ఎకరా ఇరవై కోట్లు వున్న దగ్గర ఇరవై లక్షలకే ఎవరైనా ఇస్తే ఏమంటారు. ఆహా.. భలే మంచి చౌకబేరము అనే కదా? గుంటూరు-మంగళగిరి ప్రాంతంలోని కాజా దగ్గర రెండు ఎకరాల స్థలం జస్ట్ నలభై లక్షలకు, మరో నలభై వేలు రిజిస్ట్రేషన్ ఖర్చులకు దొరికేసింది. ఎవరికో కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు.
ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కొన్ని డాక్యుమెంట్లు కూడా ఫేస్ బుక్ లో చలామణీ అవుతున్నాయి. మరి ఆ డాక్యుమెంట్లు నిజమైనవే అయితే పవన్ కేవలం నలభై లక్షలకు రెండు ఎకరాల స్థలం సంపాదించినట్లు.
ఇంత కారు చౌకగా పవన్ కు స్థలం ఎందుకు ఇచ్చేసినట్లు? అన్న ప్రశ్న కనుక వస్తే, అసలు ఎవరు ఇచ్చారు అన్న ప్రశ్న కూడా వస్తుంది. అలా ఇచ్చింది రాజధాని ప్రాంతంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లింగమనేని కుటుంబానికి చెందిన ఎల్ ఇపిఎల్ స్మార్ట్ సిటీ ప్రయివేట్ లిమిటెడ్.
ఈ సంస్థ అనగానే జనాలకు చాలా గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా కృష్ణానది కరకట్ట మీద అక్రమంగా నిర్మించిన భారీ గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్ కు కృష్ణానదితో ప్రయివేట్ జెట్టీ మాదిరిగా అనుసంధానం. ఈ గెస్ట్ హౌస్ నే ఇప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రి అధికార నివాసం అయింది. ఏ ప్రభుత్వం అయితే అక్రమ కట్టడాన్ని కూల్చాలో, అదే ప్రభుత్వం దాన్ని లీజుకు తీసుకుంది. ఇంకేముంది ఖేల్ ఖతమ్.
అలాంటి భారీ పలుకుబడి వున్న సంస్థ నుంచి పవన్ కళ్యాణ్ రెండు ఎకరాలను కారు చౌకగా కొనేసారన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం. కనిపిస్తున్న డాక్యుమెంట్లు అయితే అదే విషయం ధృవీకరిస్తున్నాయి. మరి జనసేన సభ సాక్షిగా దీనికి పవన్ కళ్యాణ్ ఏమయినా సమాధానం చెబుతారా? లేక వాళ్లు అంతకే అమ్మారు. అక్కడ గవర్నమెంట్ రేటు అంతే వుంది. నేను కొన్నాను. తప్పేముంది? అని తప్పించుకుంటారా?
లేదూ ఫలానా నాయకుడు ఎకరాలు కొనలేదా? అప్పుడు అడిగారా? అనే టైపులో ఎదురుదాడికి దిగుతారా? మొత్తానికి రెగ్యులర్ మీడియా చేయని పనిని సోషల్ మీడియా చేసి, డాక్యుమెంట్లు తవ్వి తీసినందుకు మెచ్చుకోవాలి.