూనే వున్నాయి. పవన్-త్రివిక్రమ్ స్టిల్స్ మహా అయితే హీరోయిన్ల స్టిల్స్ ఇవి చాలు ఫ్యాన్ ఆనందించడానికి.
ఓవర్ సీస్ మార్కెట్
ఓవర్ సీస్ లో అజ్ఞాతవాసి రికార్డులు సృష్టించేలా వుంది. బాహుబలి సిరీస్ ను పక్కన పెడితే, అజ్ఞాతవాసి అమ్మకాలు, దానికి జరుగుతున్న ప్రచారం, విడుదలవుతున్న థియేటర్ల సంఖ్య అన్నీ అబ్బురాలే. మూడున్నర మిలియన్ల వసూళ్లు అంటే కనీసం దగ్గర దగ్గర మన కరెన్సీలో పాతిక కోట్లు వసూలు చేయాలన్నమాట. ఇప్పటి దాకా ఏ ఇండియన్ సినిమా విడుదలచేయనన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు అక్కడ.
నెంబర్లే నెంబర్లు
బాహుబలి తరువాత మన జనాలకు నెంబర్ల మీద దృష్టి బాగానే పెరిగింది. అజ్ఖాతవాసి కనుక బ్లాక్ బస్టర్ అయితే వరల్డ్ వైడ్ థియేటర్ల వసూళ్లు 150కోట్ల మార్కుకు పైగానే వుంటాయి. ఓ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సినిమా ఈ మేరకు వసూలు చేయడం అంటే అది నిజంగా చెప్పుకోదగ్గ విషయమే. కానీ ఇదే సమయంలో తేడా జరిగినా ప్రమాదమే. అజ్ఞాతవాసి తరువాత వచ్చే భారీ సినిమాల మీద ఆ ఫ్రభావం పడుతుంది.
అన్నీ అలా వుంచితే అజ్ఞాతవాసికి ఇంత భారీ హడావుడి జరుగుతోంది అంటే అందులో సగం క్రెడిట్ త్రివిక్రమ్ దే అనడంలో సందేహం లేదు. ఈ సినిమా హిట్ అయితే త్రివిక్రమ్ తెలుగులో టాప్ డైరక్టర్ గా వుంటారనడంలో సంధేహం లేదు. ఇక్కడ రాజమౌళి కన్నానా, రాజమౌళి తరువాతనా? అన్న డిస్కషన్ కు తావు లేదు. రాజమౌళి రాజమౌళినే, త్రివిక్రమ్, త్రివిక్రమ్ నే.