జియో ప్రైమ్ మెంబర్ షిప్ గుర్తుందా..? కేవలం వంద రూపాయలు కట్టి జియో యాప్స్ అన్నింటినీ ఏడాదిగా ఎంజాయ్ చేస్తున్నారు కస్టమర్లు. జియో సినిమా, జియో మ్యూజిక్, జియో ఛాట్, జియో టీవీ.. ఇలా ఒకటేంటి జియోకు సంబంధించి సమస్తం ఈ వంద రూపాయల రీచార్జ్ కిందకు వచ్చేసింది.
ఇప్పుడీ ముచ్చటంతా ఎందుకంటే.. జియో ప్రైమ్ మెంబర్ షిప్ గడువు ఈ నెలాఖరుతో ముగిసిపోతుంది. మార్చి 31తో జియో మెంబర్ షిప్ పూర్తవుతుంది. పరిమితకాల ఆఫర్ కింద, ఖరీదైన యాప్స్ ను కేవలం వంద రూపాయలకే ఇచ్చిన జియో ఇప్పుడేం చేయబోతోంది. మళ్లీ వంద రూపాయల ఆఫర్ నే కొనసాగిస్తుందా..? లేక అమెజాన్ ప్రైమ్ లా వెయ్యి రూపాయలు చేస్తుందా..?
డిజిటల్ స్ట్రీమింగ్ విభాగంలోకి ప్రవేశించిన అమెజాన్ ప్రైమ్ ప్రారంభంలో తమ సినిమాలన్నింటినీ వినియోగదారులకు కొంతకాలం ఉచితంగా, ఆ తరువాత 500 రుసుము వసూలు చేసింది. దీనిద్వారా అమెజాన్ సైట్ లో కొనుగోలు చేసినవారికి వన్ డే ఫ్రీ డెలివరీ ఆఫర్ చేసింది. ప్రైమ్ మెంబర్ షిప్ కలిగిన వారికోసం ప్రత్యేకంగా కొనుగోలు ఆఫర్స్ ను మిగతా వారికంటే ముందుగా అందించింది. ఇది బాగా క్లిక్ అయిన తర్వాత ఇప్పుడు తన మెంబర్ షిప్ రుసుమును 999 రూపాయలు చేసింది. మరి జియో కూడా ఇలానే సబ్ స్క్రిప్షన్ రేటు పెంచుతుందా..?
ప్రస్తుతానికైతే జియో అలాంటి నిర్ణయాలు తీసుకోదనే అంటున్నారు విశ్లేషకులు. టెలికం రంగంలో అనిశ్చితి, పోటీ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో.. తిరిగి వంద రూపాయల మెంబర్ షిప్ నే కొనసాగిస్తుందని అంటున్నారు. మరికొందరు మాత్రం నామమాత్రంగా మరికొంత మొత్తాన్ని పెంచే అవకాశం ఉందంటూ వాదిస్తున్నారు.
ప్రస్తుతం జియో కస్టమర్లలో 80శాతం మంది జియో ప్రైమ్ మెంబర్ షిప్ కలిగి ఉన్నారు. మెంబర్ షిప్ ఫీజు ఏమాత్రం పెంచినా.. జియో కస్టమర్ల సంఖ్య తగ్గదు కానీ మెంబర్ షిప్ తీసుకునే వాళ్ల సంఖ్య పడిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి దీనిపై జియో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ప్రస్తుతం జియో ఊపు చూస్తుంటే ఈ వంద రూపాయలు కూడా తీసేసి మొత్తం ఫ్రీ అని ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.